Wednesday, 5 February 2014

"ఆనందోబ్రహ్మ" నామ సంవత్సరం!

ఐక్యరాజ్యసమితి దాదాపు ప్రతిసంవత్సరానికీ ఏదో ఓ టాగ్ తగిలించి వదుల్తుంది. అలా 2014 ను "అంతర్జాతీయ ఫ్యామిలీ ఫార్మింగ్ సంవత్సరం" గా ప్రకటించింది.

ఇంతకు మించి ఐక్యరాజ్యసమితి ఏదయినా చేస్తుందో లేదో నాకు అంతగా తెలియదు. చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్నదాని ప్రకారమయితే అది ఎంతో చేయాలి. కానీ, వాస్తవంలో అలా జరగటం లేదన్నది ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోంది.

ప్రపంచమంతా ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు, ఎంత వివక్ష, ఎంత అవినీతి, ఎంత అణచివేత? ...

అదలా వదిలేద్దాం.


కట్ టూ మా "యూ ఎన్ ఓ" --

మొన్నొకరోజు నా యూనివర్సిటీ మిత్రుడు దాము కలిశాడు. "బ్రదర్! తెల్లారి లేస్తే లైఫ్‌లో ఇవన్నీ ఉండేవే.  అందుకే 2014 ను నేను 'ఇయర్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఎంజాయ్‌మెంట్' గా ప్రకటించేశాను. అదే చేస్తున్నాను" అన్నాడు!

అంతేనా.. "అన్నీ పక్కనపెట్టాను. దేనిగురించీ అదే పనిగా టెన్షన్ పడిపోవడంలేదు. జస్ట్ ఎంజాయింగ్ 2014. అంతే!!" అని కూడా అన్నాడు నా మిత్రుడు.

ఏదో ఊరికే అలా అనటం మాత్రమే కాదు. అక్కడ ఆ ఆనందం అంతా బ్రహ్మాండంగా కనిపిస్తోంది! నా మిత్రుని ముఖంలోనూ తను చెప్పిన ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అక్కడి ఆ ఆనందం కాసేపు నేనూ షేర్ చేసుకున్నాక .. నా మిత్రునితోపాటు, అక్కడే పరిచయమైన కొత్త మిత్రుడు ప్రవీణ్‌కు కూడా "బై" చెప్పి అక్కడినుంచి బయటపడ్డాను.


కట్ టూ నా అంతర్మథనం --

కార్లో శివం, యూనివర్సిటీ రోడ్లమీదుగా ఇంటికివస్తూ ఆలోచించసాగాను.

ఏదో ఒక సమస్య అనేది లేకుండా మనిషి జీవితం అనేది ఉండదు. ఒకవేళ, బై మిస్టేక్, అలా ఎవరైనా ఉన్నారంటే.. అదే ఓ పెద్ద సమస్య అయి కూర్చుంటుంది వారికి!

ఎడతెగకుండా మనల్ని వెంటాడే ఏదో ఓ సమస్య గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ బ్రతకడమా? మనకిష్టమైన జీవనశైలిని జీవించడానికి ప్రయత్నిస్తూనో, జీవిస్తూనో ముందుకి వెళ్లడమా?

మొదటి తరహా జీవితంలో నిరంతరం టెన్షనే. ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తే ఇక జీవితం లేదు.

అలా కాకుండా, రెండో తరహా జీవనశైలిలో కనీసం "లైఫ్" అనేది ఉంటుంది. కొంచెం కష్టమయినా, ఎంతో కష్టమయినా.. మనకిష్టమయిన పని చేస్తూ బ్రతుకుతున్నామన్న ఆనందం కొంతయినా ఉంటుంది.

ఆ ఆనందమే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యనీ అర్థవంతంగా పరిష్కరించుకొనే ఆత్మస్థయిర్యాన్ని, శక్తినీ ఇస్తుందన్నది మనం నమ్మితీరాల్సిన ఒక నిజం.

సో, ఆనందోబ్రహ్మ! 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani