ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఎన్నేళ్లయినా ఆ ప్రేమ పోదు.
ఉర్సు చెరువు, దాన్లో ఈతలు, ఫిషింగ్...
ఉర్సు గుట్ట, ఆ గుట్టెక్కి చింతపల్క పండ్లు తెచ్చుకొన్న రోజులు...
ఉర్సు గుట్ట చుట్టూ బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు...
ఉర్సు వాటర్ ట్యాంక్ చుట్టూ ఆడిన రేస్ ఆటలు...
ఒకసారి అదే వాటర్ ట్యాంక్ కాంపౌండ్‌లో నేనూ, జయదేవ్ ఇంకో ఫ్రెండ్‌తో కల్సి దొంగతనంగా కల్లు తాగడం...
ఉర్సులో మా సంఘం బడి అని పిల్చే శ్రీ వేంకటేశ్వర అప్పర్ ప్రైమరీ స్కూలు...
ఆ స్కూల్లో మా సార్లూ, గంట కొట్టే మా కొమ్మాలు..
7వ తరగతిలో నేనే స్కూల్ టాపర్ అయినందుకు ఆనవాయితీ ప్రకారం మా సార్లు, టీచర్లందరికీ నేను తెప్పించి తాగించిన పది పైసల చాయ్‌లు...
ఆ స్కూల్లో మా సార్లూ, గంట కొట్టే మా కొమ్మాలు..
7వ తరగతిలో నేనే స్కూల్ టాపర్ అయినందుకు ఆనవాయితీ ప్రకారం మా సార్లు, టీచర్లందరికీ నేను తెప్పించి తాగించిన పది పైసల చాయ్‌లు...
ఏడాదికోసారి వచ్చే ఉర్సు తీర్థంలో తప్పకుండా కొనుక్కొనే కెలీడియోస్కోపులూ... (అప్పుడు దాని పేరు అది అని తెలీదు!)
ఉర్సు పోస్టాఫీసు... అప్పటి పోస్ట్ మాస్టరు... మేం ఉరుక్కుంటూ వెళ్ళి కొనుక్కొచ్చిన పోస్ట్ కార్డులూ, ఇన్‌లాండ్ లెటర్లూ...
చెట్లోళ్ల గడ్డ... కుంకుమ దుకాండ్లు...
కరీంబాద బుచ్చన్న హోటల్లో మేం తిన్న పూరీ, ఖారాలు...
ఆ పక్కనే సందులో మా చిన్నమ్మ ఇల్లు...
సాకరాశి కుంట దాటి, రైల్వే గేటు దాటి, బట్టల బజారు మీదుగా, చమన్ దాటి రోజూ నడుచుకుంటూ వెళ్ళి నేను చదివిన నా ఏవీవీ జూనియర్ కాలేజి హైస్కూలు...
హైస్కూల్లో మా సార్లు... నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ మీద ఇష్టం కలగటానికి కారణమైన మా రాజమౌళి సారు...
హైస్కూల్లో నా క్లాస్‌మేట్ ఆకుతోట సదానందంతో కలిసి చూసిన ఎన్నో ఫస్ట్ డే మార్నింగ్ షోలు...
అంతకుముందు నా ఇంకో క్లాస్‌మేట్ రాముడుతో కలిసి నేను చూసిన నోము సినిమా... ఇంకెన్నో సినిమాలు...
అంతకుముందు నా ఇంకో క్లాస్‌మేట్ రాముడుతో కలిసి నేను చూసిన నోము సినిమా... ఇంకెన్నో సినిమాలు...
అప్పటి నా ఫేవరేట్ ఇంగ్లిష్ సినిమాల అలంకార్ టాకీస్, అశోకా, నవీన్, రామా, దుర్గా, కాకతీయ 70 ఎమ్మెమ్, మినీ కాకతీయ, వెంకట్రామా, క్రిష్ణా టాకీసులు...
బాంబే స్వీట్ హౌజ్‌లో మేం తిన్న కలాకంద్, తర్వాత ఇచ్చే శాంపిల్ కారా...
ఫస్ట్ టైమ్ మా మేన బావ రమేశ్‌తో కలిసి సవేరా బార్‌కెళ్ళి తాగిన బీరు, తిన్న బిర్యానీ...
కరీంబాదలో ఓ పెళ్ళి బారాత్ అప్పుడు, మా ఇంకో బావ రమేశ్ పక్కనే ఉన్న వైన్ షాపుకు తీస్కెళ్ళి, ఐదు నిమిషాల్లో నిలబడే ఒక బీరు ఖతం చేయించిన తీరు...
ఉర్సు, ప్రతాప్‌నగర్‌లో మాపెద్ద అరుగుల ఇల్లు...
రాత్రైతే చిన్నా పెద్దా అందరికీ ఆ అరుగులే అడ్డాగా పొద్దుపోయేదాకా ముచ్చట పెట్టుకోడాలు...
పనిమనుషులు తెలియని ఆరోజుల్లో, మా అమ్మ ఒక్కతే ఆ 14 దర్వాజాల పెంకుటింటి చుట్టూ రోజూ ఊడ్చి, చల్లి, ముగ్గులేసిన ఆ రోజులు...
మా ఇంట్లో నాకిష్టమైన రెండు చెక్క అల్మారాలు, వాటిలోని మా అన్న కొనుక్కున్న లెక్కలేనన్ని పుస్తకాలు...
మా నాయిన కొనుక్కున్న శంకర్ నారాయణ డిక్షనరీ...
రంగశాయిపేట, బొడ్రాయి, మామునూరు క్యాంపులో గోడమీద ఆదివారం ఫ్రీ సినిమాలు...
కాకతీయుల ద్వారతోరణాలు, శిథిలాలు...
ఇట్లా రాసుకుంటూపోతుంటే ఎన్నెన్నో ఎడతెగని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్...
కట్ చేస్తే -
బాల్యంలో నాకెన్నో అద్భుత జ్ఞాపకాలనందించిన నా వరంగల్‌కు నేనెప్పుడు వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది.
నన్ను అమితంగా ప్రేమించిన అమ్మా నాన్న లేరు.
పదో తరగతితోనే చదువు మానేసి, మెషినిస్టుగా ఎక్కడో ఫాక్టరీలో పనిచేసుకుంటూ బతకాల్సిన నేను - మళ్ళీ చదువుకోడానికి, డైరెక్టుగా యూనివర్సిటీలోకే ప్రవేశించి పీజీలు, గోల్డ్ మెడల్స్ సాధించడానికి కారణమైన ఇన్‌స్పిరేషన్‌ను ఒకే ఒక్క మాటతో అందించిన మా అన్న దయానంద్ లేడు.
నేను కనిపించగానే నవ్వుతూ పలుకరించే నా చిన్న తమ్ముడు వాసు లేడు.
నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు...
నా చిన్ననాటి జిగ్రీ దోస్త్ ఓంప్రకాశ్ లేడు...
ఎందరికో ఆశ్రయమిచ్చి, మాకెన్నో అద్భుత జ్ఞాపకాలనిచ్చిన అప్పటి మా ఇల్లు లేదు.
కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చే ఇలాంటి జ్ఞాపకాలు ఇష్టం లేకే నేను వరంగల్ వెళ్లడానికి తప్పించుకొంటుంటాను.
అయినా సరే, కొన్నిసార్లు తప్పదు. ఇలా పొద్దున బయల్దేరి వెళ్లి, రాత్రికి వచ్చేస్తుంటాను.
ఒకసారి ఫ్రీగా ఒక వారం రోజులు మా వరంగల్లో అడ్డా వెయ్యాలని ఉంది. అక్కడే ఉన్న నా ఇద్దరు తమ్ముళ్ళు శ్రీధర్, రమేశ్‌లతో కలిసి నాకిష్టమైన అప్పటి అన్ని జ్ఞాపకాలని మనసారా చూస్తూ తిరగాలని ఉంది. నన్ను నేను పరిచయం చేసుకుంటూ, అప్పటి నా బంధుమిత్రులందరినీ కలిసి పలకరించాలని ఉంది.
ఎప్పుడో ఆ పని తప్పక చేస్తాను.
ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు.
ఎంతైనా పుట్టిపెరిగిన వూరు కదా... ఆ ప్రేమ పోదు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani