Monday, 10 February 2025

అనుకోకుండా ఒకరోజు...


వై-జంక్షన్ దగ్గరున్న అశోకా వన్ మాల్‌లో ఒక సాయంత్రం... 

అది నాలుగో ఫ్లోర్ అనుకుంటాను. ఫుడ్ కోర్ట్‌లో నేనూ, విజయేంద్ర, శేఖర్ కలిశాం. ఆకులు అలములతో అదీ ఇదీ కలిపి తయారుచేసిన ఫారిన్ ఫుడ్ ఐటమ్ ఏదో రెండు ప్లేట్స్ తెచ్చుకొని, చెక్క స్పూన్స్‌తో ముగ్గురం తిన్నాం.  

"ఇదేదో టేస్ట్ బాగుంది, దీని పేరు ఇంకోసారి శేఖర్‌ను అడిగి గుర్తుపెట్టుకోవాలి" అనుకున్నాను అప్పుడు. కాని, షరా మామూలే. ఆ సమయంలో నా బుర్ర నిండా తిరుగుతున్న ఎన్నెన్నో విషయాల నేపథ్యంలో మర్చిపోయాను. 

తర్వాత ముగ్గురం మంచి కాఫీ త్రాగాం. మేమిద్దరం ఫ్రీగా మాట్లాడుకోడానికి వీలుగా మా విజయేంద్ర కాసేపు పక్కకెళ్ళాడు.  

శేఖర్, నేనూ కాసేపు మా పాత విషయాలు, కొత్త విషయాలు అన్నీ మాట్లాడుకొన్నాం. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో మేమిద్దరం కూడా ఒకలాంటి స్టకప్‌ను ఎదుర్కొంటున్న సమయం అది. శేఖర్ ఎదుర్కొంటున్న స్టకప్ నాకంటే దాదాపు ఒక పది రెట్లు పెద్దది. 

మా ఇద్దరిలో సహజంగా ఉన్న డైనమిజమ్‌కు ఇలాంటి స్టకప్ నచ్చదు. దీన్ని ఎంతో కాలం కొనసాగించలేం. మిగిలిన పనులు అన్నీ అనుకొన్నట్టు చేసుకొని, సమయం వృధాకాకుండా ముందుకు కదలాలంటే ఏదో ఒకటి జరగాలనిపించింది. అప్పటికప్పుడు ఏదైనా ఒకటి క్రియేట్ చెయ్యాలనిపించింది. మా ఇద్దరి ఇద్దరి విభిన్న స్టకప్‌లను బ్రేక్ చెయ్యడం కోసం క్యాటలిస్టుగా ఉపయోగపడే ఒక చిన్న ప్లాట్‌ఫామ్ ఏదో కావాలనిపించింది. అన్నిటినీ మించి, ఒక చిన్న స్ట్రెస్-బస్టర్ డైనమిక్ యాక్టివిటీ కావాలనిపించింది.        

శేఖర్‌కి ఒక విషయం చెప్పాను. చాలా జాగ్రత్తగా విన్నాడు. తన "టెస్టింగ్ టూల్స్" బుర్రలో వేసి దాన్ని గిరగిరా తిప్పాడు.  

"ఐడియా బానే ఉంది. కాని, రేపు చెప్తాను మీకు నా డిసిషన్" అన్నాడు. 

మర్నాడు రాత్రి పది ప్రాంతంలో నాకు కాల్ చేశాడు శేఖర్.

"సర్, నేను రెడీ" అన్నాడు.  

కట్ చేస్తే -

సరిగ్గా ఆ తర్వాత 28 రోజుల్లో, డిసెంబర్ 26 నాడు, మేమిద్దరం ప్లాన్ చేసిన మా కొత్త సినిమా ప్రారంభమైంది. 

మొన్న జనవరి 30 వరకు ఏకధాటిగా జరిగిన 36 రోజుల డే అండ్ నైట్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయ్యింది. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో మా అఫీసు ముందు గుమ్మడికాయ కొట్టి సంబరాలు చేసుకున్నాం.  

అదే... మా రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా. 

ఎర్ర గులాబి.
 

- మనోహర్ చిమ్మని 

(ది మేకింగ్ ఆఫ్ "ఎర్ర గులాబి" రేపు) 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani