"ఊరంతా ఓ దిక్కు అయితే, ఉలిపిరికట్టెది ఓ దిక్కు అన్నట్టు... మనమందరం ఇటు సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సైడుంటే, వీడొక్కడు మాత్రం అటెటో ఆ మూలకు పోయిండు!"
ఓ పదేళ్ళ క్రితం అనుకుంటాను... మా "బిగ్ ఫైవ్" మిత్రుల సిట్టింగ్‌లో ఒక మిత్రుడు నన్ను ఉద్దేశించి ఈ మాటన్నాడు.
అప్పుడు నేను న్యూబోయిన్‌పల్లిలోని 'డైమండ్ పాయింట్'లో ఉంటున్నాను.
అప్పటి అవసరం, సౌకర్యం ఆ సమయంలో నన్నక్కడ దిగిపోయేట్టు చేసింది. ఒకసారి ఒక చోటు అలవాటైపోయాక, సౌకర్యంగా ఉన్నాక, ఇంక అక్కడ్నుంచి కదలాలనిపించదు. ఏం కదిలినా, ఆ చుట్టుపక్కలే కదుల్తాం తప్ప ఇంకో ఏరియాకు వెళ్ళాలనిపించదు.
ఎక్కడెక్కడినుంచో హైద్రాబాద్ వచ్చి స్థిరపడే వాళ్లందరి విషయంలో జరిగేది ఇదే.
కట్ చేస్తే -
సినిమా టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్ అని చెప్తూ ఆ మధ్య నేనొక బ్లాగ్ పోస్టు రాశాను.
కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.
ఇరానీ హోటల్. కాఫీడే.
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు.
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్.
యాత్రి నివాస్. సినీ ప్లానెట్...
ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ సినిమాలకు, మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు అంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పట్లా నాలుగ్గోడల మధ్యనే కూర్చొని పనిచేసే రోజులు పోయాయి. క్రియేటివిటీకి రొటీన్ అంటే అస్సలు నచ్చదు.
అదలా పక్కనపెడితే - సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనంతా ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనే జరగాలన్న రూల్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. అలాగే, సినిమావాళ్లంతా కూడా జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ, మణికొండ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరం కూడా నిజానికి లేదు.
ఎవరు ఎటువెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా... ముందు అవసరం, తర్వాత సౌకర్యం అనే ఈ రెండు అంశాలు మాత్రమే ఈ విషయంలో ఎవరి నిర్ణయానికైనా కారణమవుతాయి.
హాలీవుడ్ సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా హాలీవుడ్‌లోనే ఉండరు. బాలీవుడ్‌లో పనిచేసేవారంతా ఒక్క ముంబైలోనే ఉండరు. అలాగే, మన తెలుగు సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కూడా ఒక్క హైద్రాబాద్‌లోనే ఉండరు. ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనో, మణికొండలోనో ఉండరు.
ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకోగలిగితే చాలు, ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాలు తీయొచ్చు. సినిమాల్లో పనిచేయొచ్చు.
ఈ విషయంలో... తన తొలి సినిమానుంచి మొన్నటి లవ్‌స్టోరీ వరకు, తాను మొదటినుంచీ నివాసముంటున్న సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌నే అడ్డాగా చేసుకొని విజయవంతంగా సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ములను మించిన ఉదాహరణ అవసరమని నేననుకోను.
ఫిలిం నెగెటివ్ నుంచి డిజిటల్‌కు మారిపోయాక, ఫిలిమేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ల్యాబ్స్ కూడా అవసరం లేదు. మంచి ల్యాప్‌టాప్స్ రెండు చాలు.
ఇక... ఫిలిం చాంబర్లో, ఎఫ్‌డిసిలో, సెన్సార్ ఆఫీసులో, యూనియన్ ఆఫీసుల్లో ఉండే కొద్దిపాటి పేపర్ వర్క్ కోసం - ఒక సినిమా మొత్తానికి పట్టే సమయం కేవలం కొన్ని నిమిషాలే! ఆ కొన్ని నిమిషాల కోసం, ఆ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరమైతే అస్సలు లేదు.
రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నతర్వాత - ఆ మధ్య నేను కూడా శ్రీనగర్ కాలనీకి మారిపోవాలనుకున్నాను. కాని, ఇప్పుడా ఆలోచన పూర్తిగా మానుకున్నాను.
ఫిలిమ్‌నగర్‌కి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో నేనెక్కడైతే ఉన్నానో, నాకిక్కడ చాలా సౌకర్యంగానే ఉంది. నా ఇతర ప్రొఫెషనల్ & క్రియేటివ్ యాక్టివిటీస్‌కి కూడా ఇదే నాకు బెస్ట్ ప్లేస్.
కలవాలనుకున్నప్పుడు - ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకోవచ్చు. వాస్తవానికి అదసలు సమస్యే కాదు.
ఏం చేస్తున్నామనేది ముఖ్యం. ఏం సాధిస్తున్నామనేది ముఖ్యం.
కట్ చేస్తే -
ఒక రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో మా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్, బుక్ పబ్లిషింగ్, మరికొన్ని భారీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్‌తో మా ఆఫీస్ ప్రారంభం కాబోతోంది.
Thanks to 2022, now it's gonna be a very special year in every aspect...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani