Sunday, 21 July 2024

నిజంగా జీవితం అయిపోయిందా?


జీవితమంతా పిల్లల కోసం కష్టపడటంతోనే సరిపోతుంది...

మన ఇష్టాలు, మన ప్యాషన్స్... ఇంకెన్నో మన ప్యాషనేట్ థింగ్స్, పర్సనల్ ఫేసినేషన్సూ... పిల్లల కోసం అన్నీ అలా వదిలేసుకుంటాం.

చూస్తుండగానే పిల్లలు చాలా పెద్దవాళ్ళయిపోతారు.  

కొంచెం ఫ్రీ అయ్యాం కదా, ఇక పిల్లలతో కాస్త ఎక్కువ సమయం గడపొచ్చు అనుకుంటాం.

కట్ చేస్తే - 

ఒక టైమ్ వస్తుంది. 

ఒక్కొక్కరే... మనం అంత ఈజీగా కలుసుకోలేనంత దూరం ప్రయాణమవుతారు.

సంవత్సరానికో, రెండేళ్ళకో తప్ప ఇంక కలవలేం. 

అది వారి జీవితం. వారి ఇష్టం. వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉండాలి. 

వారి కోసం నేను చేయగలిగినదాంట్లో కనీసం ఒక పది శాతం కూడా చెయ్యలేకపోయాను. ఆ నేపథ్యం, ఆ కారణాలిప్పుడు అనవసరం. అయినా సరే, ఇంకా తాపత్రయపడుతున్నాను. తండ్రిని కదా... 

ఇప్పుడు, ఈ క్షణం కూడా వారి కోసం ఇంకేం చెయ్యగలనా అని ఆలోచిస్తున్నాను.    

కట్ చేస్తే -

ఇంకొన్ని గంటల్లో మమ్మల్ని వేరు చేసే ఫ్లయిట్... నాకూ వారికీ మధ్య సుమారు 14,000 కిలోమీటర్ల దూరాన్ని సృష్టించబోతున్న లోహవిహంగం... 

సుమారు 30 నెలల క్రితం బెంగుళూరు నుంచి నాకెంతో ప్రియమైన మా చిన్నబాబుని ఫ్లయిట్ ఎక్కిస్తూ ఇలాగే నిశ్శబ్దంగా వర్షించాను. 

ఇప్పుడు మా పెద్దబాబు... నా ప్రాణం. 

ఎంత ప్రేమ వీళ్లంటే నాకు?

అసలెలా ఇంత తేలికగా, ఇంత సులభంగా, ఇంత భావశూన్యంగా వీళ్లని ఇంతింత దూరం పంపించగలుగుతున్నాను?

ఇంత రాక్షసున్ని ఎప్పుడయ్యాన్నేను?          

ఒక్క క్షణం ఆలోచిస్తే, గుండెల్లో ఎక్కడో కలుక్కుమంటోంది. ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నా కళ్ళు పదే పదే తడిసిపోతున్నాయి నాకు తెలియకుండానే.  

ఈ పరిణామం కోసమే కదా జీవితమంతా నేను కష్టపడింది? నాకిష్టమైనవి ఎన్నో వదిలేసుకుంది? నాకిష్టమైన ఎందరినో దూరం చేసుకుంది? 

చివరికి వీళ్ళూ దూరమే కదా అవుతోంది? 

ఇంతకుముందు మా తల్లిదండ్రులు కూడా బహుశా ఇంతే కదా? ఇలాంటి అనుభవమే కదా చివరి క్షణం వరకూ మా తల్లిదండ్రులు కూడా అనుభవించింది? 

ఎంత క్రూరమైంది ఈ ప్రకృతి చక్రం?

ఖతమ్. 

జీవితం అయిపోయింది.

కట్ చేస్తే - 

బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్... 

ఇప్పుడు ప్రారంభిస్తున్నాను నా జీవితం, కొత్తగా. 

ఇప్పుడంతా ఇక నా ఇష్టం. 


- మనోహర్ చిమ్మని 

Thursday, 18 July 2024

Get That One Call...


ఒక అయిడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు.

ఒక్కోసారి, ఒక ఫోన్ కాల్ కూడా అలా జీవితాన్ని మార్చెయ్యవచ్చు.  

"బటర్‌ఫ్లై ఎఫెక్ట్"లా... పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా... ఓవర్‌నైట్‌లో నా మీద ఊహించనంత ప్రభావం చూపించగలిగే అలాంటి శక్తి వున్న ఆ ఒకే ఒక్క కాల్ కోసం ఇప్పుడు నేను ఎదురుచూస్తున్నాను. 

