సినిమాలో "హాఫ్‌వే ఓపెనింగ్"లా ఇలా నేరుగా పాయింట్‌లోకే వెళ్లి ఈ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణం చాలా బాధాకరమైంది. సిగ్గుతో తల దించుకోవాల్సింది.
మొన్న సెప్టెంబర్ 2 నాడు హైద్రాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో ఒక హీరోయిన్ వ్యభిచారం చేస్తూ "రెడ్ హాండెడ్"గా పోలీసులకు పట్టుబడిన బ్రేకింగ్ న్యూస్‌లు మనం చూశాం.. చదివాం.. విన్నాం.
నిన్న రాత్రి ఒక వర్ధమాన దర్శకురాలి నుంచి నాకో ఆన్‌లైన్ పిటిషన్ లింక్ ఫేస్‌బుక్ మెసేజ్ ద్వారా అందింది. ipetitions లోని ఆ పిటిషన్ పూర్తిగా చదివాను. సంఘీభావంగా నేనూ ఆన్‌లైన్ సిగ్నేచర్ చేశాను.
ఎంత నికృష్టమైన వ్యవస్థలో మనం ఉన్నామో ఆ పిటిషన్ చదివాక తలెత్తే ఈ ప్రశ్నలు చూస్తే మీకే అర్థమవుతుంది:
> వ్యభిచారం చేస్తూ "రెడ్ హాండెడ్"గా హీరోయిన్ పోలీసులకి దొరికిపోయిందన్నారు. అంటే అక్కడ ఆమెతోపాటు గడిపిన ఆ మగ "సెక్స్ క్లయింట్" కూడా ఉన్నట్టేగా? అలాంటప్పుడు అతని పేరు ఎందుకని బయట పెట్టలేదు? కేవలం ఆ హీరోయిన్ పేరునే ఎందుకు బయటపెట్టి పదే పదే "బ్రేకింగ్ న్యూస్"లతో ఊదరగొట్టారు?
> దీన్నే ఇలా కూడా అడగొచ్చు:
పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నపుడు ఈ సెక్స్ రాకెట్ నడిపిన బ్రోకర్ కూడా దొరికాడు. హీరోయినూ దొరికింది. కానీ, ఆ హీరోయిన్‌తో పాటు ఉన్న ఆ మగ సెక్స్ క్లయింట్ ఎందుకు దొరకలేదు? దొరికితే అతనెవరు? దొరక్కపోతే అది "రెడ్ హాండెడ్" ఎలా అవుతుంది?
> రేప్‌లు, ఇలాంటి విషయాల్లో స్త్రీలు/అమ్మాయిల పేర్లు బయటపెట్టకూడదన్న సెన్సిటివిటీని అటు పోలీసులు గానీ, ఇటు ప్రెస్ మీడియాగానీ ఎందుకు పాటించలేదు? ఇది యాంటీ వుమెన్ ధోరణి కాదా?
> "ఒక స్టార్ హోటల్లో" రెడ్ హాండెడ్‌గా ఈ గొప్ప రాకెట్‌ని కనుగొన్న మన పోలీసులు ఆ స్టార్ హోటల్ పేరెందుకు దాయటం? కారణం ఏంటి?
> ఆ హీరోయిన్ను ఏ చట్టాలకిందనయితే బుక్ చేసి అరెస్ట్ చేశారో, అదే నేరంలో భాగస్తుడయిన ఆ మగ సెక్స్ క్లయింట్‌ను కూడా అదే చట్టాల ప్రకారం బుక్ చేసి అరెస్ట్ చేయాలి కదా? అలా ఎందుకని చేయలేదు? కనీసం అతని పేరయినా బయటికి రాలేదెందుకు?
> స్టార్ హోటల్స్‌లో, ఇంకా ఎన్నో గెస్ట్ హౌజ్‌ల్లో, ఫామ్ హౌజ్‌ల్లో, ఇంకా ఎక్కడెక్కడో ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక్క సినిమావాళ్లు మాత్రమే "బ్రేకింగ్ న్యూస్"లకు పనికొస్తారు! ఎందుకంటే "సినిమా" పదానికున్న గ్లామర్. ఆ గ్లామరస్ న్యూస్ ద్వారా వచ్చే సెన్సేషన్. టి ఆర్ పి రేటింగులు. ఇది నిజం కాదా?
> కేవలం ఆ హీరోయిన్ పేరుతోనే టి ఆర్ పి రేటింగులు పెంచుకొనే ప్రయత్నంలో పోటీపడటం తప్ప - ఆ మగ క్లయింట్ ఎవరో కూడా కనుక్కొని బయటపెట్టాల్సిన బాధ్యత ప్రెస్ మీడియాకు లేదా?
> నిజంగా ఆ క్లయింట్ అంత పెద్ద మనిషే అయితే.. అతని పేరు బయటపెట్టడానికి ఏవయినా "ప్రెషర్స్" ఉన్నట్టయితే.. అతనితోపాటు ఆ హీరోయిన్‌ను కూడా హెచ్చరించి వదిలివేయాల్సింది! ఎందుకు తను ఒక్కదాన్నే అరెస్ట్ చేసి, ప్రెస్‌లో స్టేట్‌మెంట్లు ఇప్పించి.. ఏదో అమెరికా కనుక్కున్నట్టు గొప్పలు చెప్పుకోవడం?
> పైదంతా ఒక కోణం. కాగా, అంతకు ముందు తనకు "ఒప్పుకోలేదు" అన్న పగతోనో, ఈగోతోనో ఆ హీరోయిన్‌ను కావాలనే ఇలా ఇరికించారన్నది ఈ మొత్తం బ్రేకింగ్ న్యూస్ లోని ఇంకో యాంగిల్! ఇదే నిజం కావొచ్చని చాలామంది అనుకొంటున్నారు. నమ్ముతున్నారు. ఒకవేళ నిజం కానట్టయితే - ఆ మగ సెక్స్ క్లయింట్ ఇప్పటికే అరెస్టయి ఉండాలి. అతను, అతని పేరు, హోదా కూడా ఆ హీరోయిన్ పేరుతో సమానంగా బ్రేకింగ్ న్యూస్‌లో వచ్చి తీరాలి. అలా ఎందుకని జరగలేదు? జరగలేదంటే ఈ అనుమానమే నిజం కావొచ్చుగా? ..
ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా వందలాదిమంది కళాకారులు, రచయితలు, సినీ ఇండస్ట్రీ, విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్, ఎన్ జీ వో లు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరిస్తారు?
ఆ హీరోయిన్‌ను రెడ్ హాండెడ్‌గా పట్టుకొని సెక్స్ రాకెట్‌ను "ఛేదించిన" పోలీసులా? అంతా "కవర్" చేసేసి ఒక్క హీరోయిన్‌ను మాత్రమే బలిపశువును చేసిన మీడియానా?
మిలియన్ డాలర్ కొశ్చన్..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani