Wednesday, 26 February 2025

"ఎర్ర గులాబి" ప్రమోషన్ ప్రారంభం!


ఒక సినిమా ప్లాన్ చేసి, దాని షూటింగ్ పార్ట్ పూర్తిచెయ్యడం అనేది అంత చిన్న విషయం కాదు. చేతిలో 100% ఫండ్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నెన్నో ఆటంకాలొస్తాయి. అలాంటిది... మొన్న 26 డిసెంబర్ నుంచి, 30 జనవరి వరకు, 36 రోజులపాటు నాన్-స్టాప్‌గా పనిచేసి, మన సినిమా "ఎర్ర గులాబి" షూటింగ్ పూర్తిచేశాం.   

ఒక 'రోడ్-క్రైమ్-థ్రిల్లర్' జోనర్ సినిమాను ఇంత ఫాస్ట్‌గా చెయ్యగలగటం కూడా అంత ఈజీ కాదు. కాని, మనం చెయ్యగలిగాం.  

టీమ్‌లో ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత అన్నది అందరికీ తెలిసిందే. నిజంగా ఒక రెనగేడ్ టీమ్‌గా, ఒక సిండికేట్‌గా, నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి, నాతో కలిసి రాత్రింబవళ్ళు కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు.    

పరోక్షంగా మాకు సహకరించిన ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా మా టీమ్ అందరి తరపున బిగ్ థాంక్స్. 

కట్ చేస్తే - 

1. "ఎర్ర గులాబి" సినిమా "ఫస్ట్ లుక్" & "మోషన్ పోస్టర్" రిలీజ్‌తో మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మార్చి 5 నాడు ఉంటుంది. ఒక వీఐపి చేత వీటిని రిలీజ్ చేయిస్తున్నాం.  

2. "ఎర్ర గులాబి" సినిమాలోని తెలంగాణ ఫోక్ సాంగ్‌ను "ఫస్ట్ లిరికల్ సాంగ్‌"గా మార్చి 9, ఆదివారం నాడు మరొక వీఐపీతో రిలీజ్ చేయిస్తున్నాం. 

ఈ రెండూ రెండు వేర్వేరు ఈవెంట్స్. 

వీటి డేట్స్, రిలీజ్ చేసే వీఐపీ గెస్ట్‌ల పూర్తి వివరాలు మా ప్రొడ్యూసర్‌ యువన్ శేఖర్‌తో ఫైనల్‌గా ఇంకోసారి చర్చించి, మళ్ళీ త్వరలోనే చెప్తాను. వీఐపీల డేట్స్‌ను బట్టి, ఈ డేట్స్ స్వల్పంగా ఒకటి రెండు రోజులు మారవచ్చు.    

కట్ చేస్తే -   

3. మొన్న దస్పల్లాలో లాంచ్ అయిన నా ఫేవరేట్ ప్రాజెక్టు "Yo!/10 ప్రేమ కథలు" షూటింగ్ మార్చి 30, ఉగాది నాడు ప్రారంభించాలనుకుంటున్నాం. పండగ రోజు కుదరదు అనుకుంటే, ఆ తర్వాతి మంచిరోజు నుంచి ప్రారంభిస్తాం. 

4. దాదాపు 80% షూటింగ్ వరంగల్‌లో ప్లాన్ చేసిన నా ఇంకో ప్రెస్టేజియస్ ప్రాజెక్టు "Warangal Vibes"ను 28 ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సినిమా మిగిలిన 20% షూటింగ్ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. 

కట్ చేస్తే -   

ఇప్పటివరకూ నాకు సహకరిస్తూ వస్తున్న నా ఆత్మీయ ఇన్వెస్టర్ మిత్రులు, శ్రేయోభిలాషులందరితో ఒక మంచి గెట్-టుగెదర్ లంచ్ మీటింగ్‌ను మార్చి ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేస్తున్నాను. అందరం తప్పక కలుద్దాం. 

"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."

- మనోహర్ చిమ్మని 

Tuesday, 25 February 2025

సినిమావల్ల కేవలం ప్రొడ్యూసర్, డైరెక్టర్లకేనా లాభం?


"ఇంతకుముందులా సిన్సియర్‌గా ఎవ్వరు లేరు సర్" అని మా నాగ్ అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 

నిజమే కావచ్చు.  

కాని, అది మనకున్న ఎక్స్‌పీరియన్స్ మీద, మనం పనిచేసిన వాతావరణం, మనం చూసిన టీమ్స్, అక్కడి వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. 

90 శాతం అలాగే, మా నాగ్ చెప్పినట్టే, ఉండొచ్చు, నమ్ముతాను. కాని, ఒక్క 10 శాతం అయినా పనిచేసేవాళ్ళుంటారు.

ఈ 10 శాతం మంది కూడా వారి ప్రొఫెషన్‌ను ఒక తపస్సులా భావించి పనిచేసినప్పుడే ఆ 1% క్లబ్ లోకి వెళ్ళగలుగుతారు.   

నాకు ఆ 10 శాతం వ్యక్తులంటేనే గౌరవం. అలాంటివాళ్లతో కలిసి పనిచెయ్యడానికి నేనెప్పుడూ ఇష్టపడతాను. 

దురదృష్టవశాత్తు - చాలామందికి - ఈ సినీఫీల్డు నేపథ్యం ఇచ్చే కిక్, పాపులారిటీ, ఫేమ్, సెలెబ్రిటీ హోదా, డబ్బు, సోషల్ మీడియా స్టేటస్‌ల కోసం ఫోటోలు, వీడియో బైట్స్, కాంటాక్ట్స్ లాంటివి కావాలి తప్ప - సినిమా కోసం ఇప్పుడు ఫీల్డులో ఉన్న సెలబ్రిటీలంతా ఎంత కష్టపడతారన్నది అవసరం లేదు. 

వాళ్ళెంత కష్టపడాలన్నదాని మీద కూడా వాళ్ల బుర్రలో అసలు ఎలాంటి స్పష్టత ఉండదు.     

అయితే - "ఎవరి ఫోకస్ ఎక్కడ, ఎంత" అన్న విషయంలో మాత్రం మనకు  మాత్రం ముందే క్లారిటీ ఉండాలి. అది లేకుండా ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో క్రియేట్ చేసుకొనే టీమ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

కట్ చేస్తే -   

మనకున్న రిసోర్సెస్‌లో, ఒక సినిమా బాగా చేసుకొని, ఒక మంచి బజ్ క్రియేట్ చేసుకున్నా, బిజినెస్ చేసుకున్నా, హిట్ కొట్టినా... అది డైరెక్టర్ ఒక్కడికో, ప్రొడ్యూసర్ ఒక్కడికో వచ్చే లాభం కాదు. 

టీమ్‌లో అందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ విజయం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఫలానా హిట్ సినిమాలో నేను ఏడీగా చేశాను, నేను ఎడిటర్‌గా చేశాను... అని ఒక టెస్టిమోనియల్‌గా చెప్పుకోవచ్చు. సొంతంగా ప్రాజెక్ట్స్ సాధించుకోవచ్చు. 

నేనైతే - నాకొచ్చే షేర్‌లో కొంత శాతం నా టీమ్‌కు ఇస్తాను అని కూడా బాహాటంగానే మా టీమ్ మీటింగ్స్‌లో ఎన్నోసార్లు చెప్పాను. 

ఎందుకంటే - నేను "మన సినిమా" అని అనుకుంటాను కాబట్టి... అలా అనుకునే నా గురించి, వాళ్ళు కూడా వాళ్ళ సొంత సినిమాలా భావించి ప్రాజెక్టు కోసం కష్టపడతారని... అలా కష్టపడ్డందుకు నాకు చేతనైనంతలో నేను కూడా వాళ్లకు అన్నివిధాలా సపోర్ట్ ఇవ్వాలన్నది నా ఆలోచన. 

Every frame should whisper, scream, or seduce—cinema is emotion set ablaze. Cinema is a battleground. 

- మనోహర్ చిమ్మని  

"మన ప్రాజెక్టు" అని ఎవరైనా ఎందుకనుకోవాలి?


కనీసం ఒక 60 రోజులు చెయ్యాల్సిన ఒక "రోడ్-క్రైమ్-థ్రిల్లర్" సినిమా షూటింగ్‌ను కేవలం 36 రోజుల్లో పూర్తిచేశాం. (యాక్చువల్లీ డే & నైట్ షూటింగ్ 20 రోజులే!)  

ఆ ప్రాసెస్‌లో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నెన్నో టెన్షన్స్ ఎదుర్కొన్నాం.  ఆరోగ్యం, రిలేషన్‌షిప్స్ పోగొట్టుకున్నాం. నేనైతే ఏకంగా పడకూడని మాటలు పడ్డాను, ఊహించని అవమానాలు ఎదుర్కొన్నాను. ఇలా గతంలో నాకు ఏ సినిమాకూ జరగలేదు.

కాని, ఏంటి లాభం?     

అంతా వృధా.  

ఇంక ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు అని డిసైడయ్యాను. ఈ బాధ్యతలు ఒక్కొక్కటిగా, త్వరత్వరగా పూర్తిచేసుకోవడం కోసమే నా అన్ని శక్తులూ ఉపయోగిస్తున్నాను.           

కట్ చేస్తే - 

"మన ప్రాజెక్టు" అని మన టీమ్‌లో ఎంతమంది ఫీలవుతున్నారన్నది మన పోస్ట్ ప్రొడక్షన్ స్టేటస్సే చెప్తుంది. 

అలాగే, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఇప్పుడు మన స్టేటస్ ఎక్కడ అన్నది మన టీమ్‌లో ఎంత మందికి తెలుసు అనేది కూడా ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. 

#EG షూటింగ్ పూర్తయ్యి ఇవ్వాటికి 27 రోజులు. 

ఒక చిన్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం 30 రోజుల్లో చాలా ఈజీగా పూర్తిచెయ్యొచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు. నా క్రియేటివిటీ కాదు.  1980 లలో, సినిమాకు ఫిలిం నెగెటివ్ వాడిన రోజుల్లోనే అలా చేశారు. 

కాని, 27 రోజుల తర్వాత, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కారణం చెప్పుకొని సమర్థించుకొంటూ మనమెక్కడున్నాం?     

ఎక్కడో ముంబై నుంచి మన డిఓపి వీరేంద్రలలిత్ ప్రతిరోజూ అప్‌డేట్ కనుక్కుంటున్నాడు. "మన ప్రాజెక్టు" అని ఆయనకున్నంత ప్రేమ మన టీంలో ఎంతమందికుంది అన్నది ఇంకో మిలియన్ డాలర్ కొశ్చన్.     

- మనోహర్ చిమ్మని  

పి యస్: 
ఈ బ్లాగ్ టైటిల్‌కు జవాబు, నా తర్వాతి బ్లాగులో ! 

Saturday, 22 February 2025

ఈ నెల 26 నాడు ఏం చేయబోతున్నాం?


గత నవంబర్ నుంచి - ప్రతి నెలా 26 వ తేదీకి ఏదో ఒక ప్రొఫెషనల్ చాలెంజ్ ప్రకటిస్తున్నాం. లేదంటే కొత్తగా ఏదైనా ప్రారంభిస్తున్నాం. ప్రకటించింది సాధిస్తున్నాం. ప్రారంభించింది విజయవంతంగా ముగిస్తూ ముందుకెళ్తున్నాం.  

ఇది విధిగా జరగాలని, జరిగేలా చెయ్యాలని, మా కోర్ టీంలో నలుగురం గట్టిగా అనుకున్నాం. అనుకున్నట్టే కష్టపడుతున్నాం అందరం. 

ఈ ఫిబ్రవరి 26 నాడు కనీసం రెండు ముఖ్యమైన విషయాలు ప్రకటించబోతున్నాం. ఇంకొన్ని లైన్లో ఉన్నాయి. అవేంటన్నది 26 నాడే తెలుస్తుంది.    

కట్ చేస్తే -

ఈ మధ్యే షూటింగ్ పూర్తిచేసుకున్న నా తాజా సినిమా "ఎర్ర గులాబి" ఎడిటింగ్ జరుగుతోంది. త్వరలో ఫస్ట్ కట్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటాయి.  

ఫస్ట్ లుక్, లిరికల్ వీడియోల రిలీజ్‌తో "ఎర్ర గులాబి" ప్రమోషన్‌ను అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 

- మనోహర్ చిమ్మని   

Wednesday, 19 February 2025

అనైరా గుప్తా... జస్ట్ మిస్డ్!


త్వరలోనే నేను మళ్ళీ ముంబై వెళ్తున్నాను. నా ఇంకో కొత్త సినిమా హీరోయిన్ కోసం ఆడిషన్స్ ఉన్నాయి. ఈసారి ప్రదీప్, విజయేంద్ర నాతో రావచ్చు.  

కట్ చేస్తే - 

మొన్న డిసెంబర్‌లోనే నేనూ, మా ప్రొడ్యూసర్ మిత్రుడు యువన్ శేఖర్ ఇదే పనిమీద రెండుసార్లు ముంబై వెళ్ళాము. మా "ఎర్ర గులాబి" సినిమా కోసం కొందరు హీరోయిన్స్‌ను షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. 

మాది రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా. హీరోయిన్ ఓరియెంటెడ్. 

నా విజన్‌కు కరెక్ట్‌గా సూటైన అమ్మాయి అనైరా గుప్తా. అద్భుతమైన యాక్టింగ్, అందం ఆమె సొంతం. ఫైనల్ ఆడిషన్స్‌లో ఆమెనే ఓకే చేసుకొని, అగ్రిమెంట్ చేసుకుందామని ముంబై వెళ్ళాం. 

కాని, అప్పటికే లేట్ అయిపోయింది. అనైరా నటిస్తున్న ఒక కొత్త తెలుగు సినిమా అదే రోజు ప్రారంభమయింది.  

అలా, అనైరా గుప్తా... జస్ట్ మిస్డ్ అన్నమాట! 

బట్ నో ప్రాబ్లం. అనైరాను నా "Yo!" సినిమాలో తప్పకుండా తీసుకుంటాను. 

- మనోహర్ చిమ్మని     

Tuesday, 18 February 2025

హీరోయిన్ తెలుగమ్మాయా, ముంబై అమ్మాయా, కేరళ అమ్మాయా అన్నది అసలు పాయింటే కాదు!


"తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసి వచ్చింది" అని ఒక ప్రొడ్యూసర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు అని మొన్నెక్కడో చదివాను. 

ఆ ప్రొడ్యూసర్ ఎంతమంది తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేశాడు, ఈ స్టేట్‌మెంట్ తాను పరిచయం చేసిన ఏ తెలుగు అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు అన్నది ఇక్కడ సబ్జెక్టు కాదు. ఒక ప్రొడ్యూసర్‌గా ( ఆ అమ్మాయి వల్ల) అతను పడ్డ ఇబ్బందులు, కష్టాలే పాయింట్. 

కట్ చేస్తే -  

అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత - హీరోయిన్‌గా తన పర్సనల్ గోల్స్, మొత్తంగా తను పనిచేస్తున్న ప్రాజెక్టు గోల్స్ మీద ఫోకస్ పెట్టి పనిచేసే హీరోయిన్స్ ఒక కేటగిరీ కిందకి వస్తారు. వీరి ఫోకస్ పూర్తిగా సినిమా సక్సెస్ మీదే ఉంటుంది. డైరెక్టర్‌కు, ప్రొడ్యూసర్‌కు, టీమ్‌కు ప్రతి చిన్న విషయంలో సహకరిస్తుంటారు. పూర్తిగా పాజిటివ్ మైండ్‌సెట్ ఉంటుంది.    

అలా కాకుండా - పేషెంట్‌లా ఎప్పుడూ ఏదో ఒక కొత్త కంప్లెయింట్ క్రియేట్ చేస్తూ, టీం మూడ్ చెడగొడ్తూ, నస పెడ్తూ, తింటూ, తాగుతూ, అన్-ఫోకస్డ్‌గా టైమ్‌పాస్ చేసే కేటగిరీలో కొందరుంటారు. వీరికి ఎలాంటి కష్టం లేకుండా పేరు రావాలి, సెలబ్రిటీ స్టేటస్ కావాలి. బాగా డబ్బులు కావాలి. (రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా) ప్రొడ్యూసర్ డబ్బులతో ఏదైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా ఖర్చుపెట్టొచ్చు అన్న భావనలో ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ఖర్చుపెట్టిస్తుండటం కావాలి. నెగెటివ్ మైండ్‌సెట్ వీరి సొంతం. 

బ్రాడ్‌గా ఏ హీరోయిన్ అయినా ఈ రెండు కేటగిరీల్లోకే వస్తారు. మొదటి కేటగిరీవాళ్ళు సక్సెస్ సాధిస్తారు, నిలదొక్కుకుంటారు. ఆఫర్లు, డబ్బులు వీళ్లని వెతుక్కుంటూ వస్తాయి. రెండో కేటగిరీవాళ్ళు వచ్చిందీ వెళ్ళిందీ తెలియకుండానే ఫేడ్ అవుట్ అయిపోతారు.    

సో, ఈ నేపథ్యంలో - హీరోయిన్ తెలుగమ్మాయా, ముంబై నుంచి దిగుమతిచేసుకున్న అమ్మాయా, కేరళ అమ్మాయా అన్నది అసలు పాయింటే కాదన్నది ఒక డైరెక్టర్‌గా నా హంబుల్ అబ్జర్వేషన్ అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్. 

ఈ సందర్భంగా - 

తెలుగుతో పాటు, ఇతర దక్షిణభారత భాషల సినిమాల్లో కూడా యువతరం హృదయాలను కొల్లగొడుతూ, గత పదేళ్ళుగా అప్రతిహతంగా హీరోయిన్‌గా కొనసాగుతున్న అనుపమ పరమేశ్వరన్‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.     

- మనోహర్ చిమ్మని    

Saturday, 15 February 2025

ది 1% క్లబ్


నేను ఫేస్‌బుక్ వదిలి దాదాపు 7 నెలలు అయింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాను.  

కాని, దీనివల్ల ఎఫ్ బి లో కొందరి పోస్టులు మిస్ అవుతున్నాను. ముఖ్యంగా... సత్యానంద్ గారు, శివనాగేశ్వరరావు గారు, వి యన్ ఆదిత్య గారు, దేవీ ప్రసాద్ గారు, ప్రియదర్శిని గారు, బిపి పడాల గారు... ఇంకొందరి పోస్టులు నిజంగా మిస్ అవుతున్నాను. అయినా సరే, అపుడప్పుడూ నేను చూడాల్సిన కొన్ని పోస్టులు ఎలాగూ నాదాకా వస్తున్నాయి.   

ఇవ్వాళ వి యన్ ఆదిత్య గారి ఎఫ్ బి పోస్ట్, దాని కింద కామెంట్స్ నాలాంటివారిని బాగా ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేస్తాయి. కొన్ని అంశాల్ని ఆదిత్యగారు డైరెక్టుగా పోస్ట్ చేస్తారు. 

కట్ చేస్తే - 

ఈమధ్యనే నేనొక సినిమా షూటింగ్ పూర్తిచేశాను. దాని పోస్ట్‌ప్రొడక్షన్ జరుగుతోంది. 

ఈ సినిమా ప్రారంభం నుంచి చూస్తున్నాను. లిటరల్లీ దాదాపు 99% మందిలో "ఈ సినిమాలో నేను పనిచేస్తున్నాను. ఇది నా సినిమా" అన్న బాధ్యతాయుతమైన ఫీలింగ్ చూడలేకపోయాను.  

"వచ్చామా, పోయామా... దీన్లో నా పార్ట్ ఇంతవరకే" అన్న ఫీలింగ్ తప్ప, ఎలాంటి పర్సనల్ అటాచ్‌మెంట్ లేదు. 

"అలా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు జెనెరేషన్ వేరు. మీరింకా ఎక్కడో ఉన్నారు" అని నా టీమ్‌లో ఒకరన్నారు.  

కాని, అది తప్పు అని నా గట్ ఫీలింగ్.   

ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా సరే, ఏ స్థాయిలో అయినా సరే... తను పనిచేసిన సినిమా గురించి తనదీ అన్న ఫీలింగ్, దానికోసం నేనేం చెయ్యగలను ఇంకా అన్న తపన లేని ఇలాంటి "నట్స్ & బోల్ట్స్ మైండ్‌సెట్" ఉన్నవాళ్లలో నిజంగా ఎంతమంది సినీఫీల్డులో పైకొస్తారు, ఎంతమంది నిలదొక్కుకుంటారన్నది బిగ్ కొశ్చన్!     

కట్ చేస్తే - 

ఏ జెనెరేషన్లో అయినా - తను పనిచేసిన ప్రతి సినిమాను తన సినిమా అని ఓన్ చేసుకునే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కేవలం 1% లోపే ఉంటారు. వాళ్లే సినిమాల్లో పైకొస్తారు, నిలదొక్కుకుంటారు. 

ఇప్పుడు సినీఫీల్డులో విజయపథంలో కొనసాగుతున్నవాళ్లంతా, జయాపజయాపజయాలతో సంబంధం లేకుండా ఫీల్డులో తమకంటూ ఒక పాజిటివ్ గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళంతా... ఈ 1% క్లబ్ లోని మెంబర్సే! 

- మనోహర్ చిమ్మని   

Tuesday, 11 February 2025

ది మేకింగ్ ఆఫ్ ఎర్ర గులాబి


జూబ్లీ హిల్స్ దస్పల్లాలో నవంబర్ 28 నాడు ఒక సినిమా ప్రారంభించాము. ఇంకో 40 రోజుల్లో షూటింగ్‌కి అన్ని ప్రిప్రొడక్షన్ ఏర్పాట్లు చేసుకున్నాము. కాని, వారంలోనే తెలిసింది... సాంకేతికంగా సినిమా ఆలస్యం కావచ్చని. 

దానికి తోడు, నేను అనుకున్న చాలామంది ఆర్టిస్టుల డేట్స్ కూడా 6 నెలల నుంచి, దాదాపు 18 నెలల వరకు లేవు! 

ఇదొక పెద్ద డిజప్పాయింట్‌మెంట్. వెంటనే "కొత్తవాళ్లతో అయితే" ఏంటి అని ఆలోచించాను. 10 జంటలు కాబట్టి - సాంకేతికంగా, ఆర్టిస్టులపరంగా నేను చాలా సమస్యల్ని, స్ట్రెస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బడ్జెట్ చేయిదాటిపోయే ప్రమాదం ఉంటుంది.   

సో, ఆ ఆలోచన అలా నడుస్తుండగానే నా మిత్రుడు, ఫిలాసఫర్, వీరేంద్రలలిత్‌తో ఒకసారి కూల్‌గా మాట్లాడుతున్నప్పుడు ఆయనొక మాటన్నాడు: "మీరు ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తున్నట్టే, మీ సినిమాలు కూడా ఎప్పుడూ ఒకటి షూట్‌లో ఉండాలి" అని.    

మా లలిత్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ వైబ్ కూడా అప్పుడు బాగా పనిచేసింది. ఏమైనా సరే, ఒక నెల రోజుల్లో సినిమా ప్రారంభించాలి అనుకున్నాను. 

కట్ చేస్తే - 

ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్న సినిమాకి బదులుగా అప్పటికప్పుడు ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. 

అదే - ఎర్ర గులాబి. 

నిన్నటి బ్లాగులో రాసినట్టుగా, ఈ సినిమా షూటింగ్‌ను ఏకధాటిగా 36 రోజుల్లో పూర్తిచేశాం. ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతోంది. మార్చి నుంచి ప్రమోషన్ ప్రమోషన్ ప్రారంభిస్తున్నాము. ఏప్రిల్లో కాపీ వస్తుంది. ఆ తర్వాత రిలీజ్ ఉంటుంది. 

ఈ జర్నీ అంతా "ది మేకింగ్ ఆఫ్ ఎర్ర గులాబి" పేరుతో ఒక అందమైన పుస్తకంగా తీసుకురావాలని కూడా నిర్ణయించాం. 

- మనోహర్ చిమ్మని         

Monday, 10 February 2025

అనుకోకుండా ఒకరోజు...


వై-జంక్షన్ దగ్గరున్న అశోకా వన్ మాల్‌లో ఒక సాయంత్రం... 

అది నాలుగో ఫ్లోర్ అనుకుంటాను. ఫుడ్ కోర్ట్‌లో నేనూ, విజయేంద్ర, శేఖర్ కలిశాం. ఆకులు అలములతో అదీ ఇదీ కలిపి తయారుచేసిన ఫారిన్ ఫుడ్ ఐటమ్ ఏదో రెండు ప్లేట్స్ తెచ్చుకొని, చెక్క స్పూన్స్‌తో ముగ్గురం తిన్నాం.  

"ఇదేదో టేస్ట్ బాగుంది, దీని పేరు ఇంకోసారి శేఖర్‌ను అడిగి గుర్తుపెట్టుకోవాలి" అనుకున్నాను అప్పుడు. కాని, షరా మామూలే. ఆ సమయంలో నా బుర్ర నిండా తిరుగుతున్న ఎన్నెన్నో విషయాల నేపథ్యంలో మర్చిపోయాను. 

తర్వాత ముగ్గురం మంచి కాఫీ త్రాగాం. మేమిద్దరం ఫ్రీగా మాట్లాడుకోడానికి వీలుగా మా విజయేంద్ర కాసేపు పక్కకెళ్ళాడు.  

శేఖర్, నేనూ కాసేపు మా పాత విషయాలు, కొత్త విషయాలు అన్నీ మాట్లాడుకొన్నాం. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో మేమిద్దరం కూడా ఒకలాంటి స్టకప్‌ను ఎదుర్కొంటున్న సమయం అది. శేఖర్ ఎదుర్కొంటున్న స్టకప్ నాకంటే దాదాపు ఒక పది రెట్లు పెద్దది. 

మా ఇద్దరిలో సహజంగా ఉన్న డైనమిజమ్‌కు ఇలాంటి స్టకప్ నచ్చదు. దీన్ని ఎంతో కాలం కొనసాగించలేం. మిగిలిన పనులు అన్నీ అనుకొన్నట్టు చేసుకొని, సమయం వృధాకాకుండా ముందుకు కదలాలంటే ఏదో ఒకటి జరగాలనిపించింది. అప్పటికప్పుడు ఏదైనా ఒకటి క్రియేట్ చెయ్యాలనిపించింది. మా ఇద్దరి ఇద్దరి విభిన్న స్టకప్‌లను బ్రేక్ చెయ్యడం కోసం క్యాటలిస్టుగా ఉపయోగపడే ఒక చిన్న ప్లాట్‌ఫామ్ ఏదో కావాలనిపించింది. అన్నిటినీ మించి, ఒక చిన్న స్ట్రెస్-బస్టర్ డైనమిక్ యాక్టివిటీ కావాలనిపించింది.        

శేఖర్‌కి ఒక విషయం చెప్పాను. చాలా జాగ్రత్తగా విన్నాడు. తన "టెస్టింగ్ టూల్స్" బుర్రలో వేసి దాన్ని గిరగిరా తిప్పాడు.  

"ఐడియా బానే ఉంది. కాని, రేపు చెప్తాను మీకు నా డిసిషన్" అన్నాడు. 

మర్నాడు రాత్రి పది ప్రాంతంలో నాకు కాల్ చేశాడు శేఖర్.

"సర్, నేను రెడీ" అన్నాడు.  

కట్ చేస్తే -

సరిగ్గా ఆ తర్వాత 28 రోజుల్లో, డిసెంబర్ 26 నాడు, మేమిద్దరం ప్లాన్ చేసిన మా కొత్త సినిమా ప్రారంభమైంది. 

మొన్న జనవరి 30 వరకు ఏకధాటిగా జరిగిన 36 రోజుల డే అండ్ నైట్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయ్యింది. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో మా అఫీసు ముందు గుమ్మడికాయ కొట్టి సంబరాలు చేసుకున్నాం.  

అదే... మా రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా. 

ఎర్ర గులాబి.
 

- మనోహర్ చిమ్మని 

(ది మేకింగ్ ఆఫ్ "ఎర్ర గులాబి" రేపు) 

Wednesday, 5 February 2025

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు...


నా యూట్యూబ్ వీడియోస్ కోసం నిన్ననే ఒక చిన్న ట్రైపాడ్ తెప్పించా. దాన్ని రేపు ఓపెన్ చేస్తున్నా.

కట్ చేస్తే - 

కెమెరా వెనుక నిల్చుని "యాక్షన్!" అని చెప్పినంత ఈజీ కాదు రీల్స్ చెయ్యటం! 

బట్ నో వర్రీస్, కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. మనకున్న బిజీ బిజీ పనుల మధ్య టైం చూసుకొని ఇట్లా రీల్స్, వీడియోలు చెయ్యాలంటే నిజంగానే కొంచెం కష్టం. బట్, చెయ్యాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి - చేస్తాను. 

ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఒకరిద్దరు కాల్ చేసి అడిగారు. "ఒరే నీకీ రీల్స్ చేసుడు అవసరమా ఇప్పుడు?" అని. "యస్. ఇప్పుడే అవసరం" అని చెప్పా. 

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు ఎవరైనా, ఏదైనా, ఎప్పుడైనా చెయ్యొచ్చు.  

ఏమంటారు? 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 4 February 2025

Prime Farmland for SALE! 🌿🏡


Looking for a great investment? This beautiful farmland is up for grabs! Don’t miss out—call immediately for the BEST OFFER! 📞✨

#FarmLandForSale #GreatInvestment #CallNow

కట్ చేస్తే - 

ఇది నా ఫ్రెండొకరికి సంబంధించిన యాడ్. క్లియర్ టైటిల్. ఇన్వెస్ట్‌మెంట్ పాయింటాఫ్ వ్యూలో మంచి ఆఫర్ ఉంది. 

వెంటనే కాల్ చేయండి: 8919560997.  

Monday, 3 February 2025

E G


మొన్న నవంబర్ 28 నాడు, జూబ్లీహిల్స్ దస్పల్లాలో Yo! ప్రారంభిస్తున్నప్పుడు ఒక మాటనుకున్నాను.

ఏది ఏమైనా సరే, వచ్చే నెల 28 నాటికి షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని! 

కాని, తర్వాత రెండుమూడు రోజుల్లోనే అర్థమైపోయింది. Yo! లేట్ అయ్యేటట్టుందని.

ఇంక వేరే ఆలోచించలేదు. అప్పటికప్పుడు ఇంకో కొత్త సినిమా డీల్ చేసుకొని, డిసెంబర్ 28 కంటే ముందు, 26 నుండే షూటింగ్ ప్రారంభించాను. అదే...

ఎర్ర గులాబి. 

EG.

క్రైమ్ థ్రిల్లర్. 

ప్రొడ్యూసర్ యువన్ శేఖర్‌కు, నా డి ఓ పి వీరేంద్ర లలిత్‌కు, నా టీమ్‌కు థాంక్స్... డిసెంబర్ 26 నుంచి, 36 రోజుల్లో నా కొత్త సినిమా షూటింగ్ పూర్తిచేయగలిగాను.  

కట్ చేస్తే - 

జనవరి 26 నాడు కూడ ఇంకో కొత్త ప్రాజెక్టు ప్రారంభించిన విషయం ఇంకా ఎవ్వరికీ తెలీదు. వివరాలు నేనే చెప్తాను త్వరలో.  

నా టీమ్‌లో ఎవరైనా గెస్ చేయగలరా? 

- మనోహర్ చిమ్మని 

Sunday, 2 February 2025

2025 ప్రారంభంలో మంచి కిక్ ఇచ్చే ప్రారంభం!


డిసెంబర్ 26 నుంచి, 30 జనవరి వరకు, 36 రోజుల ఏకధాటి షూటింగ్‌తో #EG షూటింగ్ మొన్న పూర్తిచేసి, గుమ్మడికాయ కొట్టాం. 

కట్ చేస్తే -

దాదాపు సంవత్సర కాలంగా నేను ప్లాన్ చేసి, ప్రిప్రొడక్షన్ పనులను ప్రారంభించి, భారీగా సమయం, డబ్బూ ఖర్చుపెట్టిన నా ప్యాషనేట్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా, అప్పటికప్పుడు అనుకొని ప్రారంభించిన నా తాజా కొత్త సినిమా ఇది.  

కేవలం 30 రోజుల్లో అనుకొని ప్రారంభించిన సినిమా ఇది. డిసెంబర్ 28 కి స్టార్ట్ చెయ్యాలనుకున్నాం. 26 కే ప్రారంభించాం. 36 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. 

2025 ప్రారంభంలో ఇదొక మంచి కిక్ ఇచ్చే ప్రారంభం మాకు. 

రేపు సోమవారం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతున్నాయి. మార్చి చివర్లో గాని, ఏప్రిల్ 10 నాటికి గాని కాపీ వస్తుంది. మే-జూన్ నెలల్లో రిలీజ్ అనుకుంటున్నాం. 

ఈ సినిమా ప్రి-లుక్, ఫస్ట్-లుక్ లతో మార్చి 1 నుంచి ప్రమోషన్ కార్యక్రమాల్ని ప్రారంభించి, ముమ్మరం చేస్తున్నాం. 

కట్ చేస్తే - 

ప్రతి నెలా 26 వ తేదీకి ఏదో ఒక ప్రొఫెషనల్ చాలెంజ్ ప్రకటించబోతున్నాం, ప్రకటించి సాధించబోతున్నాం. 

- మనోహర్ చిమ్మని