సమైక్య రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉంది. అసలు దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇందిరా గాంధి స్వయంగా మెదక్ నుంచి పోటీ చేశారు.
అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు "ఒక్క ఛాన్స్" ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఒకప్పటిలా అమాయకులు కారు.
ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడటానికి ఇదేం సినిమా కాదు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. తెలంగాణ ప్రజల జీవితం.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్తున్న ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్క గ్యారంటీ అమలు చేయడానికి అవసరమైన కనీస అవగాహన, గణాంకాలు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికైనా తెలుసా అన్నది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్.
కనీసం ఒక్క గ్యారంటీ గురించి అయినా కేసీఆర్, కేటీఆర్‌లా తడుముకోకుండా సంపూర్ణ అవగాహనతో చకచకా అవసరమైన గణాంకాలను ఆశువుగా అందిస్తూ చెప్పగల ఆత్మవిశ్వాసం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఏ ఒక్కరికైనా ఉందా అన్నది కూడా ఒక జవాబు దొరకని ప్రశ్నే.
అసలా ఆరు గ్యారంటీల ఆలోచన కాంగ్రెస్‌కు రావడానికి కారణం కేసీఆర్ కాదా?
ఆయన ఆలోచనల్లోంచి పుట్టి, రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు కాదా?
ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆరే గెలుస్తే ఇంక మాకు పుట్టగతులుండవు అన్న భయం కాదా?
ఎప్పుడైనా దున్నపోతు దున్నపోతే, ఆవు ఆవే అన్న నిజం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.
పోనీ, గతాన్ని పక్కన పెడదాం...
ప్రస్తుతం దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గ్యారంటీలను ఇప్పటివరకు ఎక్కడయినా వీళ్ళు ఎందుకు అమలు చేయడం లేదు?
జవాబుందా?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత జిల్లాలోనే నీళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆయన వచ్చి ఇక్కడ ఏ అర్హతతో ప్రచారం చేస్తారు?
"రైతులకు 24 గంటలు కరెంటు ఎందుకు, 3 గంటలు సరిపోదా" అని రైతు విలువ తెలియని అహంకారంతో మాట్లాడిన మనిషే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి "మేం కూడా రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తాం" అంటున్నాడు.
"బస్ రెడీగా ఉంది, మా పార్టీ పాలిస్తున్న కర్ణాటకలో చూపిస్తా పద" అని రేవంత్ రెడ్డి అన్న కొన్ని గంటల్లోనే కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీయం డి కె శివకుమార్ "మేం రైతులకు కరెంట్ 5 గంటలే ఇస్తున్నాం" అని ఆ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే నిజం చెప్పి, వాళ్ల పార్టీ ఇజ్జత్ తీసిన విషయం నిజం కాదా?
కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని అక్కడి రైతులే స్వయంగా తెలంగాణ సరిహద్దుల్లోని నారాయణ ఖేడ్, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తూ ర్యాలీలు తీయడం అనేది బహుశా ఇటీవలి రాజకీయాల్లో ఒక ప్రత్యేక సంఘటన. ఒక చారిత్రక విశేషం. కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారా అక్కడి రైతులు ఎంత నష్టపోయుంటారు?
వారికి ఎంత కడుపు మండివుంటే పక్కరాష్ట్రంలోకి వెళ్ళి మరీ అక్కడి ప్రజలు తొందరపాటులో తప్పుచేయకుండా ఉండటం కోసం ఇలాంటి ర్యాలీలు తీయాలనుకుంటారు?
కేసీఆర్ నేతృత్వంలో భారాసా ఎప్పుడో మొత్తం అభ్యర్థులను ప్రకటించింది. సుడిగాలి పర్యటనలతో కేసీఆర్ దాదాపు ప్రతిరోజూ వివిధ నియోజకవర్గాల బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో భారాసా అభ్యర్థులు ఇప్పటికే రెండు రౌండ్ల ప్రచారం పూర్తిచేశారు.
మరోవైపు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థుల రెండో లిస్టు వరకు మాత్రమే ప్రకటించింది. అసంతృప్తుల కోపానికి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌తో పాటు, అభ్యర్థులను ప్రకటించిన అన్ని చోట్లా పార్టీ కార్యాలయాల్లో తిరుగుబాట్లు, విధ్వంసాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.
అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొంటూ రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌ను షాపింగ్ మాల్ చేశాడని ఆయన ఫ్లెక్సీలను చించేశారు. కార్యాలయాలను ధ్వంసం చేశారు. వాటికి తాళాల్ని కూడా వేశారు.
నిజంగా అర్హులైనవారికి పార్టీ టికెట్లు ఇవ్వలేదని, ఇదంతా ఢిల్లీలో ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్ ఆశీస్సులు లేకుండా రేవంత్ రెడ్డి ఒక్కడే చేయలేడని నిర్ధారించుకున్న కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీలో తమ ఉనికి గురించి పునరాలోచించుకుంటున్నారు.
ధనబలం ఉన్నవారికే కాంగ్రెస్ టికెట్స్ ఇస్తుండటంతో ప్రజాబలం ఉన్న నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇలాంటి నాయకులందరికీ బీఆరెస్ ఒక భరోసానిచ్చే పార్టీగా కళ్ళముందు కనిపిస్తోంది.
నాగం జనార్ధన్ రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి బయటపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలంతా రెండుమూడు గ్రూపులుగా విడిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు.
పైన ఆదిలాబాద్ నుంచి కింద ఖమ్మం దాకా, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆసంతృప్త జ్వాలలు ఇంకా ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి.
ఫలితంగా ఏం జరగబోతోందో ఇట్టే ఊహించవచ్చు.
ఇలాంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనుకోవడం ఒక పిచ్చి భ్రమ.
1969 లో తెలంగాణ మహోద్యమాన్ని అత్యంత పాశవికంగా అణచివేసి, ఎందరో విద్యార్థులు, యువకుల చావుకు కారణమైంది కాంగ్రెస్సే. 2009 లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ముందు ప్రకటించి, తర్వాత ఆంధ్ర లాబీల ఒత్తిడికి తలొగ్గి మళ్ళీ వెనక్కిపోయింది కాంగ్రెస్సే. దరిమిలా మరొక్కసారి వందలాది విద్యార్థుల ఆత్మాహుతి బలిదానాలకు కారణమైంది కూడా కాంగ్రెస్సే.
"కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చింది" అంటూ ఇప్పుడు మైకుల్లో మొత్తుకుంటున్న కాంగ్రెస్ వాళ్లందరికీ నిజమేంటో బాగా తెలుసు.
కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వలేదు, కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ఉద్యమ తీవ్రతకు తలొగ్గి మరొక దారిలేక ఇవాల్సి వచ్చింది.
కట్ చేస్తే -
గెలవలేక, గెలిచే అభ్యర్థులు లేక చివరికి బీఆరెస్ అభ్యర్థులపై భౌతిక దాడులకు కూడా పాల్పడే స్థాయికి దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోడానికి డిసెంబర్ 3 వరకు ఆగాల్సిన అవసరం లేదు.
ఏదో ఓ రెండు మూడు సీట్లు ఎక్కువగా గెలవడం వేరు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో భారీగా సీట్లు గెలవడం వేరు. ఈ రెండిటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఈ ఫరక్‌ని గుర్తించే స్థాయిలో కాంగ్రెస్‌వాళ్లు లేరు.
వాళ్ల ఆలోచనంతా ఒక్కటే...
ఎలాగైనా సరే కేసీఆర్‌ను దించాలి. సీయం అయి గద్దెనెక్కాలి.
ఎలక్షన్స్ వస్తే చాలు, డజన్ మంది సీయం క్యాండిడేట్స్ ఎప్పుడూ కొట్టుకొంటూ తిట్టుకొంటూ సొంత కుంపట్లతో సిద్ధంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో, వాళ్లకి వాళ్ళు వాపుని చూసి బలుపు అనుకుంటే ఎవరికీ నష్టం లేదు.
తెలంగాణ ప్రజలు అలా అనుకోరు. ఏది వాపో ఏది బలుపో వారికి బాగా తెలుసు.
ఒక తిరుగులేని ఉద్యమనాయకునిగా కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అంత సీన్ ఇప్పుడప్పుడే లేదు.
దేశంలో అంతకుముందున్న అన్ని రికార్డులను చెరిపేస్తూ, ఇంతకుముందు ఎవ్వరూ కనీసం ఆలోచించని అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆరెస్ ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.
కాంగ్రెస్, ఆ పార్టీ గ్యారంటీల గురించి కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే "నా అంత సిపాయి లేడని తుపాకి రాముడు చెప్పే కథలు" అవన్నీ.
కాంగ్రెస్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక ఒడిశిన కథ.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani