Wednesday, 3 July 2024

మా సాదిక్ అంటే నాకెందుకంత ఇష్టం?


ఉస్మానియా యూనివర్సిటీలో నా సీనియర్, హాస్టల్ మేట్, మిత్రుడు, దాదాపు మూడున్నర దశాబ్దాల మా స్నేహంలో ఇంకా నన్ను ప్రేమగా "మనూ" అని పిలిచే అతి కొద్దిమంది ఆత్మీయ మిత్రుల్లో ఒకరు... మా సాదిక్ భాయ్.  

ఓయూలోని "ఏ" హాస్టల్లో ఆయన రూం నంబర్ 35 అయితే, నాది 55. 

ఓయూలో ఉన్నప్పుడే మా జూనియర్స్, సీనియర్స్ కలిసి ఒకసారి ఒరిస్సా టూర్‌కు వెళ్ళాం. అదిగో, అక్కడ మొదటిసారి మేమిద్దరం కలిసి ఓ పక్కగా వెళ్ళి, సిగరెట్ వెలిగించి, అదీ ఇదీ మాట్లాడ్డం మొదలెట్టాం. భువనేశ్వర్‌లోని పాంథ నివాస్ హోటల్ ఆవరణలో ఆ సాయంత్రం, అలా తిరుగుతూ, అప్పుడు మేం ప్రారంభించిన ఆ కబుర్లు, ఆ ముచ్చట్లు... ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నిన్న రాత్రి కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం.    

కట్ చేస్తే -   

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అది అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

ఆమధ్య ఓ తొమ్మిదేళ్ళక్రితం అనుకుంటాను... నాకో విషయంలో (డబ్బు కాదు) మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, నా ఇంకో పది క్రియేటివ్ వ్యాపకాల బిజీలో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాను. దాదాపు మర్చిపోయాను.     

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు సాదిక్! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేటంతగా!!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదు.

నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు.  

కట్ చేస్తే -   

మా సాదిక్ గురించి ఇప్పుడు రాస్తున్నదంతా ఒక ఫ్లోలో, ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. భరించాలి. 

భరించాలి అని ఎందుకంటున్నానంటే - సాదిక్ జీవితం, సాదిక్ జీవనశైలి చాలా కోణాల్లో చాలామందికి ఇన్‌స్పిరేషన్. 

"బతికితే సాదిక్‌లా బతకాలి" అనిపించేంత ఇన్‌స్పిరేషన్!

సాదిక్ ఎలా బ్రతకాలనుకుంటాడో అలా బ్రతుకుతాడు. ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. అది నాకిష్టం. 

అందరికీ సాధ్యం కాదు, సాధ్యం చేసుకోలేరు.

కొన్నేళ్ళ క్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి గురించి, సమయం విలువ గురించీ - సాదిక్ నాతో ఒక మాట చెప్పాడు.  

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సమయం, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి, ఎన్నెన్నో సాధించి చూపించాడు! 

దటీజ్ సాదిక్.   


కట్ చేస్తే -   

అసలు "తోపుడు బండి" ఏంటి? అందులో పుస్తకాలు పెట్టుకొని, దాన్ని ఆయనే తోస్తూ పుస్తకాలు అమ్మడమేంటి? అదే తోపుడు బండిని తోస్తూ, సాదిక్ 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యడమేంటి?  

అప్పట్లో హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో సాదిక్ "తోపుడు బండి స్టాల్" అంటే సెన్సేషన్. ఏ వీఐపీ అయినా సరే, బుక్ ఫెయిర్‌కొస్తే తోపుడు బండి స్టాల్ విజిట్ చెయ్యాల్సిందే! ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా సాదిక్ స్టాల్ సందర్శించారు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.   

హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఫోటోలు, సెల్ఫీల కల్చర్‌ను పరిచయం చేసిన పయొనీర్ సాదిక్. బుక్ ఫెయిర్‌లో "తోపుడుబండి" స్టాల్ ఇప్పుడు లేకపోయినా - ఆయన పరిచయం చేసిన "ఫోటోల పండుగ" మాత్రం హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇంకా కొనసాగుతోంది. 

"తోపుడు బండి సాదిక్" గా పాపులర్ అయిన మా సాదిక్ సోషల్ సర్విస్ ప్రయోగాలు అక్కడితో ఆగలేదు... 

ఎక్కడో అడవిలో ఒక సినిమా సెట్‌లా పెద్ద కుటీరం వేసాడు. అక్కడి ఆదివాసి పిల్లలు, ప్రజలకు కావల్సిన ఆహారం, బట్టలు, పుస్తకాలు, చలికాలం స్వెట్టర్లు వంటివి ఇవ్వటం కొన్నాళ్లపాటు ఒక ఉద్యమంలా చేసాడు.   

కోవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో కూడా - ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... ఇలా చాలానే చేశాడు సాదిక్. 

ఇప్పుడు తన పుట్టిన ఊరు కల్లూరులో (ఖమ్మం జిల్లా) - తన సోషల్ సర్విస్ యాక్టివిటీ కోసమే ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టుకొని, ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని స్కూల్స్‌కు, స్టుడెంట్స్‌కు ఎన్నో విషయాల్లో సహాయం అందిస్తున్నాడు. 

ఒకసారి నేను కల్లూరు వెళ్ళినప్పుడు - సాదిక్ సోషల్ యాక్టివిటీ గోడవున్‌లో - పిల్లలకిచ్చే వందలాది కొత్త సైకిళ్ళు, గుట్టలకొద్దీ కొత్త పుస్తకాల కట్టలు, పుస్తకాల బ్యాగులు, స్వెట్టర్లు, చెద్దర్లు వంటివి చూసినప్పుడు కలిగిన అనుభూతి... నిజంగా అదొక గూస్‌బంప్స్ మూమెంట్.     

సాదిక్ అందిస్తున్న సహాయంతో చాలా స్కూళ్ళల్లో పిల్లలు రికార్డ్ స్థాయిలో మంచి రిజల్ట్స్ సాధించి, వారు చదువుతున్న ఆయా స్కూల్స్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెడుతున్నారు.

ఎంతో మంది బాగా చదివే పిల్లలు ఉన్నత చదువుల కోసం డబ్బులేక చదువు ఆపే పరిస్థితుల్లో, వారందరికి ఫీజులు, ఇతర ఏర్పాట్లు చేస్తూ పై చదువులకు పంపిస్తున్నాడు.

స్పోర్ట్స్, గేమ్స్‌లో ఆసక్తి ఉన్న ఎంతో మంది గ్రామీణ స్కూల్స్‌లోని పిల్లలకు అవసరమైన సహాయం చేసి, ఎన్నోసార్లు వాళ్లచేత టోర్నమెంట్స్ గెలిపించాడు, కప్పులు తెప్పించాడు.  

సాదిక్ తలపెట్టిన ఎన్నో సాంఘిక సేవా యజ్ఞాల్లో ఇదంతా ఒక నాన్-స్టాప్ యజ్ఞం.    


అయితే - నిజానికి ప్రభుత్వాలు చెయ్యవల్సిన ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలన్నీ సాదిక్ ఏదో పేరు కోసమో అవార్డుల కోసమో చెయ్యటం లేదు. 

ఇదంతా - తన వ్యక్తిగత ఆసక్తి. తన ఇష్టం. తన తపన.

అంతే.  

కట్ చేస్తే -   

ఇక్కడొక మాట ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది... సాదిక్‌ను ఇష్టపడి, ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఉష లేకపోతే సాదిక్ జీవితంలో బహుశా ఇవన్నీ అంత సులభంగా సాధ్యమయ్యేవి కావని నాకనిపిస్తుంటుంది. బహుశా అందుకేనేమో, సందర్భం వచ్చినపుడల్లా ఎలాంటి భేషజాల్లేకుండా తన జీవన సహచరి ఉష గురించి, తన జీవితంలో, తన విజయాల్లో ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్తుంటాడు సాదిక్.    

పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా ఆయనకున్న హేమాహేమీల పరిచయాలు, జ్ఞాపకాలు అనేకం. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎదుగుదల, ఆయన సంపాదన కూడా అసలెవ్వరూ ఊహించని స్థాయిది. 

సాదిక్‌కు జ్యోతిష్యం తెలుసు. హిమాలయాలకు వెళ్తాడు. చాలామంది బిజినెస్ పీపుల్, వివిధ రంగాల్లోని మిత్రులు, ప్రముఖులు ఆయన సలహాల కోసం వ్యక్తిగతంగా సంప్రదిస్తుంటారు. ఇది చాలామందికి తెలియని ఆయనలోని ఇంకో రహస్య కోణం.   

అదంతా రాయాలంటే బ్లాగ్ సరిపోదు. ఒక బయోగ్రఫీ అవుతుంది.     

అప్పుడు ఎంత సంపాదించాడో ఇప్పుడంత సాంఘిక సేవచేస్తూ ఖర్చుపెడుతున్నాడు సాదిక్. తన స్థోమతను మించి అవసరమయినప్పుడు, సింపుల్‌గా ఫేస్‌బుక్‌లో ఒక సింగిల్ లైన్ పోస్టు పెట్టడం ద్వారా, సోషల్ సర్విస్ పట్ల ఆసక్తి ఉన్నవారి నుంచి అప్పటి అవసరానికి తగినంత సపోర్ట్ కూడా అందుకుంటున్నాడు.    

అసలు సోషల్ మీడియాను - పాజిటివ్ కోణంలో - సోషల్ సర్విస్ కోసం కూడా ఎంత బాగా వాడొచ్చో సాదిక్ నుంచి నేర్చుకోవచ్చు. 


బై ది వే - మా సాదిక్ భాయ్‌కి అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఓనమాలు నేర్పించింది నేనే అని అప్పుడప్పుడూ నాకు సరదాగా గుర్తు చేస్తుంటాడు సాదిక్.  

సాదిక్ తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. తను చేస్తున్న పనిలోనే జీవితాన్ని అనుక్షణం అనుభవిస్తాడు.  

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం.  

ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా, నా ఆత్మీయ మిత్రుడు సాదిక్‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 

లవ్ యూ అన్నా, త్వరలోనే కలుద్దాం.        

- మనూ 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani