అనేకమంది ఉద్దండులయిన కవులూ, రచయితల వ్యాసాలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక కోసం నేనేం రాయగలను అని ముందు సందేహించాను. కాని, మా యాకూబ్ జీవితంలోని ఇలాంటి ఒక ప్రత్యేక సందర్భంలో మిత్రుడిగా నేను ఏం రాయకపోవడం అన్నది నా బాధ్యతను విస్మరించడమే అవుతుందని తర్వాత నాకనిపించింది.
ఇది సాహిత్య వ్యాసం కాదు. కాని, యాకూబ్‌తో ఓయూ క్యాంపస్ కాలంనాటి నా జ్ఞాపకాలు ఖచ్చితంగా అలాంటి సౌరభాన్నే అందించగలవని నా నమ్మకం.
అందరి విషయాల్లో, అన్ని సందర్భాల్లో... ఒక్క డబ్బు సంపాదనే విజయానికి కొలమానం కాదు. అనుకున్నట్టుగా జీవించటం కూడా విజయమే!
'యాకూబ్ @ 60' ప్రత్యేక వ్యాసాల సంకలనం కోసం నేను రాసిన వ్యాసం ఇదీ:
"యాకూబ్ అంటే నాకిష్టం. ఎమ్మేలో నా క్లాస్‌మేట్, నా మిత్రుడు అనే కాదు… మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇల్లందుకు రొట్టమాకురేవు చాలా దగ్గరవటం వల్ల కూడా కాదు…
35 ఏళ్ల క్రితం ఓయూ ఆర్ట్స్ కాలేజిలోని మా ఎమ్మే తెలుగు క్లాసులో మొట్టమొదటిసారిగా యాకూబ్‌ను కలిసిన రోజు, అతను మాతో మొదటిసారిగా మాట్లాడిన మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి:
"నా పేరు యాకూబ్. ఓయూ పీజీ కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చాను."
ఎమ్మే తెలుగులో ఇద్దరం ఒకటే క్లాసు. క్యాంపస్‌లో ఇద్దరం ఒకటే హాస్టల్. అప్పటి మా స్నేహం, నాతోపాటు మా ఎమ్మే మిత్రబృందం అందరితోనూ ఇంకా కొనసాగుతూనే ఉంది.
క్యాంపస్‌లో యాకూబ్ ఎక్కువగా విద్యార్థినాయకులతో కలిసి తిరుగుతూ కనిపిస్తుండేవాడు. ఆర్ట్స్ కాలేజి మీటింగ్ హాల్ “రూమ్ నంబర్ 57” లో ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు, క్యాంపస్ హాస్టళ్ళలో ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు పాటలు పాడుతుండేవాడు. స్టుడెంట్స్ ఎలక్షన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొనేవాడు.
మేమంతా ఒక్కటే మిత్రబృందం అయినా - మా స్టుడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్, ఇష్టాలు విభిన్నంగా ఉండేవి. నేను రాడికల్ స్టుడెంట్స్ యూనియన్ (RSU) రహస్య సమావేశాల్లో పాల్గొనేవాణ్ణి. నా అతి దగ్గరి మిత్రులు కొందరు PDSU లో, ఇంకొందరు ABVP లో తిరుగుతుండేవాళ్ళు. యాకూబ్ ఆరోజుల్లో SFI లో ఒక స్థాయి లీడర్‌నే చెప్పాలి. అప్పట్లో అదంతా వేరే ఒక లోకం.
ఆ లోకానికి అసలు సంబంధమేలేని విధంగా, పూర్తిగా ఒక భిన్నమైన ఇంకో లోకంలో "Big 5" అని మా క్లోజ్‌డ్ మిత్రబృందం ఒకటి చాలా యాక్టివ్‌గా ఉండేది. ప్రిన్సిపాల్‌గా ఇటీవలే రిటైరయిన దయానంద రావ్, డిప్యూటీ సెక్రెటరీగా రిటైరయిన ప్రతాప్ రెడ్డి, లెక్చరర్-జర్నలిస్టు శేషాద్రి, సీనియర్ జర్నలిస్టు-ఎడ్యుకేషనిస్టు రాందాస్, నేనూ… ఈ బిగ్ ఫైవ్‌లోని ఐదుగురు హార్డ్‌కోర్ మిత్రులం.
క్లాసులో, కారిడార్లలో, కేంటీన్లలో, పిక్నిక్స్‌లో, విహారయాత్రల్లో ఎప్పుడూ మేం చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్లం. క్యాంపస్ పరిసరాల్లోని చెట్లకింద, బండలమీద అర్థరాత్రులు దాటిపోయేదాకా కూర్చొని చాయ్‌లూ, సిగరెట్లూ, ప్రేమలూ వైఫల్యాలూ, భావుకత్వం, పుస్తకాలూ కవిత్వాలూ, పాటలు, జోకులు, కేకలు... మావన్నీ అలా ఒక రేంజ్‌లో నడిచేవి.
"బిగ్ ఫైవ్ ఏంట్రా మీరు స్పెషల్‌గా...?" అని అప్పుడప్పుడూ మా అయిదుగురిమీద ప్రేమగా మొదలెట్టి, తర్వాత పీక్స్‌కెళ్ళి మాంచి ‘సంస్కృతం’లో అరిచేవాడు యకూబ్.
తనలోకంలో అలా కొనసాగుతూనే, క్రమంగా మా లోకంలో కూడా కనెక్టయిపోయాడు యాకూబ్. అలా కనెక్ట్ కావడం కావడమే - ఒక మండు వేసవిలో అందరం కలిసి యాకూబ్ ఊరు రొట్టమాకురేవుకి అప్పటికప్పుడు అనుకొని సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కడానికి దారితీసింది.
రొట్టమాకురేవు...
మా జ్ఞాపకాల్లో అదింకా ప్రవహిస్తూనే ఉంది. మా బిగ్ ఫైవ్ మిత్రబృందం, యాకూబ్‌తో కలిసి వెళ్ళిన ఆ నాలుగయిదురోజుల ట్రిప్పులో ప్రతి చిన్న అంశం నాకింకా గుర్తుంది, 35 ఏళ్లు గడిచినా...
పొడిపొడిగా, తడితడిగా ఉన్న మట్టిదారుల్లో మేమంతా జోక్స్ వేసుకొంటూ, పాటలు పాడుకొంటూ, కేకలూ పెడబొబ్బలు పెట్టుకొంటూ (అతిశయోక్తి కాదు!) నడుచుకొంటూ వెళ్ళి చేరుకొన్న నదీమూలం లాంటి ఆ మట్టిగోడల ఇల్లు, దానిపక్కనే ఎడ్ల చావిడి, చుట్టూ ఒక అతి చిన్న పల్లెటూరి పరిసరాల ఫ్రాగ్రెన్సీ... ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒక మంచి అనుభూతి.
యాకూబ్ ఇంటి నుంచి నాలుగడుగులు నడిస్తే వచ్చే బుగ్గవాగు, వాగులో మా ఈతలూ స్నానాలూ... రొట్టమాకు రేవు నుంచి గేట్ కారేపల్లికి రోజూ మేం నడుచుకొంటూ వెళ్లటం, మధ్యలో కాలువపై ఉన్న రైలుపట్టాల మీదనుంచే మేం ఒకరి వెనుక ఒకరం కాలువదాటివెళ్ళాల్సిన దారి... అన్నీ ఇంకా కళ్ళముందు షాట్ బై షాట్ కనిపిస్తున్నాయి.
యాకూబ్ వాళ్ల అమ్మ, నాన్న, అన్నదమ్ములు, చెల్లెలు… మమ్మల్ని ఎంతో బాగా చూసుకొన్న ఆ నాలుగు రోజుల్ని ఇప్పటికీ నా కళ్ళముందు రివైండ్ చేసుకోగలుగుతున్నాను అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి…
అలాంటి స్వచ్చమైన వాతావరణాన్ని, మనుషులను, మనసులను మనం మిస్ అయిపోయి దశాబ్దాలవుతోంది బహుశా. మన అవసరాలూ, ఆర్థిక కోణం చేయించే అనేక తప్పు నిర్ణయాలు, పెరిగిన దూరాలూ, లేచిన అడ్డుగోడలూ, హిపోక్రసీ ముసుగులూ, నగర జీవితపు ఉరుకులూ పరుగులూ… ఇలా ఎన్నెన్నో కారణాలు.
చివరికి, మనకే అస్పష్టమైన మన గమ్యాలకు మనమే ఎన్నటికీ పెట్టలేకపోతున్న ఫుల్‌స్టాపుల కోసం వెతుక్కొంటూ వెతుక్కొంటూ చాలా కోల్పోయాం. చా..లా..నే కోల్పోయాం.
కారేపల్లిలో యాకూబ్ మిత్రుడు ఒకరు (పేరు వెంకటేశ్వర రావు అనుకుంటాను) మా ఆరుగురికి మాంచి "పార్టీ" ఇవ్వటం గుర్తుంది. ఆ పార్టీ మజాలో సింగరేణి కాలరీస్ ఎండ, వేడి, చమటలు, తడిసిపోయిన మా డ్రెస్సులు... ఇవేవీ అప్పుడు మమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేకపోయాయి.
రొట్టమాకురేవులో మేం ఉన్న ఆ నాలుగురోజులూ యాకూబ్‌లో ఎప్పుడూ ఏదో ఒక ఆరాటం, తపన. ఆ చిన్న పల్లెటూళ్ళో మేమెక్కడ ఇబ్బందిపడిపోతున్నామో, ఏదైనా తక్కువయినా కూడా… ‘ఫ్రెండ్‌నని ఏం చెప్పలేకపోతున్నారేమో’ అని ఆ కళ్లల్లో ఏదో ఒక అనవసరపు ఆదుర్దా నాకింకా గుర్తుంది.
మా ఎమ్మే క్లాస్‌రూమ్‌లో, హాస్టల్ గదుల్లో, మేం గ్రూపుగా అందరం ఒక్కచోట కలిసి కూర్చున్న ప్రతిసారీ - మా ప్రతాప్ రెడ్డి, రమ, శేషాద్రి, యాకూబ్ పాటలు పాడటం అనేది ఒక అతి మామూలుగా జరిగే విషయం. యాకూబ్ "పతితులారా భ్రష్టులారా", "వందేమాతరం" అని (అక్కడ ఏదుంటే దానిమీదే దరువేస్తూ) గొంతెత్తి పాడుతుంటే ఆ కొన్ని నిమిషాలు అందరం ఒక ‘హై’ లోకి వెళ్లేవాళ్లం.
ఎమ్మే తర్వాత మా మిత్రులందరి దారులు రకరకాలుగా వేరయ్యాయి…
యాకూబ్ తెలుగు పండిట్ ట్రెయినింగ్‌కు వెళ్ళటం, తెలుగు యూనివర్సిటీలో M Phil, ఉస్మానియాలో Ph D, లక్ష్మి గారితో పరిచయం, వారి ప్రేమ, పెళ్ళి, వారికి సాహిర్ పుట్టడం, అన్వరులులుం కాలేజీలో ఉద్యోగం, కవి యాకూబ్‌గా పూర్తిస్థాయిలో కవిత్వంతో కరచాలనం, వరుసగా కవితా సంకలనాలు, పుస్తకాలు ప్రచురించడం, ఆవిష్కరించడం, ఇప్పటివరకు తెలుగులో రాని ఒక కొత్త రూపంలో "కవి సంగమం" అనే ఫేస్‌బుక్ వేదికకు రూపశిల్పి, సృష్టికర్త, సారథి కావడం… 15 కు పైగా అవార్డులు సాధించడం… అనేకమంది కొత్తతరం కవులకు ప్రోత్సాహం ఇవ్వడం, సీనియర్ కవులతో కలిసేందుకు కవిత్వ సందర్భాలను సృష్టించడం, కవిసంగమం పొయట్రీ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ, జాతీయకవులను ఆహ్వానించడం, వారితో ముఖాముఖి నిర్వహించడం, తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సామాజిక మాధ్యమాల ద్వారా నిర్మించడం, ప్రతినెలా 'మూడుతరాల కవిసంగమం', 'ఊరూరా కవిసంగమం' నిర్వహించడం ద్వారా కొత్తతరం కవులను భాగస్వామ్యం చేసి, వారికి లాంచింగ్ ప్యాడ్ లా కవిసంగమంను రూపొందించడం… ఆధునిక తెలుగు కవిత్వచరిత్రలో కవిసంగమం సృష్టికర్తగా తనకూ, తన కవిసంగమానికీ కలిపి ఒక ప్రత్యేక పేజీ లిఖించుకోవడం... ఈమధ్యే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేయడం... అన్నీ ఒక న్యూస్‌రీల్‌లా చకచకా జరిగిపోయాయి.
యాకూబ్ కవిత్వంపై మధురై కామరాజ్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగడం… గ్రామాలు సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా రూపొందాలనే స్ఫూర్తితో, కేరళలోని తుంచన్ మెమోరియల్ సెంటర్ తరహాలో స్వగ్రామం రొట్టమాకురేవులో Rottamaku Revu Poetryspace Foundation (RRPF) స్థాపించడం... నా పర్సనల్ కలెక్షన్‌లోని చాలా పుస్తకాలను RRPF కు నేను విరాళంగా అందించే అవకాశం రావడం... తన జీవితంలో ప్రేరణనిచ్చిన తండ్రి షేక్ మహమ్మద్ మియా, చదివించిన కే ఎల్ నరసింహారావు, స్ఫూర్తినిచ్చిన మామగారు పురిటిపాటిరామిరెడ్డి గార్ల పేరిట 'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు' లను ఆరేళ్లక్రితం స్థాపించి కొనసాగిస్తూండటం... ఇవన్నీ కూడా ఒక మిత్రుడిగా యాకూబ్ పట్ల నేను చాలా గర్వంగా ఫీలయ్యే అంశాలు.
అయితే - శిలాలోలిత (లక్ష్మి) అనే స్నేహశీలి అయిన ఒక మంచి వ్యక్తి, కవయిత్రి యాకూబ్ జీవితంలో లేకుండా ఇదంతా ఊహించలేం అన్న నిజాన్ని యాకూబ్ కూడా ఒప్పుకొంటాడు.
ఆమధ్య నా మిత్రులు ఒక్కొక్కరే రిటైరయిపోతుంటే నేను నమ్మలేకపోయాను. అలాగే యాకూబ్ రిటైర్మెంట్ విషయంలో కూడా.
ముందు "కవి యాకూబ్@60" అన్న శీర్షిక నాకు నచ్చలేదు.
అసలు కవికీ, సృజనతో రాత్రింబవళ్ళు సరాగాలాడేవారికీ వయసుతో పనేంటి?… వయసు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరమేంటి??
Age is just number. అంతకంటే ఏంలేదు…
"మా యాకూబ్‌కు అప్పుడే 60 ఏళ్ళా?!" అన్నది నాకు ఇప్పటికీ ఒక పెద్ద ఆశ్చర్యం.
కాగా, “ఇంకో నాలుగైదేళ్ళలో నాక్కుడా కదా!!" అన్నది నాకింకో అత్యంత ఇబ్బందికరమైన ఇష్టంలేని నిజం.
అయితే కొన్ని నిజాల్ని ఒప్పుకొనితీరాలి. అలాగని అక్కడితో ప్రపంచం ఆగిపోదు, అంతా అయిపోయినట్టూ కాదు. యాకూబ్ జీవితంలో ఇది ఇంకో ముఖ్యమైన మైలురాయి. అంతే.
దాదాపు ఓ 10 నెలలుగా కరోనా వైరస్ తెచ్చిన లాక్‌డౌన్ సమయంలో - మన కళ్ళముందే ఎందరో పిట్టల్లా టపటపా రాలిపోయారు. ఎవరం ఎన్నాళ్లుంటామో తెలీదు. ఉన్నన్నాళ్ళుమాత్రం - లేనిపోని ఈగోలు, హిపోక్రసీలు, ఒత్తిళ్ళు వీలైనంత తగ్గించుకొని బిందాస్‌గా బ్రతకడం మాత్రం చాలా అవసరం. కవులకూ, రచయితలకూ అప్పుడప్పుడూ చిన్న రిలీఫ్ అవసరం. నా దృష్టిలో యాకూబ్ సృష్టించిన కవిసంగమం అలాంటి ఒక మంచి రిలీఫ్‌నిచ్చే "స్ట్రెస్ బస్టర్" కూడా.
వ్యక్తిగత జీవితంలో ఎంతో స్ట్రెస్ ఉన్నా - కొత్త సమస్యలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నా- వాటి ట్రాక్‌ను వాటికి వదిలి… సాహిత్యం విషయంలో, కవిత్వం విషయంలో తనకు చేతనయింది ఏదో చేయాలన్న తపన యాకూబ్‌కు లేకపోతే “కవి సంగమం” అనే మాట మనం విని ఉండేవాళ్లం కాదేమో. అత్యంత విజయవంతంగా 2012 నుంచీ కవి సంగమం వివిధరూపాల్లో ఇంకా కొనసాగుతోందంటే దాని వెనుక యాకూబ్‌లో ఉన్న నిరంతర తపనే కారణమని నేను గట్టిగా నమ్ముతాను.
ఇప్పుడు తాజాగా "కవి సంగమం" వెబ్ పత్రిక కోసం కూడా యాకూబ్ పనిచేస్తున్నట్టు మొన్నొక ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిసింది. బహుశా ఈ యాకూబ్@60 సంచిక వచ్చేలోపే కవిసంగమం వెబ్ పత్రిక కూడా మనం చూస్తాం.
కట్ చేస్తే -
అనేకమంది ఉద్దండులయిన కవులూ, రచయితల వ్యాసాలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక కోసం నేనేం రాయగలను అని ముందు సందేహించాను. కాని, మా యాకూబ్ జీవితంలోని ఇలాంటి ఒక ప్రత్యేక సందర్భంలో మిత్రుడిగా నేను ఏం రాయకపోవడం అన్నది నా బాధ్యతను విస్మరించడమే అవుతుందని తర్వాత నాకనిపించింది.
ఇది సాహిత్య వ్యాసం కాదు. కాని, యాకూబ్‌తో ఓయూ క్యాంపస్ కాలంనాటి నా జ్ఞాపకాలు ఖచ్చితంగా అలాంటి సౌరభాన్నే అందించగలవని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇవ్వాళ ఉదయం వైజాగ్ నుంచి హైద్రాబాద్ వస్తూనే యాకూబ్‌కి వాట్సాప్ చేశాను…
"బ్లాగ్ రాసినట్టు రాస్తాను. ఏం అనుకోవద్దు" అని.
“Yes. As you wish” అని రిప్లై ఇచ్చాడు.
ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది… ఈ ప్రత్యేక సందర్భంలో నా మిత్రుడు యాకూబ్ కోసం ప్రవహించే జ్ఞాపకాల్లో నేనూ ఒక మంచు బిందువు అవుతున్నందుకు.
స్కూలురోజుల్లోనే - వేసవి సెలవుల్లో, మండుటెండల గోదావరిఖనిలో ఐస్క్రీమ్ బండి తోసుకొంటూ ఐస్క్రీమ్‌లు అమ్మిన మా యాకూబ్ గురించి నాకు తెలుసు. చదువుకోసం పార్టీ ఆఫీసులో బాయ్‌గా పనిచేసిన యాకూబ్ నేపథ్యం నాకు తెలుసు. చాలాసార్లు క్యాంపస్‌లో ఆదివారం రాత్రి మెస్‌లో భోజనం లేనప్పుడు, మా జేబులో ఉన్న పైసలతోనే నర్సిమ్మ క్యాంటీన్లో కలిసి చాయ్ త్రాగి, కబుర్లు చెప్పుకొని, హాస్టల్లో ఎవరి రూములకి వాళ్లం వెళ్ళి హాయిగా పడుకున్నవాళ్ళం. అప్పటి యాకూబ్ కూడా నాకింకా గుర్తు.
35 ఏళ్ల క్రితం యాకూబ్ నన్ను "మనూ" అని ఎలా పిలిచేవాడో ఇప్పుడూ అంతే. అదే పిలుపు. వాడికి మనసు లోపలా బయటా అని ఏం లేవు. అంతా ఒక్కటే. అదే ఆత్మీయత, అదే ఆర్ద్రత. ఆ గొంతులో అప్పుడూ ఇప్పుడూ అదే తడి.
అందుకే యాకూబ్ అంటే నాకిష్టం. మా ఎమ్మే మిత్రుల్లో కూడా అందరికీ ఇష్టం.
- మనోహర్ చిమ్మని
***
This was written by me for Palapitta Magazine's special issue on my friend #KaviYakoob, sometime back.
- Manohar Chimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani