"తుపాకి రాముని లెక్క కోతల్ కోసుడు, ఆర్జీవీ లెక్క మ్యానిప్యులేట్ చేసుడు... గీ రెండు తెలిస్తె సాలు. ప్రొడ్యూసర్లకు, హీరోలకు స్టోరీ జెప్పి పడేసుడు ఈజీ..."
సెల్ఫ్ మోటివేషన్-కమ్-మెడిటేషన్లకెల్లి బైటికొచ్చి కండ్లు తెరిచిండు మన డైరెక్టర్... మిస్టర్ డి.
కట్ జేస్తె -
"బియాండ్ కాఫీ" హోటల్ల ప్రొడ్యూసర్ ముందట కూసోని టెన్షన్ టెన్షన్‌గ ఆయిన మొకంలోకే సూత్తున్నడు మిస్టర్ డి.
మిస్టర్ డి, ప్రొడ్యూసర్‌కు కత జెప్పి ఆల్రెడి ఆయిదు నిమిషాలైంది.
మస్ట్ ఇంటెన్సిటీతో ఉన్న ఆ కత గురించే ఆలోచిస్తున్నట్టు, ఎదురుంగ డైరెక్టర్ను పెట్టుకొని ఎటో చూస్తున్నడు ప్రొడ్యూసర్.
"చానా కొత్త పాయింట్. మస్త్ ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ. ఒక్క పాట లేకున్నా హిట్టయ్యే స్టోరీ గిది... నిజంగా ఈ కతల అంత దమ్ముంది!"
అప్పటిదాకా మిస్టర్ డి మొకం కొద్ది కొద్దిగా ప్లెజెంట్ అయింది.
"కని, రిస్కు అవుద్ది హిట్ కాకపోతె. ఇంకో లైన్ జెప్పు!"
అనేసి, సిగిరెట్ ఎలిగిచ్చి గప్ప గప్ప గుంజుడు మొదలుపెట్టిండు ప్రొడ్యూసర్.
మిస్టర్ డి మొకంల చిన్న షాకు!
సెకండ్లలోనే సర్దుకొని, "సర్, ఇంకో లైన్ జెప్తా..." అన్నాడు.
"ఊ చెప్పు చెప్పు" అన్నాడు ప్రొడ్యూసర్.
కుర్చీ ఎడ్జ్ మీద కూర్చొని, కొత్త స్టోరీలైన్ చెప్పుడు మొదల్వెట్టిండు మిస్టర్ డి...
"కట్ జేస్తె... నైట్ ఎఫెక్టు... నేషనల్ హైవే 44 మీద డ్రోన్ షాట్ పెట్టినం సార్. చీకట్ల బ్లాక్ కోబ్రా లెక్కున్న రోడ్ మీద తెల్లటి బీయండబ్ల్యూ జమ్మున పోతాంది.... దాంట్ల హీరో ఉన్నడు...
కట్ జేస్తె... వరంగల్ల ములుగురోడ్... గక్కడ వంగపాడు అనే ఒక మస్త్ ఆసమ్ లొకేషన్... చిన్న మిడిల్ క్లాస్ డాబా ఇల్లు... లోపల బెడ్రూం... స్లీవ్‌లెస్ బనీను, చిన్న షార్ట్స్‌ల నిద్రపోతున్న హీరోయిన్ ఇంట్రడక్షన్... ఒక పూజా హెగ్డేను ఊహించుకోండి...
కట్ జేస్తె... ఫ్యాన్ గాలికి గప్పుడే హీరోయిన్ వొంటిమీదున్న గా బనీను జెర్ర పైకి లేచింది... లేచింది... లేచింది... బొడ్డు చూపించాం... ధన్ మని హీరోయిన్ బెడ్ మీద లేచి కూసుంది...
కట్ జేస్తె... అక్కడ హైవే నంబర్ 44 మీద హీరో కారు డివైడర్‌ను గుద్దుకొని దబ దబ దబ పది పల్టీలు గొట్టింది...
కట్ జేస్తె... ఇక్కడ మన హీరోయిన్ ధన్ మని మల్ల పండుకున్నది!..."
స్ప్రింగు లెక్క లేచి నిల్చున్నడు ప్రొడ్యూసర్.
"కట్ జేస్తె... సిన్మా టైటిల్ "హైవే నంబర్ 44"... కరెక్టా?" ఏదో కనుక్కున్న సైంటిస్టు లెక్క అరిచిండు ప్రొడ్యూసర్.
"అర్రె... అదే సార్ టైటిల్! మీరెట్ల కనుక్కున్నరు?!" షాకు తిన్నట్టు అడిగిండు మిస్టర్ డి.
"ఇంక నువ్వేం జెప్పద్దు. నాకు కత మొత్తం అర్థమైంది... సైకలాజికల్ థ్రిల్లర్... గిదే మన సిన్మా. మనం జేస్తున్నం!"
షేకాండిచ్చిండు ప్రొడ్యూసర్.
ఆరాత్రే అడ్వాన్సు కింద పది లక్షల చెక్కు తీసుకున్నాడు మిస్టర్ డి.
కట్ జేస్తె -
కట్ జేస్తె -
"నా బీటెక్ ఫైనలియర్ నుంచి మొన్నమొన్నటిదాక నా ప్రాణం పెట్టి, చెక్కిందే చెక్కుకుంట, ఆరేండ్లు రాసుకున్న కతరా అది... మణిరత్నం, భన్సాలి, గౌతం మీనన్ రేంజ్ మస్త్ ఇంటెన్స్ లవ్ స్టోరి... మనోనికి నచ్చలే!... అప్పటికప్పుడు నా నోటికచ్చినట్టు చెప్పిన ఫస్ట్ లైన్‌కే పడిపోయిండ్రా!!"
"కంగ్రాట్స్ మామా, నువ్వు సూపర్... ప్రొడ్యూసర్ పల్స్ పట్టుకున్నవ్ అంటె, ప్రేక్షకుని పల్స్ పట్టుకున్నట్టె! నీ డెబ్యూ సిన్మ హిట్టుపో మామా!!"
మణికొండల ఒక అపార్ట్‌మ్మెట్ పెంటౌజ్ మీద మిస్టర్ డి అండ్ ఫ్రెండ్స్ చేతులల్ల బీర్ బాటిల్ల మీద మూతలు టప్ప టప్ప లేస్తున్నై...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani