తెలుగులో 100 సినిమాలు రిలీజైతే, వాటిలో 90 సినిమాల్లో నాన్-తెలుగు హీరోయిన్స్, ముంబై హీరోయిన్సే ఉంటారన్నది కాదనలేని నిజం.
ఎందుకలా అన్న ప్రశ్నకు సుత్తిలేకుండా సూటిగా పది బులెట్ పాయింట్స్ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను:
> నిజానికి ముంబై హీరోయిన్స్ అందరూ ముంబై వాళ్లు కానే కారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి మోడలింగ్ చేసుకుంటున్నవాళ్లు వాళ్లంతా. ఫ్యాషన్‌కూ, మోడలింగ్‌కూ, యాడ్ మేకింగ్‌కూ ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి, అవకాశాలు అక్కడే ఎక్కువ కాబట్టి వీళ్లంతా ముందు అక్కడ ల్యాండ్ అయిపోతారు. వాళ్లల్లో కొందరు సినిమాలకూ ట్రై చేస్తుంటారు హీరోయిన్ అయిపోవాలని. సో, మనం ముంబై నుంచి దిగుమతి చేసుకున్న, చేసుకుంటున్న ముంబై హీరోయిన్లలో దాదాపు అన్ని రాష్ట్రాలవాళ్లూ ఉన్నారు. మన తెలుగువాళ్లతో సహా!
> ఇక్కడ ముంబైని ఒక ప్రాంతంగా నేను చూడటం లేదు. ఒక అడ్వాన్స్‌డ్ మీడియా కేంద్రంగా చూస్తున్నాను. మోడలింగ్, ఫిలిం యాక్టింగ్‌లకు సంబంధించినతవరకూ అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. సినీ ఫీల్డు అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అమ్మాయిలకే కాదు, వారి కుటుంబాల్లో కూడా.
> మగ అయినా, ఆడ అయినా... సినీ ఆర్టిస్టులు కావాలనుకొనేవారికి నటనతోపాటు మంచి శరీర సౌష్టవం, ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా కనిపించడమే వారి ప్రధాన ఆస్తి అని చాలామంది గుర్తించరు. ఈ నిజం యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకొన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ముంబైలో ఆడిషన్స్‌కు వచ్చే కొత్త హీరోయిన్లు ఈ విషయంలో సంపూర్ణమైన స్పృహ కలిగి ఉంటారు.
> ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిల్లో నూటికి నూరు శాతం మంది అన్ని విధాలుగా ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు. నటన, డాన్సు, సినీ ఫీల్డు పట్ల ఒక ప్యాషన్, అవగాహన అన్నీ ఉంటాయి. హీరోయిన్‌గా తాను సెలక్టు కావాలనీ, అయితే చాలనీ.. ముందు ఆ విషయం మీదే వాళ్ల ఫోకస్ ఉంటుంది. అంత అద్భుతంగా ఆడిషన్స్‌లో తమ ఉనికిని ఫీలయ్యేలా పర్‌ఫామ్ చేస్తారు.
> బాడీ సెన్స్, యాక్టింగ్, గ్రూమింగ్ విషయంలో ముంబై హీరోయిన్లు వేలు, లక్షలు ఖర్చుపెట్టి ఎంతో శిక్షణ తీసుకొంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. వారితో పోలిస్తే, ఈ విషయంలో ఇక్కడ దాదాపు జీరో.
> ఇక్కడ పాయింటు అమ్మాయిలు ఎక్కడి వాళ్లు అన్నది కానే కాదు. వాళ్లు ఎంత ప్రొఫెషనల్స్ అన్నదే పాయింటు. ముంబై అన్న మాట రావటానికి కారణం... అక్కడ కేంద్రీకృతమై ఉన్న అమ్మాయిలంతా పక్కా ప్రొఫెషనల్స్ కావటమే. నిజానికి, అలాంటి ప్రొఫెషనలిజం ఉన్నవాళ్లే సినిమాకు పనికి వస్తారు... సినీ ఫీల్డులో నిలదొక్కుగోగలుగుతారు.
> "ముంబై వాళ్లకే ఎక్కువ డబ్బు ఇస్తారు, ఇక్కడి అమ్మాయిలకు అంత రేంజ్‌లో ఇవ్వరు" అనేది కూడా కేవలం ఒక అపోహే. సక్సెస్, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ డబ్బు అదే వెంటపడుతుంది. వాళ్లు ముంబై నుంచి వచ్చారా, హైద్రాబాద్ వాళ్లా అనేది ఎవ్వరూ చూడరు. మన జయప్రద, శ్రీదేవిలు ముంబై వెళ్లి జెండా ఎగురవేశారు. అప్పట్లో కొంతమంది టాప్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. అక్కడి హీరోయిన్లకు కనీసం ఒక దశాబ్దం పాటు నిద్రలేకుండా చేశారు. కళాకారులకు ప్రాంత భేదాలు ఉండవు. ప్రొఫెషనలిజం ముఖ్యం.
> సినీఫీల్డులో ఆయా హీరోహీరోయిన్స్‌కు ఉన్న మార్కెట్, డిమాండును బట్టి వారి రెమ్యూనరేషన్స్ ఉంటాయి తప్ప "వాళ్లు ముంబైవాళ్ళు" అని రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇవ్వరు.
> సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉందనుకోండి. ఇక్కడి హీరోయిన్స్‌ను ఒప్పించడం కష్టం. అలాగే, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా చిన్న చిన్న టాప్స్, టైట్స్, లెగ్గీస్, షార్ట్స్, మిడ్డీస్, మినీస్... వేయడానికి మనవాళ్లల్లో 90 శాతం మంది ఒప్పుకోరు. ఇక స్విమ్ సూట్, వెట్ డ్రెస్ అన్నామా... అంతే. నేనిక్కడ థర్డ్ గ్రేడ్ సినిమాల గురించి మాట్లడ్డం లేదు. ఇవన్నీ ఉన్నాయని.. రాజ్ కపూర్, విశ్వనాథ్, మణిరత్నం, గౌతం మీనన్ లాంటి వాళ్లు తీసిన చిత్రాల్ని చెత్త సినిమాలనలేం.
> ఇదంతా ఒక ఎత్తయితే, మన హీరోయిన్ల పేరెంట్స్ కొందరు చాలా డిమాండింగ్ గా అడిగేదొకటుంది. " మీ సినిమాలో మా అమ్మాయి వేసే డ్రెస్సులన్నీ మాకు ముందే చూపించండి. అవి చూశాకే మేం ఓకే చెప్తాం" అని! సినీ ఫీల్డు పట్ల, నటన పట్ల అవగాహనా రాహిత్యం, ప్రొఫెషనలిజం లేకపోవటం ఇలాంటి ఇబ్బందులకు కారణాలు. అనవసరంగా ఎందుకొచ్చిన కష్టాలు.. 'అంత అవసరమా' అని ఏ డైరెక్టరయినా అనుకోవటంలో తప్పులేదు. కోట్లరూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆటలాడలేరుగా!
కట్ చేస్తే -
హీరో అయినా, హీరోయిన్ అయినా అవ్వాలంటే చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషి లేకుండానే భారీ పారితోషికాలు, సెలబ్రిటీ స్టేటస్, ఆ లైఫ్‌స్టయిల్ కావాలనుకోవడంలో అర్థంలేదు.
ముంబై స్థాయిలో ఇక్కడి అమ్మాయిలు హీరోయిన్స్‌గా తయారవ్వాలి అంటే చాలా పరిస్థితులు వారికి అనుకూలించాలి. కుటుంబం నుంచి ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇదంతా ఇక్కడి సంస్కృతిలో ఇప్పట్లో అంత ఈజీ కాదు. ఇంకా టైమ్ పడుతుంది.
ఇవన్నీ ఎలా ఉన్నా, ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోంచి కూడా - ఇప్పటి ట్రెండీ లుక్ అండ్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ అవసరాలకు అనుగుణంగా - కొత్తగా ఇంకో శ్రీదేవి, జయప్రద లాంటి తెలుగు హీరోయిన్స్ మళ్లీ త్వరలోనే వస్తారనీ... వాళ్ళలా బాలీవుడ్‌ను కూడా దున్నేస్తారనీ నా నమ్మకం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani