మన నిర్ణయాలకు మనకు కనిపించని ఇంకెవ్వరినో బాధ్యున్ని చేయడం నాకు ఇష్టం వుండదు.
ఆ ఇంకెవరు మరెవరో కాదు... దేవుడు.
నేను దేవుడు లేడు అనను. వున్నాడు అని చెప్పడానికి నాదగ్గర ఆధారాలేమీ లేవు.
మన చుట్టూ ఇంత అద్భుతమైన క్రియేషన్ వెనుక తప్పక ఏదో ఒక శక్తి వుండే వుంటుందన్నది మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. అయితే ఆ శక్తికి ఇన్ని పేర్లుండటం, ఇన్ని ఊహాత్మక రూపాలుండటం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు.
అయితే - ఇంకొకర్ని బాధపెట్టనంతవరకూ అన్ని రూపాలూ అద్బుతమే.
ఈ రూపాలన్నిటిలో నాకు బాగా నచ్చిన రూపం శివుడు. నాకు బాగా నచ్చిన తత్వం శివతత్వం. అంతే బాగా నాకు నచ్చిన ఇంకో రూపం కృష్ణుడు, ఇంకో తత్వం కృష్ణతత్వం. రెండూ వైరుధ్యంగా అనిపించవచ్చు. కానీ, నాకు మాత్రం రెండూ ఒక్కలాగే అనిపిస్తాయి.
కట్ చేస్తే -
మతం అనేది పూర్తిగా మానవ సృష్టి. ఎవ్వరూ ఇంతవరకు చూడని, ఎవ్వరికీ తెలియని ఆ శక్తిని ఎవరికి వారు ఎన్నెన్నో రూపాలతో, ఎన్నెన్నో పేర్లతో వారి వారి మతాలకు మూలం చేసుకోవడం కూడా నాకు మరింత విచిత్రంగా అనిపిస్తుంది. పైగా, మనిషే సృష్టించుకొన్న ఈ మతాలు నేపథ్యంగా ఇన్ని రాజకీయాలు, ఇన్ని గొడవలేంటి?
పెద్ద నాన్సెన్స్ కదా...
ఈ నాసెన్స్‌నంతా దేవుడనే ఆ శక్తి చూస్తూ ఊరికే వుండలేడని నేననుకుంటాను. అతనికి అంత తీరిక వుండదు. ఇంతకంటే బ్రహ్మాండమైన అద్భుతాలను ఇంకేవైనా సృష్టించే పనిలో చాలా బిజీగా వుండుంటాడాయన.
అలా కాకుండా - మన పాపపుణ్యాలనో, మన పూర్వజన్మ సుకృతాలనో-దుష్కృతాలనో లెక్కలు వేసుకొంటూ ఒక్కొక్కరి జమాఖర్చులు చూసేంత పనికిమాలిన పని చేస్తూ తన సమయం వృధా చేసుకోడని నా గట్టి నమ్మకం.
అన్నిటినీ మించి, భూమ్మీద ఇన్ని బాధల్ని సృష్టించేంత శాడిస్టు మాత్రం అసలు కాడన్నది నేను గట్టిగా నమ్మే ఇంకో నిజం.
ఆయన చేయాలనుకొన్న పని ఆయన చేశాడు. మనం చేయాల్సింది మనం చేయాలి. అది కూడా అందంగా చేయాలి, ఆనందంగా వుండాలి.
అప్పుడు మాత్రమే ఆయనకు ఆనందంగా వుంటుంది...
ఈమాత్రం అంతర్విశ్లేషణకు ఇంత కాలం పట్టడం అనేదే జీవితంలో అతి పెద్ద దుఖం. నేను చూడని, నాకు తెలియని ఆ శక్తిని దీనికి బాధ్యున్ని చేయడమంత మూర్ఖత్వం ఇంకోటి వుండదు.
God, I'm sorry. Please forgive me. Thank you. I love you.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani