Friday, 6 September 2024

విషాదం అల్లుకున్న అందం


మధుబాల... 

ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పాట... "ప్యార్ కియాతో ఢర్నా క్యా". ఆమె జీవితం కూడా అంతే నిర్భీతితో కూడిన ఒక ప్రణయ కావ్యం. 

కట్ చేస్తే -

సౌందర్య స్పృహ, శైలి, ఠీవి... ఇవన్నీ కలబోసిన రాణి మధుబాల. 

మధుబాల అసలు పేరు ముంతాజ్ బేగం.

"హీరోయిన్‌గా ఆమె కెరీర్‌లో ఆమెను పట్టుకోడానికి ప్రయత్నించిన వేలాది ఫోటోలేవీ ఆమెలోని నిజమైన అందాన్ని ఆవిష్కరించలేకపోయాయి" అన్నాడు ప్రహ్యాత ఫిలిం జర్నలిస్టు బి కె కరంజియా. 

"శిల్పం లాంటిది" అన్నాడి దేవానంద్. 

"ఇండియన్ స్క్రీన్ మీద వీనస్" గా అభివర్ణించాడు ఫిలిం ఇండియా ఎడిటర్ బాబూరావు పటేల్. 

అప్పటి టాప్ హీరో దిలీప్ కుమార్‌తో ఆమె విఫల ప్రేమ సుమారు దాశాబ్దం పైగా  నడిచింది. తర్వాత కిషోర్ కుమార్‌తో పెళ్ళి ఓ ఏడెనిమిదేళ్ళ తర్వాత విఫలమైంది. 

తొమ్మిదేళ్ళప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ప్రవేశించి, 27 ఏళ్ళపాటు సుమారు 73 సినిమాల్లో నటించి తెరమీద చెరగని ముద్రవేసింది మధుబాల. 

మహల్, కాలా పాని, హౌరా బ్రిడ్జి, మిస్టర్ అండ్ మిసెస్ 55, బర్సాత్ కి రాత్, మొఘలే ఆజమ్ వంటివి ఆమె నటించిన కొన్ని మంచి క్లాసిక్ సినిమాలు.

మొఘలే ఆజమ్ సినిమాలో దిలీప్ కుమార్, మధుబాల నటించి మెప్పించిన కొన్ని అత్యంత క్లాసిక్ రొమాంటిక్ సన్నివేషాల షూటింగ్ సమయం నాటికే వారిద్దరి ప్రేమ విఫలమైంది, వారిద్దరి మధ్య అసలు మాటలేవు అన్న విషయం తెలిసినప్పుడు నిజంగా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.   

అప్పటి హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాంక్ కాప్రా మధుబాలతో సినిమా తీయాలనుకున్నాడు. అది వేరే కథ.   

నాణేనికి మరోవైపు, హీరోయిన్‌గా టాప్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఆమె జీవితమే ఒక బిజినెస్ గాంబ్లింగ్‌గా మార్చారామె కుటుంబసభ్యులు. ఇదంతా అసలు పట్టించుకోకుండా బ్రతికినన్నాళ్ళూ తనకు నచ్చిన ప్రేమ కోసమే అన్వేశిస్తూ, ఆ అన్వేషణలోనే కేవలం 36 ఏళ్ళకే ఆమె మరణించడం అనేది భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి అత్యంత విషాద ఘట్టం.      

నిరంతరం ప్రేమ సౌందర్యం కోసం తపించిన ఈ సౌందర్య రాశి పుట్టినతేదీ, ఇప్పటి వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 కావడం యాదృచ్చికం. 

- మనోహర్ చిమ్మని 

1 comment:

  1. ఈ పోస్టు ఎవరినో దృష్టిలో పెట్టుకొని రాసినట్టుందే! జస్ట్ అలా అనిపించింది...

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani