Pages

Friday, 8 August 2025

బిల్డప్పులు తక్కువ, కంటెంట్ ఎక్కువ... అదే మలయాళం సినిమా!


మలయాళం సినిమా అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది నా హైస్కూలు రోజులు. అప్పట్లో మా వరంగల్ రామా టాకీస్‌లో, నవీన్ టాకీస్‌లో, కాకతీయ 35 ఎం ఎంలో మలయాళం డబ్బింగ్ సినిమాలు మార్నింగ్ షోలు పడేవి.

"ఆమె మధుర రాత్రులు", "సత్రంలో ఒక రాత్రి"... ఇలా ఉండేవి ఆ సినిమాల టైటిల్స్. అవన్నీ "ఏ" సర్టిఫికేట్ సినిమాలు. 

ఎక్కడో ఒకటీ అరా బోల్డ్ సీన్లుండేవి. కొన్నిట్లో నిండా కప్పుకుని వెట్ అయ్యే సీన్లుండేవి. వాటికే హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో తెగ ఎగ్జయిట్ అయ్యేవాళ్ళు ప్రేక్షకులు. నేను కూడా.

అయితే - ప్రతి సినిమాలో కథ మాత్రం చాలా బాగుండేది. 

అలా ఒకటీ అరా బోల్డ్ సీనో, వెట్ సీనో ఉండే అప్పటి మలయాళం సినిమాలను మన డబ్బింగ్ నిర్మాతలు ఎగబడి కొన్నుక్కొని అప్పట్లో మంచి బిజినెస్ చేశారన్నమాట!    

అప్పటి మలయాళం సినిమాల్లో నాకు బాగా గుర్తున్న ఒకే ఒక్క డైరెక్టర్ పేరు - ఐ వి శశి. ఒక్క మలయాళంలోనే సుమారు 110 సినిమాలు డైరెక్ట్ చేశారు శశి. హీరోయిన్ సీమ అప్పట్లో ఈయన దర్శకత్వలో దాదాపు ఒక 30 సినిమాల్లో నటించింది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారని చదివాను. 

కట్ చేస్తే -

అప్పటికీ ఇప్పటికీ కంటెంట్ విషయంలో మలయాళం సినిమా మారలేదు. 

దీనికి ప్రధాన కారణాలు రెండు:

1. మలయాళ చిత్ర పరిశ్రమ బిజినెస్ పరిథి చాలా చిన్నది. ఎక్కువ బడ్జెట్లు వర్కవుట్ కావు. ఈ నేపథ్యంలో - తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ క్రియేటివిటీ కోసం తపన ఉంటుంది. అదే అక్కడ వర్కవుట్ అయింది, అదే ఇప్పటికీ కొనసాగుతోంది. 

2. మలయాళంలో అత్యధికశాతం మంది కవులు, రచయితలు, ఫిలిం మేకర్స్, ఇతర క్రియేటివ్ రంగాల వారంతా (అప్పట్లో ఎక్కువగా, కొంతవరకు ఇప్పుడు కూడా) కమ్యూనిజం భావజాలం నేపథ్యం ఉన్నవారే. అనవసర భారీతనం, బిల్డప్పులు వంటివాటిని ఈ నేపథ్యం పట్టించుకోదు, ఇష్టపడదు. ఈ ఆలోచనావిధానమే ఎక్కువ శాతం మలయాళ సినిమాల్లో సహజత్వానికి కారణమైంది. ఇప్పటికీ ఈ సహజత్వమే పునాదిగా మలయాళ సినిమా కొనసాగుతోంది.

మొన్నొక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన తెలుగు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫాక్టరీ) ఒక విషయం బాగా చెప్పారు - మళయాళంలో కోటిరూపాయల్లో బాగా తీయగలిగిన సినిమా మన తెలుగులో తీసేటప్పటికి కనీసం 5 నుంచి 15-20 కోట్లు అవుందని! విశ్వ చెప్పిన మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

అక్కడి టోటల్ సినిమా బడ్జెట్ ఇక్కడ హీరో రెమ్యూనరేషన్‌కు కూడా సరిపోదు. కథ ఏదైనా కానీ - ప్రతి షాట్‌లో, ప్రతి సీన్లో మనవాళ్లకు భారీతనం కావాలి. బిల్డప్పులు కావాలి. అలవాటైన ప్రాణాలు. అవి లేకపోతే ప్రేక్షకులు తిప్పికొడతారని భయం. ఇక బడ్జెట్ 20 కోట్లో, 30 కోట్లో ఎందుక్కాదు? 

దీనికి లేటెస్ట్ ఉదాహరణ - ఆమధ్య వచ్చిన మలయాళం "ప్రేమలు" సినిమా. కేరళ నుంచి మొత్తం టీమ్ వచ్చి హైద్రాబాద్‌లో 2 ఫ్లాట్స్‌లో ఉండి, సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని వెళ్లారు. అంతా కొత్తవాళ్లే. (ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌లో ఒకరు.) 

ఈ సినిమా మొత్తం బడ్జెట్ 3 కోట్ల లోపే. 
136 కోట్లు వసూలు చేసింది. 

ఇదే సినిమాను కొనుక్కొని మనవాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా సక్సెస్ అయింది.   

అయితే - ఇదే కథను తెలుగులో తీస్తే మనవాళ్ళు కనీసం ఒక 20 కోట్లు ఖచ్చితంగా ఖర్చుచేస్తారని ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా చెప్తాడు. 

Creativity speaks from the soul, business speaks from the mind. Merging the two with balance is rare—and that’s what makes it powerful.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani