సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.
తండ్రి తిరుపతయ్య ‘స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ఎన్ ఎమ్ డి సి’ పాల్వంచలో రిటైరయ్యారు. తల్లి లింగమ్మ గృహిణి. క్రమశిక్షణ, పొదుపు, అందరితో బాగుండటం అనేది తల్లిదండ్రుల నుంచే వచ్చింది.
ఒక మనిషి ఉన్నంతలో సుఖంగా బ్రతకాలంటే ఈ మూడే ముఖ్యం. వీటిల్లో ఏ ఒక్కటి బాగాలేకపోయినా మిగిలిన రెండు సరిగ్గా ఉండవు అని బాగా నమ్మినవాడు, ఆచరిస్తున్నవాడు.
ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదు. అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి కూడా అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి అన్నది కూడా మనసా-వాచా-కర్మేణా నమ్మి ఆచరిస్తున్నవాడు.
అలాంటి నేలమీదుండే మనిషితను.
భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక పాప – వైష్ణవి, ఒక బాబు – జైశ్రీరామ్.
ఆల్ హాపీస్…
అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 2020 ఫిబ్రవరి వరకు, లండన్ టెక్ మహేంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు అదే లండన్‌లో సొంతంగా బీవీఆర్ టెక్ పేరుతో కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ చేస్తున్నాడు.
అతని పేరు భువనగిరి నవీన్.
కట్ చేస్తే –
యూకే వెళ్ళి చదువుకొని, అక్కడే కెరీర్ ప్రారంభించాలనుకొనే ఔత్సాహిక విద్యార్థులకోసం సలహా ఇస్తూ ఇలా చెప్పాడు నవీన్:
“బోధనకూ, పరిశోధనకూ యునైటెడ్ కింగ్‌డమ్ విద్యాసంస్థలు బాగా పేరుపొందాయి. తక్కువ కాలవ్యవధి కోర్సులు, ఫాస్ట్ ట్రాక్ డిగ్రీలు , కోర్సుతో పాటు ఇంటర్న్‌షిప్ ఇక్కడి ఆకర్షణలు. గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యు.కె. విశ్వవిద్యాలయాలెన్నో ముందువరసలో స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం తగ్గించుకోవటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలను ఇప్పుడు యూకే బాగా ప్రోత్సహిస్తోంది.
అమెరికా కంటే ముందే విదేశీవిద్యకు ప్రాచుర్యం పొందింది యు.కె.నే! ఇక్కడి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లాంటి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎంతోకాలం నుంచి అత్యుత్తమ విద్యకు పేరుపొందాయి. యు.ఎస్.తో పోలిస్తే యు.కె.లో కోర్సులు పూర్తిచేయటానికి ఏడాది తక్కువ పడుతుంది. యు.ఎస్.లో బ్యాచిలర్ డిగ్రీ 4 ఏళ్లు అయితే, యు.కె.లో 3 ఏళ్లు మాత్రమే. పీజీకి యు.ఎస్.లో 2 ఏళ్లు పడుతుంది, కాని యు.కె.లో ఏడాది మాత్రమే!
ఇక, చదువుకోవటానికి అయ్యే ఖర్చు అమెరికాతో పోలిస్తే యు.కె.లో కొంత తక్కువ.
యూకేలో 3 విడతల్లో ప్రవేశాలు లభిస్తాయి:
మొదటిది (టర్మ్ 1) సెప్టెంబరు – డిసెంబరు.
రెండోది (టర్మ్ 2) జనవరి – ఏప్రిల్.
మూడోది (సమ్మర్) ఏప్రిల్ – జూన్.
ప్రస్తుతం డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు, పూర్తయిన వాళ్లు టర్మ్ 2, 3 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రక్రియను ప్రారంభించవచ్చు. సుమారు 6 నుంచి 12 విద్యాసంస్థలను ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది.
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి యూకే చక్కని అవకాశాలని కల్పిస్తున్నది.రాబోవు రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మషీన్ లర్నింగ్ వంటి టెక్నాలజీల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు చక్కగా ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు. డిసెంబర్ 1, 2020 నుండి యూకే ప్రభుత్వం కొత్త ‘పాయింట్ బేస్డ్ ఇమ్మిగ్రషన్ సిస్టం’ ను ప్రవేశ పెట్టింది. విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక ఈ స్కిల్డ్ వర్కర్ వీసాలతో యూకే లో సెటిల్మెంట్ పొందటానికి మంచి అవకాశం ఉంది”
నగ్నచిత్రం బ్లాగ్ పాఠకుల్లో ఉన్న తల్లిదండ్రులూ, స్టుడెంట్స్ కోసం అడిగినప్పుడు, నవీన్ ఇంత సమాచారాన్ని అందించడం అభినందనీయం.
కట్ బ్యాక్ టు నవీన్ –
కోవిడ్19 ఎఫెక్ట్ మొదటినుంచీ యూకేలో ఒక రేంజ్‌లో ఉంది. సాక్షాత్తూ ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్ కూడా కరోనాబారినపడ్డాడు! ఇప్పుడు మరిన్ని వేరియేషన్‌తో యూకేలో కరోనా పరిస్థితి ఇంకా కొంచెం అలజడిగానే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో – అక్కడి ప్రభుత్వం, వైద్యశాఖ సూచనలు, సలహాలమేరకు అన్నీ సక్రమంగా పాటిస్తూనే, అక్కడి పౌరులంతా జనజీవన స్రవంతిలో ఎవరిపనుల్లో వారున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోలాగే యూకేలో కూడా ఎక్కువశాతం వృత్తి ఉద్యోగాల్లో సాధ్యమైనంతవరకు “వర్క్ ఫ్రమ్ హోమ్” పధ్ధతిలోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.
“పాండెమిక్ రోజుల్లో లైఫ్ కొంచెం ఇంటికే పరిమితమైనా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి కుదిరింది. ఐటి జాబ్ చేయటం వలన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అలవాటు ఉన్నా కాని, మొత్తం నెలల తరబడి ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంటినుంచే పనిచేయటం కొంచెం కొత్తాగానే అనిపించింది. ప్రపంచం నలుమూలలకి ప్రయాణం చేసి, అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టులని చేసేవాడిని… కానీ, ఇప్పుడు మొత్తం ఇంట్లో నుండే ఆన్‌లైన్ మీటింగ్స్‌తో “న్యూ నార్మల్ వర్క్ కల్చర్” కి ఇప్పుడు దాదాపు అలవాటు పడ్డాం. అఫీస్ కొలీగ్స్ ని, మిత్రులని కలవటం, సోషల్ లైఫ్ ని మిస్ అవటం ఈ పాండెమిక్ రోజుల్లో ఒక వెలితి. కాకపోతే జూమ్ కాల్స్ ద్వారా సోషల్ మీటింగ్స్ తో అందరు మిత్రులతో తరచు మాట్లడటం వలన కొంతవరకు ఓకే. అంతగా ఎవరిని మిస్ అయిన ఫీలింగ్ కలగలేదు”
ఇంటికి దూరంగా, సుమారు 7700 కిలోమీటర్ల దూరంలో యూకేలో ఎంత బిజీగా ఉంటున్నా కూడా – ఇక్కడి నేలమీద మమకారం ఎక్కువ నవీన్‌కు. తనకిష్టమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం, టీఆరెస్ పార్టీకోసం నిరంతరం సోషల్‌మీడియాలో పనిచేస్తుంటాడు నవీన్. ఇప్పుడు లండన్‌లో తను చేస్తున్న ఐటి రిలేటెడ్ కన్సల్టెన్సీతో పాటు, NRI-TRS-UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడు నవీన్. దీంతోపాటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) ఈవెంట్స్ సెక్రెటరీగా కూడా, అసోసియేషన్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొంటాడు నవీన్. ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత నవీన్‌కు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.
వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకెళ్లినపుడు… అక్కడ ఎప్పుడూ కనిపించే కూలిపోయిన గోడలు, ఎండిపోయిన చెరువులు, అక్కడి పేదరికం, వెనుకబాటుతనం కూడా తనని బాగా కదిలిస్తాయంటాడు నవీన్. ఈ కదలికే… అనుక్షణం… తను పుట్టిన గడ్డకోసం తనకు చేతనయింది ఏదయినా చేయాలనిపించేలా చేస్తోంది.
నవీన్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే హైదరాబాద్‌కు దగ్గరలో ఇప్పటికీ వ్యవసాయం కూడా కంటిన్యూ చేస్తుండటం అనేది నవీన్ విషయంలో నిజంగా అభినందించాల్సిన విషయం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani