Sunday, 16 March 2025

రచనతోనే నా తొలిప్రేమ


తెలుగులో నా అభిమాన కథానికా రచయితలు చాలామందే ఉన్నారు. కాని, నేను ఎక్కువగా ఇష్టపడేది మాత్రం - బుచ్చిబాబు, చలం. 

ఎవ్వరి ప్రత్యేకత వారిదే. ఎవ్వరి రచనాశైలి, ఎవ్వరి ముద్ర వారిదే. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని నేను అనను. కాని - భాష, వ్యక్తీకరణ, కథనం... ఈ మూడింటి విషయంలో మాత్రం వీరి తర్వాతే ఎవ్వరైనా అని నా వ్యక్తిగత భావన.  

బుచ్చిబాబు రాసిన ఒక అద్భుతమైన కథ "నన్ను గురించి కథ వ్రాయవూ" నన్ను దశాబ్దాలుగా ఎంతలా వెంటపడి వేధించిందంటే, ఆ కథాస్పూర్తితోనే మొన్న అనుకోకుండా, ఫిబ్రవరి 14 నాడు, నేనే ఒక పెద్ద కథ రాసి, పూర్తిచేసి, నా మిత్రుడు గుడిపాటికి పంపించేంతగా. 

కట్ చేస్తే -

ఇప్పుడు నేను కథానికలు విరివిగా రాయడం మొదలెట్టాను. ఒక నవల కూడా రాస్తున్నాను. నా సినిమాలు, ఇతర వ్యవహారాలు... వాటి దారి వాటిదే. 

కాని... 

రచనతోనే నా తొలిప్రేమ. 

చాలా ఏళ్ళుగా అసలు పట్టించుకోలేదు. మర్చిపోయాను. లాభమేంటి అనుకున్నాను. కాని, చాలా నష్టపోయాను. 

నా అంతరాంతరాల్లో, ఎక్కడో పాతాళంలో, ఎప్పటినుంచో తొక్కిపెట్టి ఉంచిన నా ఈ భావనను బయటకు తీసి, నన్ను చెడామడా ఉతికి ఆరేసి, నన్ను మళ్ళీ ఈవైపు తిప్పిన ఒక స్నేహి గురించి ఎంత చెప్పినా తక్కువే.       

అందుకే - కొంచెం ఆలస్యంగానైనా, మళ్ళీ ఇప్పుడు నా రచనతోనే కొత్తగా ప్రణయం మొదలెట్టాను. ఇంక ఈ ప్రయాణానికి ముగింపు లేదు.  

- మనోహర్ చిమ్మని           

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani