Sunday, 29 September 2024

అసలేందిర బై... గీ 'కాస్టింగ్ కౌచ్'? (Mr D - 3)


"నీకేంది, నాకేంది... క్విడ్ ప్రో కో... ఎనుకటెప్పుడో మొదలైన గా బార్టర్ సిస్టం గుడ గిదే అనుకుంట! 

అసలు గీ ముచ్చట నన్ను అడిగిన్లు గని, గా 'ఆర్జీవీ'ని అడిగితె సక్కగ చెప్తడు. నేనన్న జెర స్వీట్ కోటింగిస్త గని, ఆర్జీవైతే... అసలు దీనికి సొల్యూషనే లేదు దొబ్బెయిండ్రా అని సాఫ్ సీద చెప్తడు. 

అయినా గీ కాస్టింగ్ కౌచ్ కత ఒక్క మన సినిమా ఫీల్డుల్నే ఉన్నదా? నువ్వు ఏ ఫీల్డుకన్న పో... గిదే నడుస్తది. 

నీకేంది, నాకేంది? 

"నేన్నీకు కాంట్రాక్ట్ ఇప్పిస్త, నువ్వు నాకేమిస్తవ్"... గిది పొలిటీషన్ల కాస్టింగ్ కౌచ్.

"సరె డాడీ, నేను క్లాసుల ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంట. మరి నాకేమిస్తవ్?" గిది ఇంట్ల పిలగాండ్ల కాస్టింగ్ కౌచ్.

"అరేయ్... ఇయ్యాల రాత్రి తొమ్మిది కల్ల నేను నీకు గుడ్ న్యూస్ ఇస్త... మరి నువ్వు నాకేమిస్తవ్?" గిది ఫ్రెండ్‌షిప్‌ల కాస్టింగ్ కౌచ్.

"నేన్నీకు బియ్యమిస్త... నువ్వు నాకు పప్పిస్తవా?"... గిది బార్టర్ సిస్టం. 

నువ్వే ఫీల్డులకన్న పో... గిదే ఉంటది. 

1924 అనుకుంట... గప్పుడో మూకీ సిన్మా వచ్చింది. దాని పేరు "కాస్టింగ్ కౌచ్". దాని స్టోరీలైన్ గిదే. ఒక కాస్టింగ్ డైరెక్టర్‌కు ఏదడిగితె గదిచ్చే హీరోయిన్ కత గది.

వందేండ్ల కిందనే గిదీని మీద సిన్మనే తీసిండ్లంటే... ఇంక దీని గురించి ఏం మాట్లాడ్తం చెప్పు?

అగో గా సీన్మ నుంచే గీ కాస్టింగ్ కౌచ్ ముచ్చట పుట్టింది. 

1924 ల!

అంటేందీ, సీన్మ పుట్టినప్పట్నుంచి గిదే కతన్నమాట.  

మామూలు క్విడ్-ప్రో-కోలకు దీనికి ఏం తేడా ఉన్నది బై... గా మొరాలిటీ ఒక్కటే. 

అయినా, బుద్ధిన్నోడు ఎవడన్న ఫోర్స్ చేస్తడా గిదీని మీద? ఇదసలే సోషల్ మీడియా జమానా. సెకన్ల సోషల్ మీడియాల కనిపిస్తది... 

"ఫలానా డైరెక్టర్, ఫలానా హీరోయిన్ను గా డాష్‌ల ఫేవర్సేవో అడిగిండట" అని! 

ఇంకేమన్నున్నదా గట్ల బయిటికొస్తె?! 

మరి గిది లేదా ఇండస్ట్రీల అంటె... ఉండే ఉంటది. కని, కామన్ సెన్స్ ఏందంటె గిసొంటియన్ని ఇద్దరు మనుషుల మధ్య జరిగే ముచ్చట్లు.

నిజంగ గీ క్విడ్ ప్రో కో చేసుకునెటోల్లకు గింత లొల్లుంటదని తెల్వది. బైటోల్లే నానా కతల్ పడ్తరు.  

ఇప్పుడింక యూట్యూబ్ చానెల్లు కూడ మస్త్ అయినయి కద... ప్రతి గొట్టం గాడు కుడ ఓ పనిలేకుంట ఇంట్ల కూసున్న ఒక ఆర్టిస్టును పట్టుకునేది... "నీకైందా గీ కాస్టింగ్ కౌచ్" అని అడిగేది! వాల్లు వున్నయి లేనియి అన్ని చెప్తరు... బజ్ కావాలె కద...

అటు పనిలేనోల్లకు, ఇటు పనున్నోల్లకు కూడ బజ్ కావాల్నంటె ఇప్పుడు గిదొక్కటే టాపిక్... కాస్టింగ్ కౌచ్!" 

... ... ... 

మన డైరెక్టర్ "మిస్టర్ డి" ఇంటర్వ్యూ అయిపోయింది.

ఇంటర్వ్యూ తీసుకున్న ప్రముక యూట్యూబ్ చానెల్ యాంకర్ ఫుల్ కుష్! 

కట్ చేస్తె -

రేపు వాల్ల చానెల్ అప్లోడ్ చేసే వీడియోకు ఖతర్నాక్ థంబ్‌నెయిల్...

"అసలు 
కాస్టింగ్ కౌచ్‌కు 
లొంగని హీరోయిన్ ఎవరు? 

అందరు హీరోయిన్ల 
బండారం బయటపెట్టిన 
డైరెక్టర్ మిస్టర్ డి !!" 

అగో గట్లుంటది మనోల్లతోని... 

ఇంటర్వ్యూల గా డైరెక్టర్ చెప్పిందానికి, థంబ్‌నెయిల్‌కు ఏమన్న సంబంధమున్నదా? 

వీల్లను ఎవ్వడన్న అడిగెటోడున్నడా? 

గదే మరి... గందుకే గీ చానెలోల్లతోటి ఎక్కువ తక్కువ మాట్లాడడు మన డైరెక్టర్!  

- మనోహర్ చిమ్మని 

Saturday, 28 September 2024

"మిస్టర్ డి" అండ్ సొల్లుపురాణంగాళ్ళు! (Mr D - 2)


సినిమా ఫీల్డు ఎసొంటిది అంటే... ఎప్పటికప్పుడు మస్త్ డైనమిక్‌గ, దూకుడుగ ఉన్నోనికి ఇక్కడ ఏదో ఒక చాన్స్ దొరికే చాన్సుంటది. "వెయిట్ అండ్ సీ" అన్న ధోరణిల ఎప్పుడూ మన్ను తిన్న పాములెక్క నాలుగ్గోడల మధ్య ఉండెటోనికి ఏ చాన్సు రాదు. జన్మల రప్పిచ్చుకోలేడు.  

కట్ చేస్తే -

మన డైరెక్టర్ "మిస్టర్ డి" కి మంచి టాలెంటున్నది. మంచి డైనమిక్. మంచి నెట్వర్క్ గుడ ఉన్నది. 

మరేంది ప్రాబ్లం? 

గదే ప్రాబ్లం. 

"మిస్టర్ డి" కి ఉన్న నెట్వర్క్‌ల ప్రతివాడు ఫోజులు కొట్టెటోడే. నోటికచ్చిన అబద్ధాలాడెటోదే. జస్ట్ ఫేక్‌గాళ్లన్నమాట! 

"ఇగ రేపే నేను ఇన్వెస్టర్ని రప్పిస్తున్న. కూసొని మాట్లాడుకోండ్రి. మధ్యలుండి నేనే డీల్ ఓకే చేయిస్తా. ఎల్లుండి ఓపెనింగ్. ఆవలెల్లుండి నుంచి షూటింగ్!" ఇగో గిట్లుంటై వాళ్ళ మాటలు. 

గసొంటి సొల్లుగాడే ఇప్పుడు ఇంకొకడు వస్తున్నడు. గాయినె కోసం ఎదురుసూసుకుంట బోయిన్‌పల్లిలోని స్వీట్ హార్ట్ హోటల్ల కూసున్నడు "మిస్టర్ డి". 

ఇప్పుడు వచ్చెటోనికి గుడ రొండు కంపెనీలున్నై. యాడాదికి కోట్లల్ల టర్నోవరున్నది. ఇసొంటోడు టైమ్ వేస్ట్ చేస్కొని ఇక్కడిదాకా రాడుగదా అన్నది మన డైరెక్టర్ లాజిక్.    

వీడు సొక్కమే అయ్యుంటడని మనోని దురాశ.  

వచ్చిండు, కూసున్నడు. మటన్ బిర్యాని, రొండు థమ్సప్‌లు ఆర్డరిచ్చిండు. 

ఒకప్పుడు మటన్ బిర్యానీ, థమ్సప్ కాంబినేషన్ అంటె మస్త్ ఎంజాయ్ చేసెటోడు మన డి. ఇప్పుడు మనోని ధ్యాసంత ఎదురుంగ కూసున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్ మీదనే ఉన్నది... ఏం జేస్తడా అని. 

"సూడన్న... నువ్వు మస్త్ టాలెంటెడ్. గదాంట్ల గింత గుడ డౌట్ లేదు. ఎవ్వడన్న డౌట్ ఉన్నదంటె రమ్మను. నేను వాని గు*ల తంత. నువ్వు రమ్మను" అన్నడు ఇన్వెస్టర్ ఫ్రెండు. 

"గిప్పుడు గదంత ఎందుకు లేవే... ముందుగాల మనం మన గీ డీల్ మాట్లాడుదం అన్నా" అన్నడు మన డైరెక్టర్.   

"నీ గురించి బాగా తెల్సినోన్ని నేను. మన జిల్లాకు ఫస్ట్ నంది అవార్డు తెచ్చినోనివి నువ్వు. నీ టాలెంట్ నాకు తెల్సు. గందికే నేనే పిల్చిన కద నిన్ను... నువ్వు పిల్చినవా గిక్కడ స్వీట్ హార్ట్‌ల బిర్యాని తినుకుంట మాట్లాడుకుందం, డీల్ చేస్కుందం అని?" 

"అవ్ అన్నా, నువ్వే పిల్చినవ్" 

"గదే మరి. బిర్యాని మంచిగున్నది కదా. మెల్లగ తిను. ఐపోయినంక ఐస్‌క్రీమ్ తెప్పిస్త. నువ్వేం ఇది కాకు" అన్నడు ఇన్వెస్టర్ ఫ్రెండు.

మనోనికి ఆశ ఆకాశంలకు రీచ్ అయి కూసుంది. ఇదేదో అయ్యేటట్టుంది అనుకున్నడు డి. 

మన డి గిట్ల ఆకాశంల ఉండంగనే ఇగ అసలు ముచ్చట చెప్పుడు మొదలు పెట్టిండు ఇన్వెస్టర్ ఫ్రెండు...

"సూడన్న... మన దగ్గర పస్త్ పైసలున్నయి. ఏం తక్కువలేదు. 10 కోట్లు కాదు, బడ్జెట్ వంద కోట్లైన పెడ్దాం బాంచొత్. మనం ఎవ్వనికి తక్కువ కాదు" 

వింటున్నడు మన డైరెక్టర్.

"కాని అన్నా, నీ టాలెంట్ సూపర్ అన్న. కరెక్టోడు ఒక్కడు పడాల్నె నీకు. చిన్నదో పెద్దదో నడిపిదో... ఒక్క సిన్మా, జస్ట్ ఒక్క సీన్మ... ముందుగాల గా ఒక్కటి తీసి ఇప్పుడు హిట్టు కొట్టన్న. ఇగ తర్వాత ఎంతైనా నేను పెడ్తా! నీకేం ఫికర్ లేదు. నేనున్న!..." అని ఇంకేదో చెప్పుకుంటపోతున్నడు ఇన్వెస్టర్.

మన డిరెక్టర్‌కు మొత్తం సీన్ అర్థమైంది. ఎక్కడో మండింది.

"నేను ఎవ్వర్నో సూసుకొని, సీన్మ దీసి హిట్టు కొట్టినంక... అప్పుడు గూడ గిసొంటి సొల్లుగాల్ల కోసమే సూత్తనా?!" అనుకుంట థమ్సప్ లాస్ట్ సిప్పు తాగి లేచిండు మన డైరెక్టర్... మిస్టర్ డి.  

- మనోహర్ చిమ్మని 

Thursday, 26 September 2024

"మిస్టర్ డి" మొదటి సిన్మా (Mr D - 1)


"తుపాకి రాముని లెక్క కోతల్ కోసుడు, ఆర్జీవీ లెక్క మ్యానిప్యులేట్ చేసుడు... గీ రెండు తెలిస్తె సాలు. ప్రొడ్యూసర్లకు, హీరోలకు స్టోరీ జెప్పి పడేసుడు ఈజీ..."   

సెల్ఫ్ మోటివేషన్-కమ్-మెడిటేషన్లకెల్లి బైటికొచ్చి కండ్లు తెరిచిండు మన డైరెక్టర్... మిస్టర్ డి. 

కట్ జేస్తె -

"బియాండ్ కాఫీ" హోటల్ల ప్రొడ్యూసర్ ముందట కూసోని టెన్షన్ టెన్షన్‌గ ఆయిన మొకంలోకే సూత్తున్నడు మిస్టర్ డి.

మిస్టర్ డి, ప్రొడ్యూసర్‌కు కత జెప్పి ఆల్రెడి ఆయిదు నిమిషాలైంది. 

మస్ట్ ఇంటెన్సిటీతో ఉన్న ఆ కత గురించే ఆలోచిస్తున్నట్టు, ఎదురుంగ డైరెక్టర్ను పెట్టుకొని ఎటో చూస్తున్నడు ప్రొడ్యూసర్.  

"చానా కొత్త పాయింట్. మస్త్ ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ. ఒక్క పాట లేకున్నా హిట్టయ్యే స్టోరీ గిది... నిజంగా ఈ కతల అంత దమ్ముంది!"

అప్పటిదాకా మిస్టర్ డి మొకం కొద్ది కొద్దిగా ప్లెజెంట్ అయింది. 

"కని, రిస్కు అవుద్ది హిట్ కాకపోతె. ఇంకో లైన్ జెప్పు!" 

అనేసి, సిగిరెట్ ఎలిగిచ్చి గప్ప గప్ప గుంజుడు మొదలుపెట్టిండు ప్రొడ్యూసర్. 

మిస్టర్ డి మొకంల చిన్న షాకు! 

సెకండ్లలోనే సర్దుకొని, "సర్, ఇంకో లైన్ జెప్తా..." అన్నాడు. 

"ఊ చెప్పు చెప్పు" అన్నాడు ప్రొడ్యూసర్. 

కుర్చీ ఎడ్జ్ మీద కూర్చొని, కొత్త స్టోరీలైన్ చెప్పుడు మొదల్వెట్టిండు మిస్టర్ డి...

"కట్ జేస్తె... నైట్ ఎఫెక్టు... నేషనల్ హైవే 44 మీద డ్రోన్ షాట్ పెట్టినం సార్. చీకట్ల బ్లాక్ కోబ్రా లెక్కున్న రోడ్ మీద తెల్లటి బీయండబ్ల్యూ జమ్మున పోతాంది.... దాంట్ల హీరో ఉన్నడు...

కట్ జేస్తె... వరంగల్ల ములుగురోడ్... గక్కడ వంగపాడు అనే ఒక మస్త్  ఆసమ్ లొకేషన్... చిన్న మిడిల్ క్లాస్ డాబా ఇల్లు... లోపల బెడ్రూం... స్లీవ్‌లెస్ బనీను, చిన్న షార్ట్స్‌ల నిద్రపోతున్న హీరోయిన్ ఇంట్రడక్షన్... ఒక పూజా హెగ్డేను ఊహించుకోండి...

కట్ జేస్తె... ఫ్యాన్ గాలికి గప్పుడే హీరోయిన్ వొంటిమీదున్న గా బనీను జెర్ర పైకి లేచింది... లేచింది... లేచింది... బొడ్డు చూపించాం... ధన్ మని హీరోయిన్ బెడ్ మీద లేచి కూసుంది... 

కట్ జేస్తె... అక్కడ హైవే నంబర్ 44 మీద హీరో కారు డివైడర్‌ను గుద్దుకొని దబ దబ దబ పది పల్టీలు గొట్టింది...

కట్ జేస్తె... ఇక్కడ మన హీరోయిన్‌ ధన్ మని మల్ల పండుకున్నది!..." 

స్ప్రింగు లెక్క లేచి నిల్చున్నడు ప్రొడ్యూసర్.

"కట్ జేస్తె... సిన్మా టైటిల్ "హైవే నంబర్ 44"... కరెక్టా?" ఏదో కనుక్కున్న సైంటిస్టు లెక్క అరిచిండు ప్రొడ్యూసర్.

"అర్రె... అదే సార్ టైటిల్! మీరెట్ల కనుక్కున్నరు?!" షాకు తిన్నట్టు అడిగిండు మిస్టర్ డి.    

"ఇంక నువ్వేం జెప్పద్దు. నాకు కత మొత్తం అర్థమైంది... సైకలాజికల్ థ్రిల్లర్... గిదే మన సిన్మా. మనం జేస్తున్నం!" 

షేకాండిచ్చిండు ప్రొడ్యూసర్. 

ఆరాత్రే అడ్వాన్సు కింద పది లక్షల చెక్కు తీసుకున్నాడు మిస్టర్ డి. 

కట్ జేస్తె -

"నా బీటెక్ ఫైనలియర్ నుంచి మొన్నమొన్నటిదాక నా ప్రాణం పెట్టి, చెక్కిందే చెక్కుకుంట, ఆరేండ్లు రాసుకున్న కతరా అది... మణిరత్నం, భన్సాలి, గౌతం మీనన్ రేంజ్ మస్త్ ఇంటెన్స్ లవ్ స్టోరి... మనోనికి నచ్చలే!... అప్పటికప్పుడు నా నోటికచ్చినట్టు చెప్పిన ఫస్ట్ లైన్‌కే పడిపోయిండ్రా!!" 

"కంగ్రాట్స్ మామా, నువ్వు సూపర్... ప్రొడ్యూసర్ పల్స్ పట్టుకున్నవ్ అంటె, ప్రేక్షకుని పల్స్ పట్టుకున్నట్టె! నీ డెబ్యూ సిన్మ హిట్టుపో మామా!!" 

మణికొండల ఒక అపార్ట్‌మ్మెట్ పెంటౌజ్ మీద మిస్టర్ డి అండ్ ఫ్రెండ్స్ చేతులల్ల బీర్ బాటిల్ల మీద మూతలు టప్ప టప్ప లేస్తున్నై...  

Wednesday, 25 September 2024

ఫిలిం డైరెక్టరంటె గిన్ని కతల్ పడాలె! (Mr D - Intro)


సిన్మా ఫీల్డంటెనె చాన మందికి పడది. ఎంత చిన్న చూపంటె ఇగ జెప్పలేం.

కిందామీద చూస్తరు, ఎగతాలి చేస్తరు, తిడ్తరు, నానా మాటలంటరు. 

ఇండ్లు కిరాయికియ్యరు, పెండ్లి జేస్కుందమంటె పిల్లనియ్యరు, బ్యాంకులు లోన్లియ్యయి, ఆఖరికి... జాన్ జిగ్రీ దోస్తులే నమ్మరు.     

ఇగ కొంతమంది పనికిమాలిన సన్నాసులైతె సినిమావోల్ల గురించి యూట్యూబులల్ల హరికతల్జెప్పినట్టు నానా కతల్ చెప్తరు. ఎట్ల జెప్తరంటె... వాల్ల బెడ్రూములల్ల జాక్కొని గిట్ల వీల్లు గివన్ని చూసిండ్లా ఏంది అనిపిస్తది! లేకపోతె, వాల్లిండ్లల్ల పాయఖానలు కడుక్కుంట గివన్ని తెల్సుకున్నరా అనిపిస్తది!!    

గిదంత తెల్షి గుడ, రోజుకో వందమంది కొత్తోల్లు ఫిలిమ్‌నగర్ల అచ్చి పడ్తరు... 

రైటరైతమని, యాక్టరైతమని, డైరెక్టరైతమని, ఇంకేదో అయితమని! 

నా క్రియేటివిటీ ఇంత పొడుగని, ఇంత ఎడల్పని, ఇంత లోతని... ప్రతొక్కలకుంటది. కాదని ఎవలంటరు? ఎవల ఇగురం వాల్లదే. 

"గా ఒక్క చాన్సు దొరుకుడే లేటు, ఇగ సూపిత్త చూడు" అని మస్త్ ఊహించుకుంటరు. మస్త్ జెప్తరు.           
ఇగో గక్కన్నించే మొదలైతది అసలు కత...

కట్ చేస్తె -

ఆర్కే లక్షణ్ కార్టూన్లల్ల "కామన్ మ్యాన్" లెక్క మనకో కామన్ డైరెక్టరున్నడు. 

గాయిన పేరు... "మిస్టర్ డి". 

గాయిన అనుభవంల చూసినయి, చేసినయి, ఇన్నయి, కన్నయి... రోజుకోటి చెప్తడట మనకు. 

గవ్వన్ని ఇక్కడ, ఈ బ్లాగుల్నే పోస్ట్ చేస్తున్న...   

మన మీద మనం జోకులేసుకుంటె మస్త్ మజా ఉంటది కద... చలో ఎంజాయ్ జేద్దం! 

- మనోహర్ చిమ్మని 

Monday, 23 September 2024

కొత్త సినిమా, కొత్త ఉత్సాహం!


నేను మరీ చిన్నప్పడు సినిమారంగం, విజయచిత్ర అని రెండు సినిమా మ్యాగజైన్లను మా మేనమామ దగ్గర రెగ్యులర్‌గా చూసేవాణ్ణి. 

వాటిలో ఆర్టికిల్స్, ఇంటర్వ్యూలు, ఫీచర్స్ చాలా బాగుండేవి. వీటన్నిటితో పాటు కొత్తగా ప్రారంభమైన సినిమాల వార్తలు కూడా ఉండేవి. 

అయితే, అవన్నీ ఒకటే మాదిరిగా ఉండేవి. 

ఫలానా మూవీస్ వారి ఫలానా సినిమా ఫలానా స్టుడియోలో "రికార్డింగ్‌తో ప్రారంభించారు" అని! 

దదాపు తొంభై శాతం కొత్త సినిమాల న్యూస్ ఇలాగే ఉండేది... రికార్డింగ్‌తో ప్రారంభించారని. ఎందుకోగాని, క్రమంగా ఇలా రికార్డింగ్‌తో సినిమాలు ప్రారంభించే సంప్రదాయం అదృశ్యమైపోయింది.

ఇప్పుడు దాదాపు అందరూ, అయితే హీరోహీరోయిన్స్ పైన్నో, లేదంటే దేవుని పటాల పైన్నో క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చెయ్యడంతో ప్రారంభిస్తున్నారు. 

కట్ చేస్తే -

నా మొదటి సినిమా "కల" మణిశర్మ "మహతి" స్టుడియోలో రికార్డింగ్‌తోనే ప్రారంభించాను. 

కొంచెం గ్యాప్ తర్వాత, ఇప్పుడు మళ్ళీ నా కొత్త సినిమాను అతి త్వరలో రికార్డింగ్‌తోనే ప్రారంభించబోతున్నాం. 

ఆ తర్వాత సరిగ్గా నెలరోజులకి షూటింగ్ ప్రారంభమవుతుంది. సింగిల్ షెడ్యూల్లో పూర్తవుతుంది. 

నేనూ, నా టీమ్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం.       

- మనోహర్ చిమ్మని

Sunday, 22 September 2024

రెనగేడ్ ఫిలిం మేకింగ్ అంటే?


ఒక సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేయగలరా? 

అవును, చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. 

అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే!

అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు.

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే!

ఇంకో విశేషం ఏంటంటే - ఈ 15 సినిమాల్లో 2 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి!

జ్యోతి బనే జ్వాల, యే కైసా ఇన్సాఫ్. 

రెనగేడ్ ఫిలిం మేకింగ్ అంటే అది. 

నిజంగా గురువుగారికి వందనం .. అభివందనం! ఆయన రికార్డుల గురించి, ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

కట్ టూ 2024 - 
 
ఫిలిం నెగెటివ్ తో సినిమాలు చేసిన ఆ రోజుల్లో ఎడిటింగ్ నుంచి, ప్రతి ఒక్క శాఖలో పని చాలా ఎక్కువే. ఒక్కొక్క ఫిలిం ముక్క చేత్తో పట్టుకొని చూస్తూ, అతికించాల్సిన రోజులవి. ప్రతి చిన్న ట్రాన్సిషన్స్‌కు కూడా గంటలకి గంటలు, రోజులకి రోజులు మాన్యువల్‌గా పని చేసిన రోజులవి.

అలాంటి రోజుల్లోనే, నెలకో సినిమా తీయగలిగినప్పుడు .. ఇంత అడ్వాన్స్‌డ్ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో, ఒక్కో సినిమాకు సంవత్సరాలు పడుతుండటం నిజంగా విచారకరం.

గ్రాఫిక్ వర్క్‌లతో తీసే మాగ్నమ్ ఓపస్ ల గురించి నేను మాట్లాడ్డం లేదు. మామూలు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను.
 
అదంతే. దీనికి వంద రీజన్స్ చెప్తారు. 

Just BS... తెలుగులో దీన్నేమనాలో నాకు తెలియదు!

- మనోహర్ చిమ్మని 

Friday, 6 September 2024

విషాదం అల్లుకున్న అందం


మధుబాల... 

ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పాట... "ప్యార్ కియాతో ఢర్నా క్యా". ఆమె జీవితం కూడా అంతే నిర్భీతితో కూడిన ఒక ప్రణయ కావ్యం. 

కట్ చేస్తే -

సౌందర్య స్పృహ, శైలి, ఠీవి... ఇవన్నీ కలబోసిన రాణి మధుబాల. 

మధుబాల అసలు పేరు ముంతాజ్ బేగం.

"హీరోయిన్‌గా ఆమె కెరీర్‌లో ఆమెను పట్టుకోడానికి ప్రయత్నించిన వేలాది ఫోటోలేవీ ఆమెలోని నిజమైన అందాన్ని ఆవిష్కరించలేకపోయాయి" అన్నాడు ప్రహ్యాత ఫిలిం జర్నలిస్టు బి కె కరంజియా. 

"శిల్పం లాంటిది" అన్నాడి దేవానంద్. 

"ఇండియన్ స్క్రీన్ మీద వీనస్" గా అభివర్ణించాడు ఫిలిం ఇండియా ఎడిటర్ బాబూరావు పటేల్. 

అప్పటి టాప్ హీరో దిలీప్ కుమార్‌తో ఆమె విఫల ప్రేమ సుమారు దాశాబ్దం పైగా  నడిచింది. తర్వాత కిషోర్ కుమార్‌తో పెళ్ళి ఓ ఏడెనిమిదేళ్ళ తర్వాత విఫలమైంది. 

తొమ్మిదేళ్ళప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ప్రవేశించి, 27 ఏళ్ళపాటు సుమారు 73 సినిమాల్లో నటించి తెరమీద చెరగని ముద్రవేసింది మధుబాల. 

మహల్, కాలా పాని, హౌరా బ్రిడ్జి, మిస్టర్ అండ్ మిసెస్ 55, బర్సాత్ కి రాత్, మొఘలే ఆజమ్ వంటివి ఆమె నటించిన కొన్ని మంచి క్లాసిక్ సినిమాలు.

మొఘలే ఆజమ్ సినిమాలో దిలీప్ కుమార్, మధుబాల నటించి మెప్పించిన కొన్ని అత్యంత క్లాసిక్ రొమాంటిక్ సన్నివేషాల షూటింగ్ సమయం నాటికే వారిద్దరి ప్రేమ విఫలమైంది, వారిద్దరి మధ్య అసలు మాటలేవు అన్న విషయం తెలిసినప్పుడు నిజంగా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.   

అప్పటి హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాంక్ కాప్రా మధుబాలతో సినిమా తీయాలనుకున్నాడు. అది వేరే కథ.   

నాణేనికి మరోవైపు, హీరోయిన్‌గా టాప్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఆమె జీవితమే ఒక బిజినెస్ గాంబ్లింగ్‌గా మార్చారామె కుటుంబసభ్యులు. ఇదంతా అసలు పట్టించుకోకుండా బ్రతికినన్నాళ్ళూ తనకు నచ్చిన ప్రేమ కోసమే అన్వేశిస్తూ, ఆ అన్వేషణలోనే కేవలం 36 ఏళ్ళకే ఆమె మరణించడం అనేది భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి అత్యంత విషాద ఘట్టం.      

నిరంతరం ప్రేమ సౌందర్యం కోసం తపించిన ఈ సౌందర్య రాశి పుట్టినతేదీ, ఇప్పటి వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 కావడం యాదృచ్చికం. 

- మనోహర్ చిమ్మని 

Tuesday, 3 September 2024

విశ్వంభర క్రియేషన్స్ వారి... "Just_ప్రేమ"


ఈరోజు నుంచి ఒక 365 రోజుల సమయంలో, నా డైరెక్షన్ టీమ్ నుంచి కనీసం ఒక ఇద్దరు కొత్త డైరెక్టర్స్‌ను పరిచయం చెయ్యబోతున్నాను. ఆ దిశలో ఇప్పటినుంచే పనులు జరుగుతున్నాయి.

కట్ చేస్తే -

"Just_ప్రేమ" అనేది నేను ఎప్పటినుంచో అనుకుంటున్న డ్రీమ్ టైటిల్. దానికి తగ్గ సబ్జెక్ట్ ఉంది. స్క్రిప్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఇతర ప్రి-ప్రొడక్షన్ పనుల్లో మా టీమ్ బిజీగా ఉంది. 

సబ్జెక్ట్ డిమాండ్ దృష్ట్యా, ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో చేస్తున్నాము. పాపులర్ హీరోహీరోయిన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులతో భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

విశ్వంభర క్రియేషన్స్ బ్యానర్ పైన, నా మిత్రుడు విజయేంద్ర నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఫ్లోర్స్ పైకి వెళ్ళి "యాక్షన్!" చెప్తానా అని డైరెక్టర్‌గా నేను, ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో మునిగిపోతామా అని నా టీమ్... చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాము.  

కెమెరామన్‌గా ఈ సినిమాకు నా మిత్రుడు వీరేంద్ర లలిత్ (ముంబై) చేస్తున్నాడు. 

ఈ ప్రాజెక్టుకి సీ ఈ వో ప్రదీప్‌చంద్ర. 

మ్యూజిక్, ఇతర టెక్నీషియన్స్‌ను త్వరలో ప్రకటించబోతున్నాం. 

దర్శకత్వ శాఖలో ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తున్న లహరి జితెందర్ రెడ్డి, ప్రస్తుతం నా టీమ్‌లో చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. లహరి డైరెక్టర్‌గా, తన మొదటి సినిమాను, ఒక భారీ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు రూపంలో  2025 లో ప్రారంభించబోతోంది.  

కట్ చేస్తే -

ఈరోజు మా విజయేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆఫీసులో పూజాకార్యక్రమాలు నిర్వహించి "Just_ప్రేమ" వర్కింగ్ పోస్టర్‌ను విజయేంద్రకు అందించటం జరిగింది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా "Yo!"తో పాటు, ఇప్పుడు ఈ సినిమా పనులు కూడా ఈరోజు నుంచి ఊపందుకోనున్నాయి. 

"Just_ప్రేమ"తో విజయేంద్ర ప్రొడ్యూసర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని నేనూ, నా టీమ్ ఆశిస్తున్నాము. ఆ స్థాయిలో మా అందరి కృషి ఉండబోతోంది. 

Happy Birthday, dear Vijayendra! Here’s to a wonderful year of blockbuster success and cinematic magic! 

- మనోహర్ చిమ్మని