కట్ చేస్తే - 

ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా... అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదు.

ఏదైనా ఒక్కటే ఎన్నిక చేసుకోవాలి. దాని మీదే పూర్తి ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత మనం సాకులు వెతుక్కోలేం. మనం చేసినదానికి, వచ్చిన ఫలితానికీ బాధ్యత తీసుకొని తీరాలి. 

అలాంటి చాలెంజ్‌కు సిద్ధపడగలిగినవారే ఏదైనా సాధిస్తారు. 

ఇప్పుడు నేను అలాంటి  ఒక గట్సీ చాలెంజ్‌ను నామీద నేనే విసురుకున్నాను. 

సో, ఏ పావులు కదిలించాలో కదిలించు. ఏం చెయ్యాలో చెయ్యి. కాని, ఫోకస్ మాత్రం పూర్తిగా ఏదైనా ఒక్కదానిమీదే పెట్టు. 

కాల్ తెప్పించుకుంటావో, కాళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం. 

ఒక తపస్సులా పనిచెయ్యి.

నువ్వు అనుకున్నది ఏదైనా అతి సులభంగా నువ్వే సాధిస్తావు. 

Now, go and wait for that one call that will change your life overnight...

- మనోహర్ చిమ్మని 

Tuesday, 16 July 2024

అంతం కాదిది... ఆరంభం!


నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటారు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2024 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. 

అలాంటి చలం, ఆరోజుల్లోనే, ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశారంటే... ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరారు. 

చేరటం తప్పుకాదు. చేరక తప్పలేదన్నది నా పాయింట్.

కట్ చేస్తే -

అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు. 

ఆధ్యాత్మికం వైపు ఆకర్షించబడటానికి వయసుతో కూడా పన్లేదు. 

దైనందిన జీవితంలోని పనులు చేసుకొంటూనే, జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆధ్యాత్మికానందాన్నీ అనుభవించవచ్చు.  

- మనోహర్ చిమ్మని 

Thursday, 11 July 2024

"Skip Ad" అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు!


ప్రొఫెషనల్‌గా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు... మన జీవితంలోకి వచ్చే చాలామంది యూట్యూబ్ వీడియోలో యాడ్స్ లాంటివాళ్ళు. 

ఏం ఆలోచించకుండా అలా "స్కిప్ యాడ్" కొట్టేసెయ్యాలి... కొట్టేస్తాం కూడా. 

ప్రతి యాడ్ చూసుకుంటూ కూర్చుంటే మనం చూడాలనుకున్న వీడియో చూడలేం. అప్పటికే మన టైమ్ అయిపోతుంది... అసలు వీడియోకే స్కిప్ కొట్టాల్సి వస్తుంది. 

కట్ చేస్తే - 

చాలా చాలా అరుదుగా - అనుకోకుండా - మనకు అసలు సంబంధం లేని, మనమెప్పుడూ ఊహించని ఏదో ఒక యాడ్ చూస్తాం. ఆశ్చర్యంగా కనెక్టయిపోతాం. మనకు తెలీకుండానే కంటిన్యూ అయిపోతాం. 

అదే మ్యాజిక్. 

అలాంటి మ్యాజిక్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న ప్రతిమనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. కాని, అప్పుడే మొదలవుతుంది అసలు కథ...  

- మనోహర్ చిమ్మని 

Monday, 8 July 2024

జీవితం చాలా పెద్దది!


జీవితం చాలా చిన్నది... జీవితం ఒక్కటే... ఉన్న కొద్ది రోజులు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి... అనుకొంటూ ఆ ఆలోచనలతోనే మూడొంతుల జీవితం అయిపోతుంది. 

ఇంకా అప్పటికి కూడా మనకు బుధ్ధి రాదు. అనుకున్నట్టు బ్రతకలేం. 

ఒకరి కోసం ఒకటి మానేస్తాం. ఇంకొకరి కోసం ఇంకొకటి మానేస్తాం. ఇంకెవరి కోసమో మనకు అసలు ఇష్టం లేని పని చేస్తుంటాం. ఇంకెవరో ఏదో అనుకుంటారని అసలు చెయ్యాల్సిన పని చెయ్యం. 

జస్ట్ మనకున్న ఒకే ఒక్క జీవితంలో జరగరానిది ఇంత జరుగుతోంది.

జీవితం చిన్నదెలా అవుతుంది? 

జీవితం చాలా పెద్దది. సంఘర్షణలు, వైరుధ్యాలు అనేకం. 

జీవితం చిన్నది చిన్నది అనుకొంటూ, చిన్నదో పెద్దదో మన చేతిలో వున్న జీవితాన్ని చాలా వృధా చేసుకొంటున్నాం.    

కట్ చేస్తే - 

నీ గురించి ఆలోచించకు. నీ కోసం ఆలోచించు. 

ఇతరుల కోసం ఆలోచించకు. ఇతరుల గురించి ఆలోచించు.

Love yourself like your life depends on it.  

- మనోహర్ చిమ్మని 

Friday, 5 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 4


సినిమాలు, సినిమా వార్తలు, సినిమా గాసిప్స్, సినిమా హీరోహీరోయిన్ల ఫోటోలు, సినిమావాళ్ళ వీడియో క్లిప్స్, సినిమావాళ్ళ ఇంటర్వ్యూలు... మొత్తంగా అసలు సినిమా కంటెంట్ లేకుండా బ్రతకలేనివి కొన్నున్నాయి:

టీవీచానెల్స్, ఓటీటీలు, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్, ఎట్సెట్రా. 

ఇలాంటి చాలావాటికి సినిమా కంటెంటే ఆక్సిజన్. 

సినిమా కంటెంట్ ఉంటేనే రీడర్‌షిప్/వ్యూయర్‌షిప్ పెరుగుతుంది, వ్యూస్ వస్తాయి, రేటింగ్ వస్తుంది. 

అవి బాగా వస్తేనే వాళ్ళకు డబ్బులొస్తాయి. 

ఇప్పుడీ సూడో-మేధావులు కూడా ఈ కోవలోకే వస్తున్నారు... 

వాళ్ళ రచనా వైదుష్యం, వాళ్ళ పాండిత్య ప్రతిభ, వాళ్లకుందీ అనుకుంటున్న అంతర్జాతీయ సినిమా పరిజ్ఞానం... ఇదంతా గుప్పించుకొని మురిసిపోడానికి ఇదొక దారి. 

సినిమా ప్లాట్‌ఫామ్ లేకుండా వీళ్ళూ బ్రతకలేరు. 

ఎడాపెడా కైమా కొట్టినట్టు రివ్యూలు రాయడం! సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం!!

కాకపోతే, ఈ సూడో-మేధావులకి డబ్బులు రావు. ఉట్టి తుత్తి మిగుల్తుంది. 

తర్వాత ఇవే ఆర్టికిల్స్‌ను పుస్తకాలుగా వేసుకోవచ్చు. ఆవిష్కరణలు చేసుకోవచ్చు. పొగడ్తలు పొందొచ్చు. 

సినిమాల మీద కొన్ని అంతర్లోక విశ్లేషణలు వీరివి ఏ స్థాయిలో ఉంటాయంటే - ఆ సినిమా తీసిన డైరెక్టర్‌కే "వార్నీ... నేనింత ఆలోచించానా?!" అని పిచ్చెక్కిపోయేంతగా.   

అంతా కలిపి ఈ జనాభా ఒక 200-300 మంది ఉంటారనుకుందాం. వీరి వల్ల సినిమాల టికెట్స్ తెగవు. కోట్లు రావు. 

అసలు సినిమా బిజినెస్‌కు వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ కానే కారు. 

వీళ్లనిలా బ్రతకనిస్తే పోలా... అని ఫిలిం మేకర్స్ అసలు పట్టించుకోడం మానేశారు. 

కట్ చేస్తే -

వీళ్ళు "చాలా బాగుంది" అని మెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్స్ ఉండవు. 

వీళ్ళు "చెత్త సినిమా" అని తేల్చేసిన సినిమాలకు కోట్లు కురుస్తాయి. 

ఇలాంటి ఒక మంచి క్లూ ఇస్తూ, ఫిలిం మేకర్స్‌కు వీళ్ళు మేలే చేస్తున్నారనుకుంటే పోలా?        

కట్ చేస్తే -

ఈ సూడో-మేధావుల రివ్యూల్ని, పోస్టుల్ని, కామెంట్లను అసలు పట్టించుకోకూడదు. అసలు అలాంటి నెగెటివ్ వాసన వచ్చిన పోస్టులోకి వెళ్ళకపోవటం బెటర్.

ఇలాంటి శాడిస్టు పోస్టులో, కామెంట్లో మరీ మనకు ఇబ్బందికరంగా అడ్డొస్తున్నాయనిపిస్తే "అన్-ఫాలో", "బ్లాక్" ఉండనే ఉన్నాయి. 

మన సొంత పోస్టుల కింద వచ్చే చెత్త కామెంట్స్ విషయంలో కూడా అంతే. అసలు చూడకూడదు, పట్టించుకోకూడదు. ఏదైనా నాన్సెన్స్ కంటికి కనిపించిందా... జస్ట్ అన్-ఫాలో, బ్లాక్!  

సూపర్ స్టార్ రజినీ కాంత్ చెప్పినట్టు - దారిలో మొరుగుతున్న కుక్కల్ని పట్టించుకోకుండా - మన పనిలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. 

ఓం తత్సత్.  

- మనోహర్ చిమ్మని 

Thursday, 4 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 3


ఏ సినిమాలోనైనా కాస్టింగ్ అనేది డైరెక్టర్ ఇష్టం. 

కల్కి2898ఏడీ సినిమాలో కూడా అంతే...  

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, రాజమౌళి, అనుదీప్ వంటివారిని ఎలా ఎంచుకున్నాడో, విజయ్ దేవరకొండను కూడా అలాగే ఎంచుకున్నాడు నాగ్ అశ్విన్. 

ఒకవేళ అర్జునుడి పాత్రలో విజయ్ నటన బాగా లేదనుకుంటే, అతనొక్కడి కోసం డైరెక్టర్ తన 600 కోట్ల ప్రాజెక్టుని పాడుచేసుకోడు. కాంప్రమైజ్ అవడు. ఒకవేళ అతను కాంప్రమైజ్ అయినా, అశ్వినీదత్ లాంటి అగ్రశ్రేణి నిర్మాత కాంప్రమైజ్ అవ్వరు. 

ఇది సింపుల్ లాజిక్. 

ఇదంతా పక్కన పెట్టి, కొంతమంది విజయ్ దేవరకొండను ట్రోల్ చెయ్యడమనేది సోషల్ మీడియాలో నానా రచ్చకు దారి తీసింది. అదింకా కొనసాగుతోంది.

ఇందులో విజయ్ దేవరకొండ తప్పేమైనా ఉందా? ఇందుకిలాంటి సంస్కార రహితమైన దాడి?

ఇక, ఈ ట్రోలింగ్‌లో వాడిన భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.   

సహజంగానే విజయ్ అభిమానుల ఎదురుదాడి కూడా అదే స్థాయిలో తీవ్రమైంది. ఇంకా కొనసాగుతోంది. 

ఫ్యాన్స్ వేరు, ఆ కేటగిరీ వేరు. వాళ్ళూ వాళ్ళూ తిట్టుకుంటారు, తిట్టించుకుంటారు. అది మామూలే.  

ఈ సూడో-మేధావులకేమైంది? 

మీకు ఆ హీరో నటన నచ్చకపోవచ్చు. తప్పులేదు. కాని, దానికి ఇంత దారుణమైన కామెంట్స్, ఎగతాళి అవసరమా? 

ఒక హీరోపైన ఎందుకింత వ్యక్తిగత కక్ష?    

కట్ చేస్తే -  

సినీ ఫీల్డులో అయినా, రాజకీయాల్లో అయినా, ఇంకే ఫీల్డులో అయినా, ఎవరి ఎజెండాలు వారికుంటాయి. లోపలి విషయాలు వేరు, బయటికి కనిపించే విషయాలు వేరు.

అసలైనవాళ్లంతా బాగానే ఉంటారు. ఎటొచ్చీ మధ్యలో ఇలా కొట్లాటలు పెట్టుకొని ఫూల్ అయ్యేవాళ్ళు, కరివేపాకులా తీసివేయబడేవాళ్ళు ఎవరంటే - ఇదిగో, ఇలా వారి కోసం గొడవలు పెట్టుకొని అనవసరంగా శత్రువులుగా మారే ఈ మధ్యలోనివాళ్ళే.  

సినిమారంగంలో ఉన్నవాళ్లకంటే ఇవన్నీ తప్పవు. కోట్లు పెడుతుంటారు, సంపాదిస్తుంటారు, పోగొట్టుకుంటుంటారు. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా నానా సిచువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అది వారి ప్రొఫెషన్. అది వారి జీవితం.  

మిగిలినవాళ్లేవరికైనా సినిమా అనేది జస్ట్ ఒక ఎంటర్‌టైన్మెంట్ మీడియా. చూడాలి, వదిలెయ్యాలి. అంతే. మిగిలిందంతా జస్ట్ బుల్ షిట్.     

- మనోహర్ చిమ్మని   

Wednesday, 3 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 2


KALKI2898AD... 

ఈ సినిమా చూసిన ఒక మేధావి "సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్" ఎలా ఉందంటే -

అతనికి సరిగ్గా ముందు సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు సినిమాలో లీనమైపోయి, ఎక్జయిట్‌మెంట్‌తో సీట్ ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాడట. అందువల్ల ఈయనకు స్క్రీన్ పూర్తిగా కనిపించట్లేదట. 

ఇక అతనికి సరిగ్గా వెనక సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు ఆల్రెడీ ఒకసారి KALKI2898AD సినిమా చూసినందువల్ల, స్క్రీన్ మీద వచ్చే ప్రతి డైలాగ్‌ను ముందే చెప్తున్నాడట. 

ఇదంతా ఆ సోకాల్డ్ సూడో-మేధావి తన పోస్టులో రాసిందే! నా సొంత కవిత్వం కాదు. 

సినిమా నచ్చకపోతే - ముందు కూర్చున్నవాడు అంత ఎక్జయిట్‌మెంట్‌తో సీటు ముందుకి జరిగి కూర్చొని చూడడు. వెనక కూర్చున్నవాడు రెండోసారి సినిమాకి రాడు. 

దట్ సింపుల్. 

హౌజ్ ఫుల్ అయినా ఆ సినిమా హాల్లో ఈయనొక్కడికి సినిమా నచ్చలేదు. ఈయన లాంటి ఇంకో ఇరవై-ముప్పై మందికి కూడా నచ్చకపోవచ్చు. తప్పేం లేదు.

ఏ సినిమా అయినా అందరికి నచ్చాలని రూలేం లేదు.  

కానీ, నీ ఒక్కడికి నచ్చనంత మాత్రాన నీ మేధావిత్వమంతా గుప్పిస్తూ - నీకు సినిమా నాలెడ్జి చాలా వుందని చెప్పుకొంటూ - ఇది రివ్యూ కాదంటూనే - అంత పెద్ద శాడిస్టిక్ రివ్యూ రాయాలా? 

నీ టేస్టు, ప్రపంచం టేస్టు ఒక్కటే అవ్వాలని రూలేమన్నా ఉందా?

ప్రపంచమంతా లక్షలాదిమంది ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేస్తూ, వందల కోట్ల వర్షం కురిపిస్తుంటే - వాళ్లంతా అభిరుచిహీనులైన తప్పుడు ప్రేక్షకులైనట్టు, నువ్వొక్కడివే స్టాండర్డ్ ప్రేక్షకుడివైనట్టు ఇలాంటి శాడిస్టిక్ రాతలు రాసి నువ్వేం సాధించాలనుకున్నట్టు?  

కట్ చేస్తే - 

సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గురించి, ఆర్ట్ ఫామ్ గురించి రివ్యూల రూపంలో ఇంతింతేసి థీసిస్‌లు రాస్తున్న ఇలాంటివాళ్ళల్లో ఏ ఒక్కరయినా, పూనుకొని, ఒక అద్భుత కలాఖండం ఎందుకు తీయలేకపోతున్నారు అన్నది నా హంబుల్ డౌట్!    

After all, cinema is a business. A big business. We make movies that make money. Everything else is just bullshit.

- మనోహర్ చిమ్మని 

మా సాదిక్ అంటే నాకెందుకంత ఇష్టం?


ఉస్మానియా యూనివర్సిటీలో నా సీనియర్, హాస్టల్ మేట్, మిత్రుడు, దాదాపు మూడున్నర దశాబ్దాల మా స్నేహంలో ఇంకా నన్ను ప్రేమగా "మనూ" అని పిలిచే అతి కొద్దిమంది ఆత్మీయ మిత్రుల్లో ఒకరు... మా సాదిక్ భాయ్.  

ఓయూలోని "ఏ" హాస్టల్లో ఆయన రూం నంబర్ 35 అయితే, నాది 55. 

ఓయూలో ఉన్నప్పుడే మా జూనియర్స్, సీనియర్స్ కలిసి ఒకసారి ఒరిస్సా టూర్‌కు వెళ్ళాం. అదిగో, అక్కడ మొదటిసారి మేమిద్దరం కలిసి ఓ పక్కగా వెళ్ళి, సిగరెట్ వెలిగించి, అదీ ఇదీ మాట్లాడ్డం మొదలెట్టాం. భువనేశ్వర్‌లోని పాంథ నివాస్ హోటల్ ఆవరణలో ఆ సాయంత్రం, అలా తిరుగుతూ, అప్పుడు మేం ప్రారంభించిన ఆ కబుర్లు, ఆ ముచ్చట్లు... ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నిన్న రాత్రి కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం.    

కట్ చేస్తే -   

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అది అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

ఆమధ్య ఓ తొమ్మిదేళ్ళక్రితం అనుకుంటాను... నాకో విషయంలో (డబ్బు కాదు) మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, నా ఇంకో పది క్రియేటివ్ వ్యాపకాల బిజీలో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాను. దాదాపు మర్చిపోయాను.     

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు సాదిక్! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేటంతగా!!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదు.

నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు.  

కట్ చేస్తే -   

మా సాదిక్ గురించి ఇప్పుడు రాస్తున్నదంతా ఒక ఫ్లోలో, ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. భరించాలి. 

భరించాలి అని ఎందుకంటున్నానంటే - సాదిక్ జీవితం, సాదిక్ జీవనశైలి చాలా కోణాల్లో చాలామందికి ఇన్‌స్పిరేషన్. 

"బతికితే సాదిక్‌లా బతకాలి" అనిపించేంత ఇన్‌స్పిరేషన్!

సాదిక్ ఎలా బ్రతకాలనుకుంటాడో అలా బ్రతుకుతాడు. ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. అది నాకిష్టం. 

అందరికీ సాధ్యం కాదు, సాధ్యం చేసుకోలేరు.

కొన్నేళ్ళ క్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి గురించి, సమయం విలువ గురించీ - సాదిక్ నాతో ఒక మాట చెప్పాడు.  

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సమయం, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి, ఎన్నెన్నో సాధించి చూపించాడు! 

దటీజ్ సాదిక్.   


కట్ చేస్తే -   

అసలు "తోపుడు బండి" ఏంటి? అందులో పుస్తకాలు పెట్టుకొని, దాన్ని ఆయనే తోస్తూ పుస్తకాలు అమ్మడమేంటి? అదే తోపుడు బండిని తోస్తూ, సాదిక్ 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యడమేంటి?  

అప్పట్లో హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో సాదిక్ "తోపుడు బండి స్టాల్" అంటే సెన్సేషన్. ఏ వీఐపీ అయినా సరే, బుక్ ఫెయిర్‌కొస్తే తోపుడు బండి స్టాల్ విజిట్ చెయ్యాల్సిందే! ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆఖరికి అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా సాదిక్ స్టాల్ సందర్శించారు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.   

హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఫోటోలు, సెల్ఫీల కల్చర్‌ను పరిచయం చేసిన పయొనీర్ సాదిక్. బుక్ ఫెయిర్‌లో "తోపుడుబండి" స్టాల్ ఇప్పుడు లేకపోయినా - ఆయన పరిచయం చేసిన "ఫోటోల పండుగ" మాత్రం హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇంకా కొనసాగుతోంది. 

"తోపుడు బండి సాదిక్" గా పాపులర్ అయిన మా సాదిక్ సోషల్ సర్విస్ ప్రయోగాలు అక్కడితో ఆగలేదు... 

ఎక్కడో అడవిలో ఒక సినిమా సెట్‌లా పెద్ద కుటీరం వేసాడు. అక్కడి ఆదివాసి పిల్లలు, ప్రజలకు కావల్సిన ఆహారం, బట్టలు, పుస్తకాలు, చలికాలం స్వెట్టర్లు వంటివి ఇవ్వటం కొన్నాళ్లపాటు ఒక ఉద్యమంలా చేసాడు.   

కోవిడ్ లాక్‌డౌన్ టైమ్‌లో కూడా - ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... ఇలా చాలానే చేశాడు సాదిక్. 

ఇప్పుడు తన పుట్టిన ఊరు కల్లూరులో (ఖమ్మం జిల్లా) - తన సోషల్ సర్విస్ యాక్టివిటీ కోసమే ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టుకొని, ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని స్కూల్స్‌కు, స్టుడెంట్స్‌కు ఎన్నో విషయాల్లో సహాయం అందిస్తున్నాడు. 

ఒకసారి నేను కల్లూరు వెళ్ళినప్పుడు - సాదిక్ సోషల్ యాక్టివిటీ గోడవున్‌లో - పిల్లలకిచ్చే వందలాది కొత్త సైకిళ్ళు, గుట్టలకొద్దీ కొత్త పుస్తకాల కట్టలు, పుస్తకాల బ్యాగులు, స్వెట్టర్లు, చెద్దర్లు వంటివి చూసినప్పుడు కలిగిన అనుభూతి... నిజంగా అదొక గూస్‌బంప్స్ మూమెంట్.     

సాదిక్ అందిస్తున్న సహాయంతో చాలా స్కూళ్ళల్లో పిల్లలు రికార్డ్ స్థాయిలో మంచి రిజల్ట్స్ సాధించి, వారు చదువుతున్న ఆయా స్కూల్స్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెడుతున్నారు.

ఎంతో మంది బాగా చదివే పిల్లలు ఉన్నత చదువుల కోసం డబ్బులేక చదువు ఆపే పరిస్థితుల్లో, వారందరికి ఫీజులు, ఇతర ఏర్పాట్లు చేస్తూ పై చదువులకు పంపిస్తున్నాడు.

స్పోర్ట్స్, గేమ్స్‌లో ఆసక్తి ఉన్న ఎంతో మంది గ్రామీణ స్కూల్స్‌లోని పిల్లలకు అవసరమైన సహాయం చేసి, ఎన్నోసార్లు వాళ్లచేత టోర్నమెంట్స్ గెలిపించాడు, కప్పులు తెప్పించాడు.  

సాదిక్ తలపెట్టిన ఎన్నో సాంఘిక సేవా యజ్ఞాల్లో ఇదంతా ఒక నాన్-స్టాప్ యజ్ఞం.    


అయితే - నిజానికి ప్రభుత్వాలు చెయ్యవల్సిన ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలన్నీ సాదిక్ ఏదో పేరు కోసమో అవార్డుల కోసమో చెయ్యటం లేదు. 

ఇదంతా - తన వ్యక్తిగత ఆసక్తి. తన ఇష్టం. తన తపన.

అంతే.  

కట్ చేస్తే -   

ఇక్కడొక మాట ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది... సాదిక్‌ను ఇష్టపడి, ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఉష లేకపోతే సాదిక్ జీవితంలో బహుశా ఇవన్నీ అంత సులభంగా సాధ్యమయ్యేవి కావని నాకనిపిస్తుంటుంది. బహుశా అందుకేనేమో, సందర్భం వచ్చినపుడల్లా ఎలాంటి భేషజాల్లేకుండా తన జీవన సహచరి ఉష గురించి, తన జీవితంలో, తన విజయాల్లో ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్తుంటాడు సాదిక్.    

పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా ఆయనకున్న హేమాహేమీల పరిచయాలు, జ్ఞాపకాలు అనేకం. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎదుగుదల, ఆయన సంపాదన కూడా అసలెవ్వరూ ఊహించని స్థాయిది. 

సాదిక్‌కు జ్యోతిష్యం తెలుసు. హిమాలయాలకు వెళ్తాడు. చాలామంది బిజినెస్ పీపుల్, వివిధ రంగాల్లోని మిత్రులు, ప్రముఖులు ఆయన సలహాల కోసం వ్యక్తిగతంగా సంప్రదిస్తుంటారు. ఇది చాలామందికి తెలియని ఆయనలోని ఇంకో రహస్య కోణం.   

అదంతా రాయాలంటే బ్లాగ్ సరిపోదు. ఒక బయోగ్రఫీ అవుతుంది.     

అప్పుడు ఎంత సంపాదించాడో ఇప్పుడంత సాంఘిక సేవచేస్తూ ఖర్చుపెడుతున్నాడు సాదిక్. తన స్థోమతను మించి అవసరమయినప్పుడు, సింపుల్‌గా ఫేస్‌బుక్‌లో ఒక సింగిల్ లైన్ పోస్టు పెట్టడం ద్వారా, సోషల్ సర్విస్ పట్ల ఆసక్తి ఉన్నవారి నుంచి అప్పటి అవసరానికి తగినంత సపోర్ట్ కూడా అందుకుంటున్నాడు.    

అసలు సోషల్ మీడియాను - పాజిటివ్ కోణంలో - సోషల్ సర్విస్ కోసం కూడా ఎంత బాగా వాడొచ్చో సాదిక్ నుంచి నేర్చుకోవచ్చు. 


బై ది వే - మా సాదిక్ భాయ్‌కి అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఓనమాలు నేర్పించింది నేనే అని అప్పుడప్పుడూ నాకు సరదాగా గుర్తు చేస్తుంటాడు సాదిక్.  

సాదిక్ తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. తను చేస్తున్న పనిలోనే జీవితాన్ని అనుక్షణం అనుభవిస్తాడు.  

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం.  

ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా, నా ఆత్మీయ మిత్రుడు సాదిక్‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 

లవ్ యూ అన్నా, త్వరలోనే కలుద్దాం.        

- మనూ 

Tuesday, 2 July 2024

పిచ్చాసుపత్రి మేధావులెలా ఉంటారంటే - 1


ఇందాకే మా అసిస్టెంట్ డైరెక్టర్ పంపించిన ఒక ఫేస్‌బుక్ లింకుని ఓపెన్ చేసి చదివాను... అది డైరెక్టర్ నాగ్ అశ్విన్ KALKI2898AD సినిమా మీద ఆయన కక్కిన విషం. 

ఇలాంటివాళ్ళు ఇంకా ఉన్నారని అప్పుడప్పుడు ఈ తరహా మేథో-రివ్యూలు చదివినప్పుడు తెలుస్తుంటుంది.

ఆమధ్య సందీప్ రెడ్డి వంగా ANIMAL సినిమా మీద కూడా కొందరు సూడో-మేధావులు ఇలాంటి విషమే చిమ్మారు. అది పాత కథ. 

కట్ చేస్తే -      

వందల కోట్లు పెట్టి తీసి, వేల కోట్లు కొట్టేసే "స్కీమ్" అట కల్కి! 

ఎంత నాన్సెన్స్? అసలే కాలంలో ఉన్నారు వీళ్ళు? 

సినిమా అనేది పూర్తిగా ఒక ఎంటర్‌టైన్మెంట్ మీడియా, ఒక బిగ్ బిజినెస్ అన్న కామన్ సెన్స్ వీళ్ళకు ఎప్పుడొస్తుంది? 

స్టార్ వార్స్, స్పయిడర్ మ్యాన్, టర్మినేటర్, గ్లేడియేటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి సినిమాలన్నీ ఏ లాజిక్‌కు నిలబడతాయి? 

ఇలాంటి సూడో-మేధావుల లెక్కల్లో సినిమా తీయాలంటే ఇంక హాలీవుడ్ దుకాణం మూసుకోవాల్సిందేగా?

ఈయన చాలా బాగున్నవి అని పొగిడిన పాతాళభైరవి, మాయాబజార్, కేజీయఫ్, బాహుబలి సినిమాలు కూడా, ఈయనే ఈకలు-తోకలు పీకి చెప్తున్న చెత్త లాజిక్స్‌కి నిజంగా నిలబడతాయా?   

పాయింట్ బై పాయింట్, కల్కి2898ఏడీ సినిమాను తనివితీరా చీల్చి చెండాడుతూ, తన అంతరాంతరాల్లో ఉన్న ఏదో తీరని కోరికను ఒక భారీ శాడిస్టిక్ పోస్టుపెట్టడం ద్వారా తీర్చుకొన్న ఈయన, ఆ పోస్టు చివర్లో, "చివరి మాట" అని ఇంకో పనికిమాలిన కొత్త పాయింట్ తీశాడు.

దాని సారాంశం ఏంటంటే... ఈయన ఆనందం కోసం, తెలంగాణ డైరెక్టర్స్ కేవలం మల్లేశం, బలగం, పెల్లిచూపులు, విరాటపర్వం లాంటి చిన్న చిన్న సినిమాలే తీయాలి!

అంటే, "మీరు చిన్న సినిమాలే తీయాలి, బీద సినిమాలే తీయాలి, మాకు నచ్చే లెఫ్టిజమ్ ఓరియెంటెడ్ సినిమాలే తీయాలి" అని ఇన్‌డైరెక్టుగా "ఇదీ మీ పరిధి" అని తెలంగాణ డైరెక్టర్స్‌కు చెప్పడమేగా?    

ఎంత కుళ్ళు? ఎంత పైశాచిక శాడిజానందం?   

అసలు క్రియేటివిటీకి ఇలాంటి ప్రాంతీయ హద్దులుంటాయా?

ఈయన చెత్త లాజిక్స్‌కు అందని మన భారతీయ సినిమాలెన్నో అమెరికా, ఇంగ్లండ్, జపాన్, చైనా వంటి దేశాల్లో సైతం ఇప్పుడు కోట్లు కొల్లగొట్టడం లేదా?    

ఇంకెప్పుడు మారతారు వీళ్ళు?   

- మనోహర్ చిమ్మని