ఒక మీటింగ్ కోసం వెయిట్ చేస్తూ, ఇంకో గంట టైమ్ పడుతుందని తెలిసి, నేనూ నా మిత్రుడు రోడ్డుమీద అలా నడవసాగాం.
పక్కనే ఉన్న ఆడిటోరియం దగ్గర - అడ్డంగా ఉన్న మైకు రాడ్డు పట్టుకున్న ఒక పెద్దమనిషి ఫోటోతో ఒక ఫ్లెక్సీ బ్యానర్ కనిపించింది.
'కొంపమునిగిందిరా అయ్యా' అనుకున్నాను.
మావాడు ప్రవచనాల బ్యాచ్... చూసేశాడు. అంతే.
కట్ చేస్తే -
పక్కనే ఉన్న ఆడిటోరియం దగ్గర - అడ్డంగా ఉన్న మైకు రాడ్డు పట్టుకున్న ఒక పెద్దమనిషి ఫోటోతో ఒక ఫ్లెక్సీ బ్యానర్ కనిపించింది.
'కొంపమునిగిందిరా అయ్యా' అనుకున్నాను.
మావాడు ప్రవచనాల బ్యాచ్... చూసేశాడు. అంతే.
కట్ చేస్తే -
కిక్కిరిసివున్న ఒక హాల్లోకి నన్ను దాదాపు లాక్కెళ్ళాడు నా మిత్రుడు.
మావాడితో ఇలాంటి అనుభవాలు నాకు ఇంతకు ముందు కూడా ఉన్నాయి కాబట్టి, నేను చెయ్యగలిగింది ఇంక ఏం లేక, మావాడి పక్కనే కూర్చున్నాను.
వాడు ప్రవచనాల్లో లీనమైపోయాడు. నేను ఏం తోచక - ఎవరెవరొచ్చారు, ఎలాంటివారొచ్చారు, ఏ వయస్సువాళ్లెక్కువున్నారు గట్రా స్టడీ చేయసాగాను.
నేను ఇష్టపడే 'ఫేసినేటింగ్ సెగ్మెంట్' అక్కడ ఒక్కరు కూడా కనిపించలేదు. కొంచెం సంతోషమేసింది.
వాళ్లకు కూడా ఇలాంటివి అంటుకుంటే ఇంక మన నిత్యజీవితంలో ఎట్రాక్షన్ ఏం మిగుల్తుంది?
ఏమైనా, ఈ సాయంత్రం నా టైమ్ ఇలా వృధా అవుతున్నందుకు మాత్రం కాస్త బాధ అనిపించింది.
సరే, పక్కన నా మిత్రుడు మైకులో మాట్లాడుతున్న ఆ పెద్దమనిషి మాటల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి, వాడి ఆనందం కోసం నేనూ అలాగే కూర్చుని అడ్జస్టయిపోయాను.
ఏదైనా మితిమీరితే చీప్ అయిపోతుంది. ఈయన ఉపదేశాలు నా బచ్‌పన్ నుంచి చూస్తున్నాను. నా అంచనా ప్రకారం - ఆయన బుర్రలో ఉన్న ఆ కంటెంట్ ఎప్పుడో స్టాగ్నేట్ అయిపోయింది.
తన ఎదురుగా కూర్చున్న అమాయక ప్రాణులను ప్రతి రెండో వాక్యానికి నవ్వించాలి కాబట్టి... ఈ మధ్య ఊ అంటే సినిమాలు, ఉ ఊ అంటే సినిమావాళ్ల ఉదాహరణలు తీసుకొని, నాన్-స్టాప్‌గా ఉపన్యాసాలు బాగా దంచికొడుతున్నాడు.
జీవితంలో ఏదో జరిగిపోద్ది, ఏమో అయిపోతాం అని వచ్చి, అక్కడ ఆయన ఎదురుగా కూర్చొనే ఆ అమాయక ప్రాణులకు కూడా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుందనుకుంటాను. అలవాటైపోయారు.
వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, అనేక ఉద్గ్రంధాలు, వాటి సారం, సారాంశం... అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆయనకు ప్రవచనాలంటే జస్ట్ ఏదో ఒక ముచ్చట చెప్పి నవ్వించామా లేదా అన్నదే పాయింట్.
ఇంకా చెప్పాలంటే - ఊళ్ళల్లో పనిలేనోళ్ళంతా ఓ రచ్చబండ దగ్గర చేరినప్పుడు, వాళ్ళల్లో కొంచెం నాన్-స్టాప్ అతివాగుడు ఉన్నోడు ఏదో ఒక చెత్త చెప్తూనే ఉంటాడు... చుట్టూ చేరినవాళ్ళు ఆ చెత్తను ఎంజాయ్ చేస్తూ వింటూనే ఉంటారు... అది అంతకు ముందు పది సార్లు చెప్పిందైనా సరే!
ఈ మేధావి పుణ్యమా అని ఒక మంచి కార్యక్రమం చివరికి ఇలా తయారైంది.
ప్రభుత్వం ఈయన సేవలకు మెచ్చి ఏదో గుర్తింపు కూడా ఇచ్చినట్టుంది ఈమధ్యే.
ఇలా ఆలోచించుకొంటూ, ఎప్పుడు లేద్దామా అని టైమ్ చూసుకుంటున్నాను. ఇంతలో మిస్టర్ మహోపన్యాసకుడు తన పిట్టకథల మధ్య కొత్తగా ఇంకో సినిమా టాపిక్ తెచ్చాడు.
ఈసారి - బాలీవుడ్‌లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యి, వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమాను ఒకదాన్ని పిక్ చేశాడు మిస్టర్ టైమ్‌పాస్.
ఆయన సువచనాల ప్రకారం ఆ సినిమా సినిమా కాదు... సినిమా అలా తీయకూడదు... విలన్‌ను హీరో చేయడమేంటి?..."తగ్గేదేలే" అని ఆ హీరోకు ఆ డైలాగ్ ఎట్లా పెడతారసలు?... ఆ హీరో, ఆ డైరెక్టర్ నాకు కనిపిస్తే చెప్తాను ఉండండి... అంటూ మిస్టర్ పూనకం అయిపోయాడు.
అమాయక భక్తులు నవ్వులే నవ్వులు.
మిషన్ ఎకంప్లిష్‌డ్!... మిస్టర్ వాగ్గాయ్‌లో పిచ్చి సంతృప్తి!!
పక్కకి తిరిగి చూశాను. ఆయన డైహార్డ్ ఫ్యాన్ అయిన నా ఫ్రెండ్ నవ్వటం లేదు, ఆశ్చర్యంగా!
నేను వాడినే చూస్తున్నది చూసి, మరింత సీరియస్ అయిపోతూ లేచాడు.
ఇద్దరం బయటకు నడిచాం.
"ఏంట్రా తొందరగా లేచావ్... ఇంకో అరగంటుందిగా?!" నా మిత్రున్ని అడిగాన్నేను.
"ఆ తొక్కలే... ఆయనేంట్రా సినిమాలెట్లా తియ్యాలో చెప్తున్నాడు?"
"గొర్రెల్లా మనం వినటానికి రెడీగా ఉంటే, ప్రతివాడూ చెప్పేవాడేగా!... ఆ లిస్టులో ఈయన కూడా చేరిపోయాడు" అన్నాను.
"ఆల్రెడీ ఏ వర్గం ఏమనుకుంటుందో, ఎవడు ఏ కేసు పెడ్తాడో అని సినిమాలకు కథలు రాసుకోడానికి చస్తున్నాం... టైటిల్ పెట్టుకోడానికీ చస్తున్నాం!... ఇప్పుడీయనొచ్చి హీరో ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఆడికి ఏ డైలాగ్ ఉండాలో, ఏ డైలాగ్ ఉండకూడదో చెప్తున్నాడు!... ఎట్లా చచ్చేదిరా వీళ్లతో?!"
"అంటే మనం, మన ప్రొడ్యూసర్లు ఇల్లూ-జాగలు అమ్ముకొని, అప్పులు చేసి డబ్బు తెచ్చుకొని... ఈయన దగ్గరకెళ్ళి, "సినిమా ఎలా తీయమంటారు" అని, ఈయన సలహా తీసుకొని, సినిమాలు తీయాలా ఇకనుంచీ?!"
"అలాగే ఉంది" అన్నాను.
నన్ను కిందామీదా కోపంగా చూశాడు మావాడు... అదేదో నేనే మిస్టర్ ప్రవచన్ అన్నట్టుగా.
"ముందు కొంచెం బానే ఉండేది ఈయన చెప్పేది. పోను పోను మన డైరెక్టర్స్ స్టాగ్నేట్ అయినట్టు, ఈయన కూడా స్టాగ్నేట్ అయిపోయాడు" అన్నాన్నేను.
"స్టాగ్నేట్ అయిపోతే మాత్రం... మనమే దొరికామా?! ఏ పాలిటిక్సో, క్రికెట్టో తీసుకోవచ్చుగా ఏదో ఓ సొల్లు చెప్పి నవ్వించడానికి?!" దాదాపు అరిచినంత పని చేశాడు మావాడు.
"అవును" అన్నాను, ఇంకేమనాలో తోచక.
"అంటే... ఈయన థియరీ ఆఫ్ ప్రవచన్స్ ప్రకారం... సినిమా పుట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా... దాదాపు ఏ ఒక్క సినిమా రిలీజ్ కావడానికి వీళ్లేదు కదరా?!" తను ఆల్రెడీ ఓ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అన్న విషయం మర్చిపోయి, అమాయకంగా లాజిక్ మాట్లాడాడు మావాడు.
"అంతే కదరా" నేనూ అన్నాను.
"అంతే మరి... హీరో లాంటి విలన్ లేకుండా, విలన్ లాంటి హీరో లేకుండా... అసలు హీరో విలనా, విలన్ హీరోనా అన్న కన్‌ఫ్యూజనే లేని హీరోలు విలన్లు లేకుండా... ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సినిమాలు తీశారా?... వాళ్ళకు ఊతపదాలు, పంచ్ డైలాగుల్లేకుండా సినిమాలు ఎప్పుడైనా ఆడినయా?" ఆవేశంతో ఊగిపోతున్నాడు మావాడు.
"కరెక్టే" అన్నాను వినిపించీ వినిపించనట్టు.
"ఇంకా నయం... అప్పట్లోనే ఈయనుంటే - వాల్మీకి, వ్యాసుడు, నన్నయ్య, తిక్కన్న, పెద్దన్న... అసలు వీళ్లంతా ఏమైపోయేవాళ్ళురా?"
"ఏమైపోయేవాళ్ళు?"
"వాళ్ళు ఆ తాళపత్రాలు బయటికి తీసెటోళ్లు కాదు, ఆ గంటం పట్టుకొని ఏం రాసెటోళ్ళు కూడా కాదు!.... ఇంక ఈయనే గాని అప్పట్లో లండన్‌లో పుట్టుంటేనా... షేక్స్‌పియర్ అనే పేరే వినెటోళ్లం కాదు!!... అసలు లిట్రేచర్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే ఉండేది కాదు" ఊగిపోతున్నాడు మావాడు.
"మరీ అంత తీసెయ్యకురా... నీ ఫేవరేట్ గురువు, మొన్నీ మధ్యే ధర్మశ్రీ కూడా వచ్చింది..." అంటూ ఏదో లైటర్వీన్‌లో వాడి ఆవేశం తగ్గించబోయాను.
"చాల్లే... రేపు ఆ సినిమా 2.0 'ద రూల్' కథాచర్చల్లో, రోజూ ఈయన్ని గుర్తుకుతెచ్చుకొని తిట్టుకోవాల్సిందేగా పాపం ఆ డైరెక్టరూ, ఆయన టీమ్!?" ఆవేశంతో ఊగిపోతున్నాడు నా ఫ్రెండు.
"ఒక్క ఆ డైరెక్టరే కాదు... అందరు డైరెక్టర్లూ అంతే! స్టోరీ సిట్టింగ్స్‌లో ఈయన్ని రోజూ గుర్తుకుతెచ్చుకుంటారు... 'మిస్టర్ ప్రవచన్ దీనికేమంటాడో, దానికేమంటాడో' అని!" నవ్వాన్నేను.
"అరేయ్... నువ్వట్లా నవ్వి, నాకింకా ఎక్కియ్యకురా బై! నాకసలే మండుతోంది" అని వార్నింగ్ ఇస్తూ ఓ పక్కకెళ్ళి, జేబులోంచి క్లాసిక్ మైల్డ్స్ బయటికి తీసి వెలిగించాడు నా ఫ్రెండు.
గట్టిగా ఒక పఫ్ పీల్చి, మెల్లిగా అలా రెండు రింగులు వదిలాడు.
తర్వాత, కాసేపు పఫ్ మీద పఫ్ గుంజాక..."ఉఫ్" అని నిట్టూర్చి కొంచెం రిలీఫ్ ఫీలైపోతూ, మళ్ళీ నావైపు చూశాడు.
"రెండేళ్ళ కరోనా లాక్‌డౌన్ల స్టకప్ తర్వాత... ఏదో ఇంక రెగ్యులర్‌గా సినిమాలు చేద్దాం అనుకొంటూ నానా తిప్పలు పడుతుంటే... ఇట్టాంటోళ్ళు బయదేరారేంట్రా?" అన్నాడు వాడు.
వాడి బాధలో న్యాయముందనిపించింది నాకు.
సడెన్‌గా వాడి మైండ్‌లో ఏం మెరిసిందో... ఉన్నట్టుండి టక్కున పైకి ఆకాశంలోకి చూశాడు.
ఏముందా అక్కడ అని, నేనూ పైకి చూశాను.
"ఇప్పుడు... ఈయన కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ప్రవచన్స్ ప్రకారం... అక్కడ చచ్చి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ 'దానవీర శూర కర్ణ' సినిమా తీసినందుకు ఏమైపోవాలి? విలన్ దుర్యోధనున్ని హీరోగా చేసి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినందుకు ఇంకేమైపోవాలి? ఆ దుర్యోధనునికి "అయ్యారే" అని డైలాగ్ పెట్టిన పాపానికి ఎంత బాధపడాలి?... అదే దుర్యోధనునికి 'చిత్రం, భలారే విచిత్రం' అని ఒక డ్యూయెట్ కూడా పెట్టినందుకు ఇంకెంత కుమిలిపోవాలి?!"
తన డౌటనుమానాన్ని పైకే అనేసి, అలాగే పైకి చూస్తూ పఫ్ మీద పఫ్ లాగుతున్నాడు నా ఫ్రెండు.
వాడికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక... నా జీన్స్ ప్యాంటు రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని, అలా నడుస్తూ ముందుకెళ్ళిపోయాను.
***
డిస్‌క్లెయిమర్:
ఈ కథానిక ఎవ్వర్నీ ఉద్దేశించి గాని, దృష్టిలో పెట్టుకొని గాని రాసింది కాదు. పూర్తిగా కల్పితం.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani