Thursday, 9 February 2023

మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు!


"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. 

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 

మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది... 

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు! 

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది.  

తప్పకుండా ఉంది. 

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్... అని నేననుకుంటున్నాను...  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani