జూబ్లీ హిల్స్‌లో ఒక రిచ్ హౌజ్ లొకేషన్‌లో షూటింగ్. సరిగ్గా ఉదయం 8.50 నిమిషాలకు కారు గేట్ లోపలికి వచ్చింది.
అందులోంచి హీరో కృష్ణ దిగారు.
అదే మొదటిసారి సూపర్ స్టార్‌ని నేను చూడ్డం.
ఇంటిదగ్గరే మేకప్ పూర్తిచేసుకొని, ఆరోజు షూటింగ్‌లో ఫస్ట్ సీన్‌కు ఏ కాస్ట్యూమ్స్ అయితే అవసరమో వాటిని ముందురోజే ఇంటికి తెప్పించుకొని, వేసుకుని వచ్చారాయన.
సెట్‌లోకి ఎంటరవుతూనే "డైరెక్టర్ గారెక్కడ?" అని కనుక్కొని గురువుగారున్నవైపుకి నడిచి, ముందు వారిని విష్ చేశారు. రెండు నిమిషాలు జనరల్ టాక్. అంతే.
తర్వాత తన చెయిర్లో కూర్చుని సీన్ పేపర్స్ ఒకసారి చూశారు. సీన్ పేపర్స్ అసిస్టెంట్‌కు ఇచ్చి "ఏదీ నువ్వొకసారి డైలాగ్స్ చదువ్" అన్నాడు.
అసిస్టెంట్ చదివి వినిపించాడు.
"ఇంకోసారి చదువ్" అన్నారు కృష్ణ. అసిస్టెంట్ చదివాడు.
"ఇప్పుడు నేను చెప్తా చూడు" అని చకచకా డైలాగ్స్ చెప్పేసి, "ఓకేనా?" అన్నారు. అసిస్టెంట్ సమాధానం చెప్పేలోపే, "ఇది విను" అని కొంచెం ఇంప్రొవైజేషన్‌తో మళ్ళీ చెప్పారు. "ఇది బావుంది కదా?" అని అడిగారు. "బావుంది సర్" అన్నాడు అసిస్టెంట్.
"మనిద్దరికి బాగుంటే సరిపోదు. అక్కడ డైరెక్టర్ గారికి బావుండాలి. నేను రెడీ. షాట్ రెడీనా కనుక్కో" అన్నారాయన.
గురువుగారు రెండు టేకుల్లో షాట్ ఓకే చేశారు. అయినా సరే - "డైరెక్టర్ గారూ, ఓకేనా... ఇంకోటి చేద్దామా?" అని అడిగారు.
"టేక్ ఓకే. మీరు ఇంకోటి చేద్దామంటే చేద్దాం" అన్నారు గురువుగారు.
ఇంకో టేక్ చేశారు. అదికూడా ఓకే అయ్యింది. "రెండూ బాగున్నాయి. నేను ఎడిటింగ్‌లో చూసుకుంటాను" అన్నారు డైరెక్టర్ గారు.
ఇలా చకచకా ఒక సీన్ అయిపోయింది.
సరిగ్గా ఒంటి గంటకు లంచ్‌కు ఇంటికి బయల్దేరారు సూపర్ స్టార్.
మళ్ళీ ఫ్రెష్‌గా మేకప్‌తో గంటన్నర తర్వాత ఇంటినుంచి వచ్చారు. ఇంకో రెండు సీన్స్ పూర్తిచేసి సరిగ్గా అరు గంటలకు డైరెక్టర్ గారికి బాయ్ చెప్పి ఇంటికెళ్ళిపోయారు సూపర్ స్టార్.
ఇలా హీరో కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్‌కు సంబంధించిన షూటింగ్ అదే ఇంట్లో రెండు రోజుల్లో అయిపోయింది.
ఏ ఒక్కరోజు ఎవ్వరిమీద కోపం తెచ్చుకోలేదు ఎవ్వరిని బాధపెట్టలేదు.
ఎలాంటి అరుపులు, కేకలు, పెడబొబ్బల్లేవు. నేను సూపర్ స్టార్‌ను అన్న అహంకారం లేదు. కోస్టార్స్‌తో చాలా కూల్‌గా మాట్లాడ్దం, డైరెక్టర్‌కు గౌరవం ఇవ్వటం ఇవన్నీ చాలా సహజంగా, మళ్ళీ మళ్ళీ అలా చూడాలి అన్నంతగా బాగుండేవి.
నిల్చుని సీన్, డైలాగ్స్ చదువుతున్న అసిస్టెంట్‌ను తనపక్కనే కూర్చోమనేవారు. "కూర్చో" అని ఆయన అన్న మాటలో "నా పక్కన కూర్చుంటే ఏమవుతుంది" అని చాలా క్యాజువల్‌గా అడిగినట్టు ధ్వనించేది.
సెట్లో ఆయన కూర్చున్న ఆ స్పేస్ చుట్టూ ఒక "ఆరా"లా కూల్‌నెస్ ఫీలయ్యేవాళ్లం.
కట్ చేస్తే -
ఇప్పుడు తన మొదటి సినిమాలో నటించే ఒక కొత్త హీరో కూడా ఎలాంటి యాటిట్యూడ్ చూపిస్తాడో, ఎలాంటి లెవల్ కొడతాడో అందరికీ తెలుసు.
హీరోలేం ఖర్మ, కొందరు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఎంత లెవల్ కొడతారో చెప్పడం అనవసరం.
టైమ్ సెన్స్ గురించి, ప్రవర్తన గురించి, సెట్లో ప్రొడ్యూసర్-డైరెక్టర్-సీనియర్ ఆర్టిస్టులు-టెక్నీషియన్స్‌కు ఇప్పటివారిచ్చే గౌరవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఒక హీరో ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుకొని దశాబ్దాలపాటు సక్సెస్‌ఫుల్‌గా నిలబడ్డాడంటే దానికి కారణం వారి కులమో మతమో నేపథ్యమో కాదు. ప్రారంభంలో అవి కొంత ఉపయోగపడొచ్చు. కాని, వారి సక్సెస్‌కు కారణం - ఒక తపస్సులా, ప్రొఫెషనల్‌గా వారు పాటించిన డిసిప్లినే అని నేను గట్టిగా నమ్ముతాను.
ఆ రెండురోజులూ హీరో కృష్ణకు సీన్ పేపర్స్ అందించి, చదివి వినిపించి, షాట్ రెడీ చెప్పిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే.
ప్రొఫెషనల్‌గానే కాదు... వ్యక్తిగతంగా కూడా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు, తనకు నచ్చినట్టుగానే జీవించిన సాహసి "సూపర్‌స్టార్ కృష్ణ"కు వినమ్ర నివాళి.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani