కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి. చెప్పలేనంత హడావిడి...
జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!
పంద్రాగస్టుకు, చబ్బీస్ జనవరికి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫ్రెష్‌గా రాగడిమట్టి తెచ్చి తడితడిగా గద్దె కట్టాల్సిందే. తర్వాత ఎర్రమట్టితో అలకాల్సిందే...
సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి... ఇంకో పదిమంది ఆనాటి యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా, మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.
ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే అర్థరూపాయి, రూపాయి, రెండు రూపాయల చొప్పున ఇంటింటికి తిరిగి చందాలు వసూలుచేసేవాళ్లు. సెంటిమెంట్ కోసం, ముందు మా ఇంటికే వచ్చి రెండు రూపాయల చందా తీసుకున్న తర్వాతే మిగిలినవాళ్ళ ఇళ్ళకు వెళ్ళేవారు.
రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న పొడవాటి అరుగులపైన కూర్చుని - కనీసం వారం పదిరోజుల ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు.
వాళ్లకంటే ఓ పదేళ్లు తక్కువ వయసువాళ్లమయిన నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.
మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది.
జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది.
జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా!
వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.
జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే.
ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!
తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.
గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు జెండా ఎగురవేసేవారు. జెండా ఎగరేయడానికి స్పెషల్ గెస్ట్ అని ఇప్పట్లా ఎవరినో పిలవటం అప్పుడు లేదు.
తర్వాత స్వీట్లు, చక్కెర కలిపిన కొబ్బరి ముక్కలు, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు... ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.
కట్ టూ ప్రెజెంట్ -
అప్పటి ఆ యువతరం గ్రూపులో చాలామంది ఇప్పుడు లేరు. నా చిన్ననాటి మిత్రుల్లో కూడా ఓంప్రకాశ్, జయదేవ్ ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా పూర్తిగా తెలియదు.
ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది.
జెండా గద్దె ముందున్న అప్పటి మా 16 దర్వాజాల పెద్ద ఇల్లు ఇప్పుడు లేదు.
జెండావందనం ఇప్పుడు అక్కడ ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఇవాళ ఎవరు జెండా ఎగరేశారో తెలియదు. అప్పట్లా జెండాల తోరణాలు ఇప్పుడు కూడా వీధివీధంతా కడుతున్నారా అసలు? ఆనాటి సీరియస్‌నెస్ ఇప్పుడు కూడా ఉందా?
అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.
ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా... వరంగల్లోని 17 వ వార్డులో... నా చిన్ననాటి పంద్రాగస్టు, చబ్బీస్ జనవరిల గురించి ఇట్లా నెమరేసుకుంటున్నానంటే, నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ నా తల్లిదండ్రులు, నేను పుట్టిపెరిగిన నా వరంగల్, నా చిన్ననాటి స్నేహితులు, అప్పటి స్వచ్ఛత, అప్పటి వాతావరణం.
మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదు. మంచి వాతావరణం, మంచి జ్ఞాపకాలు కూడా.
ఈ విషయంలో నా తల్లిదండ్రులు నాకిచ్చినంత జ్ఞాపకాల సంపద... నేను నా పిల్లలకు ఇచ్చానా అని నాకే అప్పుడప్పుడు కొంచెం సందేహంగా ఉంటుంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani