Friday, 24 September 2021

Guy on the Sidewalk

"ఒక ట్వీట్ పెట్టినా సరే ఏదైనా ప్రయోజనం ఉండాలి సర్!"

చాలా రోజుల క్రితం నేనూ, మా భరత్ కారులో ప్యారడైజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వెళ్తుండగా తను ఈ మాట అనటం నాకింకా గుర్తుంది.

ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో అది ఎంతవరకు సాధ్యం అన్నది పక్కనపెడితే, భరత్ చెప్పినదాంట్లో నేను చాలా అర్థాలు తీసుకున్నాను. అతనన్న ఈ మాట నాకు తరచూ గుర్తుకొస్తూంటుంది. 

ఒక ఫేస్‌బుక్ పోస్టు పెట్టినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక బ్లాగ్ పోస్టు రాసినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దానికో పరమార్థం ఖచ్చితంగా ఉండాలి. అది ఉట్టి ఐదు నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు. మన జీవితంలో కొంత సమయాన్ని అక్కడ వెచ్చిస్తున్నాం. ఆ సమయానికి చాలా విలువుంది. 

మనం రాసేది ఒక వాక్యం కావచ్చు, ఒక పేరాగ్రాఫ్ కావచ్చు, ఒక పేజీ కంటెంట్ కావచ్చు. మన రైటింగ్‌కు కూడా ఒక విలువ ఉంటుందన్నది మనం గుర్తుంచుకోవాలి.   

ఇవన్నీ నిజంగా పాటించలేనప్పుడు అసలు సోషల్‌మీడియా వైపు వెళ్లకపోవడమే మంచిది. హాయిగా ఒక పుస్తకం ఏదైనా చదువుకోవచ్చు. ఇంకేదైనా ఇంటి పని చేసుకోవచ్చు. చాలాకాలంగా పలకరించని ఒక ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చెయ్యొచ్చు. వీటన్నిటికంటే ముందు ఇంట్లో పిల్లలతో, జీవిత భాగస్వామితో మంచి క్వాలిటీ టైమ్ గడపొచ్చు.

ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా అంటే "యస్" అనే చెప్తాను.

ఫేస్‌బుక్, ట్విట్టర్లో ఓ రెండు ఫొటోలు, రెండు కొటేషన్స్, ఏదో ఒక సినిమా స్టఫ్ పోస్ట్ చేయటం ద్వారా నేను పొందుతున్న మొట్టమొదటి ప్రయోజనం... దైనందిక స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్. రెండో ప్రయోజనం ప్రొఫెషనల్‌గా నాకు అవసరమైన కొంత బజ్, సెల్ఫ్ మార్కెటింగ్.  ఈ రెండు ప్రయోజనాల కోసం రోజుకో 30-40 నిమిషాలు పెద్ద నష్టం కాదనుకుంటాను.   

ఈ బ్లాగింగ్ కూడా అంతే... ఒక స్వీయ విశ్లేషణ. ఒక థెరపీ. ఒక మెడిటేషన్. ఒక పాజిటివ్ ఎడిక్షన్.    

కొన్ని సంకెళ్లు తెంచుకోవాలంటే కొన్ని చేయక తప్పదు. అలా చేయాల్సింది రైటింగ్, సినిమాలు, ఇతర క్రియేటివ్ పనులే అయినప్పుడు ఆ మజానే వేరు. 

So much to do. So little time. 

కట్ చేస్తే -

ఈ పోస్టు ప్రారంభంలో నేను ప్రస్తావించిన భరత్ ఎవరోకాదు. నేను గుంటూరు నవోదయ విద్యాలయలో పనిచేసినప్పుడు నా విద్యార్థి భరత్‌కృష్ణ. ఇండియాలో, అమెరికాలో నానా జాబ్స్ చేసి "ఓస్ ఇంతేనా" అని ఇండియాకు తిరిగొచ్చాడు. ఇప్పుడేదో స్టార్టప్ సన్నాహాల్లో ఉన్నాడు. 

అతని తొలి బెస్ట్‌సెల్లర్ ఇంగ్లిష్ నవల టైటిల్ నాకు చాలా ఇష్టం... 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani