Pages

Thursday, 4 June 2026

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...


జేమ్స్ ఆల్టుచర్ అంటాడు: "ఇది పోస్ట్ చెయ్యాలా వద్దా అన్న మానసిక సంఘర్షణ లేకుండా నేను ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా నా బ్లాగ్‌లో పోస్ట్ చెయ్యలేదు" అని. 

ఇప్పుడు నేనూ అలాంటి ఫీలింగ్‌తోనే ఉన్నాను. 

ఈ బ్లాగ్ రాయటం కరెక్టో కాదో నాకు తెలియదు. కాని, రాస్తున్నాను. 

కట్ చేస్తే -

సరిగ్గా ఒక మూడేళ్ళ క్రితం వరకు, నాకు బాగా తెలిసిన మిత్రుడొకరికి, మెయిన్ రోడ్డుకే ఉన్న ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో అక్షరాలా 7 ఆఫీసులుండేవి. కనీసం ఒక 30-40 మంది స్టాఫ్‌తో ఎప్పుడూ కళకళలాడుతూవుండేవి ఆయన ఆఫీసులన్నీ. 

అతను చేస్తున్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. 

నేను చూస్తుండగానే సీన్ మారిపోయింది. 

చకచకా 6 ఆఫీసులను మూసేశాడు. ఒకే ఒక్క ఆఫీసు మాత్రం ఉంచుకున్నాడు మొన్నటివరకూ. 

సుమారు రెండువారాల క్రితం అనుకుంటాను, నాకు ఫోన్ చేశాడు నా మిత్రుడు. "బ్రో, నీ బుక్స్ కొన్ని గిఫ్ట్ ప్యాక్ చేసినవి నా బీరువాలో ఉంటే మన వెంకటేష్‌కు ఇచ్చాను. అటువైపు వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకో" అని చెప్పాడు. 

తర్వాత ఎప్పట్లాగే మామూలుగా ఏవేవో విషయాలు మాట్లాడుకున్నాము.

అప్పుడప్పుడూ వాట్సాప్‌లో హాయ్ చెప్పుకుంటున్నాము. 

కాని, నేను నా మనసులో బాధపడుతూనే ఉన్నాను. నా మిత్రుడు ఆ చివరి ఆఫీసు కూడా తీసెయ్యడం నాకు నచ్చలెదు. ఆయనకి కూడా ఇష్టం లేదు. కాని, ఎంతకాలం భరిస్తాడు? 

కొన్ని వాస్తవాల్ని ఒప్పుకొని తీరాలి. తప్పదు.   

కట్ చేస్తే - 

ఆయనేం చీటర్ కాదు. 
చీటర్ అయితే డబ్బు, ఆస్తులు బాగా సంపాదించుకొనేవాడు.
ఇలా దివాలా తీసేవాడు కాదు. 

కాని ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు...

మనుషుల్ని నమ్మటం. 
ముఖ్యంగా ఆయన వెనుక ఆయన్ని తిట్టేవారినీ, 
ఆయన్ని విమర్శించేవారినీ బాగా నమ్మటం. 
పైగా, వాళ్ల ఎదుగుదలకు ఈయన తోడ్పడటం.

ఇంకా ముఖ్యంగా, నమ్మకూడని కొందరు వ్యక్తుల్ని మరీ గుడ్డిగా నమ్మటం.

ఎన్నో తెలిసినా, చూసీచూడనట్టు వాటిని పట్టించుకోకపోవటం.   

"మా మధ్య ఎన్నో ఉంటాయి. కాని, కలిసి ఏడెనిమిదేళ్ళుగా పనిచేస్తున్నాం కదా. అవ్వన్నీ పెద్దగా పట్టించుకోవద్దు, బ్రో" అని స్వయంగా నాతోనే చాలాసార్లు చెప్పాడు నా మిత్రుడు. 

లెక్కల విషయంలో, జరగాల్సిన పనుల విషయంలో... ఎప్పటికప్పుడు పాటించాల్సిన ఖచ్చితత్వం అసలు పాటించలేదు నా మిత్రుడు.

అదే పెద్ద పొరపాటు. 

మనం డౌన్‌లో ఉన్నప్పుడు, అవతలివాడు ఏది చెప్తే అదే నిజం అని ఎవరైనా నమ్ముతారు. 

కొత్తగా ఒక నాలుగు రిజిస్ట్రేషన్స్ చేస్తే, మళ్ళీ అదే నోరుతో, "రెడ్డి గారు చాలా మంచి మనిషి" అని చాలా సింపుల్‌గా అదే వ్యక్తి తన మాట మార్చగలుగుతాడు. 

ఇది బిజినెస్. 
బిజినెస్‌లా చెయ్యాలి.
జాగ్రత్తగా చెయ్యాలి. 

ఇంత భోళాతనం పనికిరాదు. 
ఇంత ఓవర్ కాన్ఫిడెన్సు కూడా పనికిరాదు.  

అంతా బాగుంది అనుకుంటాం. 
కాని, అలా ఉండదు. 
దెబ్బ తిన్నాకే అన్నీ రియలైజ్ అవుతాం.

ఇది అనుభవం మీదే తెలుస్తుంది.
అనుభవించినవారికే తెలుస్తుంది. 
చేతులు కాలాకే తెలుస్తుంది.  

నా మిత్రుడి విషయంలో కూడా జరిగింది ఇదే. 

ముందుచూపు లేకుండా, భోళాగా, అతను తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఈరోజు అతన్ని "బ్రోక్" చేశాయి. 

కాని, అతన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్‌కు అతనే సంపూర్ణ జవాబుదారీ కదా? 

ఇక్కడే అతను ఇరుక్కుపోయాడు. 

ఇప్పటికీ ఒకరిద్దరు కస్టమర్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన బాధ్యత ఆయనమీదుంది. ఆయన ఎలాగైనా చేయగలడని నాకు తెలుసు. కాని, టైమ్ ఫాక్టర్ అనేది ఒకటుంటుంది. 

నా మిత్రున్ని నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ల డబ్బు డబ్బే కదా? వాళ్లెంత బాధపడుతూవుంటారు? 

డబ్బు దగ్గర ఎలాంటి కొత్త సమస్యలయినా వస్తాయి. 

వాటిని ఎదుర్కోగలగాలి. 
ఎవాల్వ్ అవ్వాలి. 

దటీజ్ లైఫ్. 

అయితే, ఇదంతా నేను నా మిత్రున్ని సమర్థించడానికి రాయటం లేదు. అతని బాధను అర్థం చేసుకోవడంలో నన్ను మించిన అర్హులు ఇంకొకరు ఉండరు. ఉండే అవకాశం లేదు. 

ఇవ్వాళ సాయంత్రం అనుకోకుండా నేను వెంకీకి కాల్ చేశాను.

"నేను మనిషిని పంపిస్తాను, మొన్న రెడ్డిగారు నీకిచ్చిన నా బుక్స్ గిఫ్ట్ ప్యాక్స్ అతనికివ్వు" అని చెప్పాను. 

"సరే, సార్" అన్నాడు వెంకీ. 

నేను "వెంకీ" అని పిలిచే ఈ వెంకటేష్, నా మిత్రుడి ఆఫీసులున్న కమర్షియల్ కాంప్లెక్సుకి వాచ్‌మేన్.

నేనింకేం అతన్ని అడగలేదు. కాని, అతనే చెప్పసాగాడు...  

"మొన్న సార్ వచ్చారు. బీరువాల్లోని ఫైల్స్ అన్నీ నాలుగైదు కార్టన్ డబ్బాల్లో సర్దుకొన్నారు. ఆటో మాట్లాడుకొన్నారు. డబ్బాల్ని ఆటోలో వేసుకొని, అదే ఆటో ఎక్కి ఒక్కడే కామ్‌గా వెళ్ళిపోయారు. అంతమంది స్టాఫ్‌కు జీతాలిచ్చిన సార్‌కు ఇలాంటి రోజున కనీసం తోడుకైనా ఒక్కరు లేరే అని నాకే చాలా బాధనిపించింది సార్" అని వెంకీ బాధపడుతూ నాతో చెబుతుంటే, నా నోటి నుంచి మాట రాలేదు.    

బీరువాలు, ఫర్నీచర్ అంతా వదిలేసి, ఆ కాంప్లెక్సులో తన చివరి ఆఫీసుకి కూడా అలా గుడ్ బై చెప్పాడు నా మిత్రుడు అని తెలిసి నేను చాలా బాధపడ్డాను.

ఇలా వెళ్తున్నాను... అని కనీసం నాకో కాల్ కూడా చెయ్యలేదు నా మిత్రుడు. 

నా మిత్రుడి గురించి నేనెంతో బాధపడకపోతే, అతని గురించి నేనీ బ్లాగ్ పోస్టుని, ఇలా, ఇంత సమయం కెటాయించి రాసేవాన్నే కాదు.  

వరంగల్లో ఒక సేల్స్ మేనేజర్ స్థాయి నుంచి, హోటల్ బిజినెస్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్ రంగం, మార్కెటింగ్ ఏజెన్సీలు... ఇలా ఎన్నెనో రంగాల్లో దాదాపు దేశమంతా విస్తరించి పనిచేసిన నా మిత్రుడి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లోని జయాపజయాల మీద ఒక మంచి బ్లాగ్ రాయాలని గతంలో చాలాసార్లు అనుకున్నాను. ఎందువల్లో అది కుదరలేదు. 

కాని, చివరికి ఇప్పుడు ఇలా రాస్తానని మాత్రం అనుకోలేదు. 

డెస్టినీ అంటే అదే. 

కాని, ఇలాంటివాళ్లే ఒక పెద్ద స్వింగ్‌తో బౌన్స్ బ్యాక్ అవుతారని చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి.  

అలా నా మిత్రుడు కూడా వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. 

అన్నట్టు, మా ఇద్దరి బర్త్‌డే ఒకే రోజు... నవంబర్ 26.  

Never underestimate a determined entrepreneur who has gone broke. They have lost money, but gained experience, wisdom, resilience, and clarity. And that is often enough to come back stronger than ever.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani