Monday, 14 July 2014

జాతీయస్థాయిలో రెండో అత్యుత్తమ యూనివర్సిటీ!

ఇందాకే చదివాను ..

ఉస్మానియా యూనివర్సిటీకి 2014 వ సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో 2 వ స్థానం లభించింది.

ఆ మధ్య కొంత స్లో అయినా - మళ్లీ మన ఓ యూ ప్రగతి స్థానంలో మిసైల్‌లా దూసుకుపోటోందన్నమాట!

ఇండియా టుడే - నీల్సన్ గ్రూప్‌లు సమ్యుక్తంగా దేశంలో ఉన్న సుమారు 200 యూనివర్సిటీలపై జరిపిన సర్వే ఆధారంగా చెప్తున్న విషయం ఇది. ఈ సర్వేలో - జాతీయస్థాయిలో ఢిల్లీ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని పొందగా, మన ఓయూ రెండో స్థానాన్ని సొంతం చేసుకోవడం అత్యంత సంతోషకరమైన విషయం.

సుమారు పాతికేళ్లక్రితం ఇదే యూనివర్సిటీలో నేను రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివాను. యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ కూడా సంపాదించాను. ఆ రెండు కోర్సులు చదువుతూనే - పార్ట్ టైమ్‌గా 3 ఏళ్ల రష్యన్ డిప్లొమా కూడా చదివాను. అది రష్యన్‌లో డిగ్రీకి సమానం. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్.

కట్ టూ ది అదర్ షేడ్ - 

పోరాటాల గడ్ద అయిన ఓయూలో నేను చదువుతున్న ఆ నాలుగేళ్ల సమయంలోనే - రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మెంబర్‌గా (ఇది అప్పుడు కొన్నాళ్లు నిషేదించబడింది!), ఓయూ రైటర్స్ సర్కిల్ మెంబర్‌గా, ఇంకా దాన్లో దీన్లో బాగానే తిరిగాను. నా హాస్టల్ రూం మీద దాడి కూడా చేశారు. ఇదంతా నా అత్యంత దగ్గరి మిత్రులకు కూడా చాలా మందికి తెలియని ఓ ప్రత్యేక ఎపిసోడ్!

ఏది ఏమయినా - ఓయూలో ఆ నాలుగేళ్లూ నేను గడిపిన నా విద్యాజీవితం ఓ గొప్ప మధురస్మృతి!  

Sunday, 13 July 2014

నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్!

ఇవాళ రామ్‌గోపాల్ వర్మ తన ఫేస్‌బుక్ పేజ్ లో తెలుగులో ఒక పోస్ట్ పెట్టాడు.

ఫిలిం మేకింగ్, క్రియేటివిటీ, క్రిటిసిజం లకు సంబంధించి అందులో విషయం చాలా ఉంది. ఎవరో తన సినిమాని విమర్శించారని కాదు. విమర్శించడానికి ఆ రివ్యూయర్‌కు ఉన్న అర్హత ఏంటన్నది ఆయన ప్రశ్న.

సినిమా రామ్‌గోపాల్‌వర్మదా ఇంకొకరిదా అన్నది ఇక్కడ విషయం కాదు. 0/5 పాయింట్లు ఇచ్చేంత గొప్ప కాలిబర్ ఉన్న ఇలాంటి విమర్శకులు వాళ్లే స్వయంగా హాలీవుడ్ రేంజ్ బ్లాక్‌బస్టర్ సినిమాలెందుకు తీయకూడదు?

ఒక సినిమా చూసి ఇలా తీయాలి, అలా తీయాలి అని చెప్పడం ఏ దద్దమ్మయినా చేయగలడు. లక్షలు, కోట్లు కుమ్మరించి ఒక సినిమా తీసినప్పుడు మాత్రమే అసలు సినిమా ఏంటో తెలుస్తుంది.

వెబ్‌సైట్లలో పాయింట్లు ఇస్తూ, రివ్యూల పేరుతో పనికిరాని సొల్లు రాసే వీళ్లంతా ఇకనుంచీ వాళ్లు చెప్పే స్థాయి సినిమాలు తీయడం మొదలెడతారని ఆశిద్దాం. అప్పుడు మేకర్స్ వాళ్లే, రివ్యూయర్స్ కూడా వాళ్లే అవుతారు.
5 కు 5 పాయింట్లు వేసుకున్నా ఎవడూ అడగడు.

అసలు ఈ రివ్యూయర్ల రివ్యూలు చదివి సినిమాలకు వెళ్లేవాళ్ల సంఖ్య ఎంత?

కట్ టూ RGV పోస్ట్‌లోంచి కొన్ని కోట్స్ - 

> ఆ రివ్యూవర్ కి, వాడిలాంటి మిగతా రివ్యూవర్లకి నా మీద ఉన్న ద్వేషాన్ని చూసి నేను నవ్వలేదు.... ఏడ్చాను... ఎందుకంటే వాళ్ల మీద జాలితో.

> ఒక కెమెరాకి తలెక్కడో తోకెక్కడో కూడా తెలియకపోవడమే కాకుండా ఆ వెబ్ సైట్ లో వాడికి ఉద్యోగం లేకపోతే, ఒక ప్రొడక్షన్ యూనిట్ లో టీ-బాయ్ గా ఉండే అర్హత కూడా ఉండదనేది నా అభిప్రాయం కాదు, నమ్మకం.

> అసలు ఐస్ క్రీం లో తప్పులేంటో, ఏలా తీసుండొచ్చో, ఎలా తీసుండకూడదో నాకు చెప్పటానికి దమ్ముంటే వాడు నాతో ఒక టివిఛానల్ లో లైవ్ డిబేట్ కి రావాలని నా ఓపెన్ చాలెంజ్.

> నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్. కేవలం ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసి నోటికొచ్చినట్టు వాగటమే రివ్యూ అయితే సినిమా చూసిన ప్రతివాడు రివ్యూయరేగా. కాని కేవలం ఒక మ్యాగజైన్ కో, వెబ్ సైట్ కో పనిచేయడం మూలాన రివ్యూయర్ మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రేక్షకుడిగా ఫీల్ అవుతాడు.

> సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్ మొదలైన అంశాల సమ్మేళనం. ఆ సమ్మేళనం ఒక డైరెక్టర్ చేతిలో తన సెన్సిబిలిటీలో ఉంటుంది. ఆ సెన్సిబిలిటీకి కనెక్ట్ అవ్వనప్పుడు సినిమా నచ్చక పోవచ్చు.

> సినిమా హిట్టా, ఫ్లాపా అని విశ్లేషించడానికి 3 కారణాలుంటాయి. ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత రికవర్ అయ్యింది అనేది. ఎంతకి కొన్నారు, ఎంత వచ్చింది అనేది.. ఆ తరువాత ఒక ప్రేక్షకుడు ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాడు అనేది.

> కాస్ట్ వర్సెస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ఒక సినిమాకి కరెక్ట్ కొలబద్ద.
(ఆర్ట్ సినిమాల కొలబద్దలు వేరే ఉంటాయి. అది వేరే విషయం. ఇక్కడ చర్చ కమర్షియల్ సినిమా గురించి.)

> వ్యక్తిగతంగా కొందరికి సూపర్ హిట్ సినిమా కూడా నచ్చకపోవచ్చు. కొందరికి సూపర్ ఫ్లాప్ సినిమా కూడా నచ్చొచ్చు. కానీ చివరికి బాక్సాఫీస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం ఓనమాలు తెలిసినోడైనా చెబుతాడు.

> పాటలు, స్టార్లు, ఫైట్లు, కామెడీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ఐస్ క్రీం అనే సినిమాకి సూపర్ ఓపెనింగ్ రావడమే అందరికి షాక్ ఇచ్చింది.

> ఐస్ క్రీం కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు.

> నేను ఐస్ క్రీం లో ప్రవేశ పెట్టిన ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీ మున్ముందు ఒక ప్యారెలెల్ ఇండస్ట్రీని సృష్టిస్తుందని నా ప్రెడిక్షన్.

> నేనిక్కడ రాసింది చదివి వాళ్లు చేయగలిగేది కేవలం నా మీద ఇంకారెట్టించిన ద్వేషంతో రెచ్చిపోయి రాయడం. . నేను ఏనుగుని కాకపోవచ్చు కానీ ఆ సమీక్షకుడు మాత్రం ఖచ్చితంగా ఒక కుక్క.

జాకీ కాలిన్స్ అఫ్ ఇండియా

నాకత్యంత ఇష్టమైన అతికొద్దిమంది మన ఇంగ్లిష్ కాలమిస్టులు, నవలారచయిత్రుల్లో శోభా డే ఒకరు.

"సోషలైట్స్", "పేజ్ త్రీ పీపుల్" వంటి పదాల్ని, వ్యక్తుల్ని, వారి జీవనశైలి, వారి ఇతర వ్యవహారాల గురించి మొట్టమొదటగా నేను శోభా డే రచనల ద్వారానే తెలుసుకున్నాను.

దాదాపు ఆమె ప్రతి నవలలోనూ ఈ బ్యాక్‌డ్రాప్ ఎంతో కొంత ఉంటుంది.

తగినంత సెక్స్ కోటింగ్ కూడా ఆమె రచనల్లో ఒక అత్యంత సహజమైన విషయం.

ఒక మోడల్‌గా, ఫ్రీలాన్స్ రైటర్‌గా, నావెలిస్ట్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా.. ఆమె జీవితం మొత్తం పేజ్ త్రీ లైఫ్ స్టయిల్లోనే కొనసాగింది. ఇంకా కొనసాగుతోంది. బహుశా ఆమె రచనల్లో ఈ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణమై ఉండొచ్చు.  

ఒక రచయిత్రిగా తన రచనల్లో ఎలాంటి హిపోక్రసీ లేకుండా సెక్స్‌ని కూడా అలవోకగా, అద్భుతంగా రాస్తుంది కాబట్టే శోభా డే ని "జాకీ కాలిన్స్ ఆఫ్ ఇండియా" అంటారు కొంతమంది.  అయితే - ఈ పోలిక నాకు అస్సలు నచ్చని విషయం. శోభా డే రచనలతో పోలిస్తే జాకీ కాలిన్స్ రచనలు అత్యంత తక్కువ స్థాయి ఫిక్షన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.

మనవాళ్లు చాలా మంది శోభా డే రచనల్ని చాలా లైట్‌గా తీసుకుంటారు. కారణం బహుశా.. ఒక కాలమిస్ట్‌గా ఆమె రాసే నిర్మొహమాటపు రాతలు. అయితే - అనేక విదేశీ యూనివర్సిటీల్లో శోభా డే నవలలమీద పరిశోధనలు జరిగాయన్న విషయం బహుశా మనవాళ్లలో చాలామందికి తెలియదు.

ఇటీవల వచ్చిన రెండు మూడు తప్ప - శోభాడే రచనలన్నీ నేను చదివాను. సొషలైట్ ఈవెనింగ్స్, స్టారీ నైట్స్, స్ట్రేంజ్ ఆబ్సెషన్ నవలల్ని నేనింకా మర్చిపోలేదు.

ఆమె రాసిన నాన్ ఫిక్షన్‌లో నన్ను బాగా ఆకట్టుకున్నది "సెలెక్టివ్ మెమొరీ". ఆమె జీవితంలోని ఎన్నిక చేసిన కొన్ని జ్ఞాపకాలన్నమాట!

అన్సర్టెయిన్ లైజన్స్ ఒక్కటి తప్ప - శోభా డే రాసిన 20 పుస్తకాల టైటిల్సూ ఇంగ్లిష్‌లో "ఎస్" అక్షరంతోనే ప్రారంభమవుతాయి. బహుశా ఆమె సెంటిమెంటేమో!  

కట్ టూ శోభా డే 66 ప్లస్ - 

శోభా డే వైవాహిక జీవితం కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. తను మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత తనలాగే విడాకులు తీసుకున్న దిలిప్ డే ని వివాహం చేసుకుంది. అప్పటికే ఇద్దరికీ రెండు వైపుల నుంచీ ఇద్దరు చొప్పున పిల్లలున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ మరో ఇద్దరు పుట్టారు. "నీ పిల్లలు,నా పిల్లలు, మనిద్దరి పిల్లలు" స్టోరీ అన్నమాట!

గొప్ప విషయమేంటంటే - మొత్తం ఆరుగురు పిల్లలూ వారిద్దరిదగ్గరే, ఒక్కచోటే పెరిగారు.

జీవితం పట్ల, జీవనశైలి పట్ల అత్యంత మమకారం, ప్రేమ, వ్యామోహం ఉన్న స్త్రీలు ఎప్పుడూ నవయవ్వనంతోనే ఉంటారని ఎక్కడో చదివాను. ఈ విషయంలో శోభా డే ముందు వరసలో ఉంటారు.

66 ఏళ్లు దాటినా, శోభా డే ఇంకా చాలా క్రేజీగా కనిపిస్తుంది.. ఉంటుంది.. అనుక్షణం అలా జీవిస్తుంది. ఒక ఫ్రీలాన్స్ రైటర్‌గా, నావెలిస్టుగా తను అనుకున్నది రాస్తుంది. ఇంకా రాస్తోంది.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - ఒకవైపు ప్రొఫెషనల్ రైటర్‌గా సోషలైట్ జీవితంలో మునిగితేలుతూ, మరోవైపు కుటుంబంలో సంస్కృతి, సంప్రదాయాల్ని అత్యున్నతస్థాయిలో పాటించడం కూడా ఒక్క శోభా డే కే చెల్లింది.

అంత సులభం కాని, అసాధారణమైన ఆ బ్యాలెన్స్.. ఒక్క ఆమె వల్లనే సాధ్యమైంది.  

Thursday, 10 July 2014

తెలంగాణ సినిమా ఐకాన్!

బి. నరసింగరావు.

కవి, రచయిత, చిత్రకారుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, ఉద్యమకారుడు.. ఇంకెన్నో రంగాల్లో కొత్తబాటలు వేసిన సృజనశీలి.

ఆయన రూపొందించిన "మాభూమి", "రంగులకల", "దాసి" సినిమాలు లేకుండా తెలంగాణ సినిమా లేదు.

నా మిత్రుడు గుడిపాటి "పాలపిట్ట" తెలంగాణ ప్రత్యేక సంచికలో బి. నరసింగరావు ఇంటర్వ్యూ ఇప్పుడే చదివాను. ఆయన గురించీ, ఆయన రూపొందించిన ఒక్కో సినిమా గురించీ ఒక్కో పుస్తకమే రాయొచ్చు. బ్లాగ్‌లో ఏం రాస్తాను?

అందుకే నేనేం రాయట్లేదు. కేవలం ఆ ఇంటర్వ్యూలోని ఆయన మాటల్ని, ఆలోచనల్ని కొన్నింటిని మాత్రం ఇక్కడ కోట్ చేస్తున్నాను.

ఇలా కోట్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. తెలంగాణ అవతరణ తర్వాత, ఒక చారిత్రక అవసరంగా కూడా భావిస్తున్నాను.

కట్ టూ బి.నరసింగరావు -

> మృణాల్ సేన్ గారిని "మాకు ఫిల్మ్ చేయాలి మీరు" అంటే, "ఎంత మీ బడ్జెట్?" అని అడిగారాయన. లక్షరూపాయలని చెప్పాను. నిజానికి అవికూడా లేవు. ఇల్లు తనఖాపెట్టి తేవాల్సిందే తప్ప!

> ప్రభాకర్‌రెడ్డి డైరెక్టర్ శంకర్ (జై బోలో తెలంగాణ) కు చెప్పిన నీతేమిటంటే - "నేను తెలంగాణవాణ్ణి" అంటే నీకిక్కడ అవకాశాలు దొరకవు. వాళ్లతో ఉండి నేర్చుకుని పైకి రావాలి తప్పిస్తే వేరే గత్యంతరం లేదు. నేనూ అలాగే వచ్చాను.

> ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రావారి చేతిలో ఉంది. వాళ్లు మేము సీమాంధ్రకు చెందినవారం అని అనుకోరు. Cinema is a business to them.

> తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవారందరికీ ఉన్న ఎగ్జిస్టెన్స్ సమస్యవల్ల తెలంగాణ భాష, యాసల్ని పట్టించుకునే వీలు కుదర్లేదు. అలాగే హీరో కాంతారావు కూడా. అతనిది నల్గొండ జిల్లా కోదాడ. ఆ తర్వాత శంకర్ వచ్చి "ఎన్‌కౌంటర్", "శ్రీరాములయ్య" లాంటి సినిమాలు తీశాడు. నిలదొక్కుకోవడం ఎవరికయినా ముఖ్యమే కదా!

> నాకూ, మిగిలినవాళ్లకు తేడా ఏమిటంటే - నేను నా డబ్బుతో సినిమాలు తీశాను. ఇంకొకళ్లమీద ఆధారపడలేదు. ఈ కథ నడుస్తుందా, ఈ భాష పర్వాలేదా అన్న సమస్య రాలేదు.  

> ఒకసారి పి వి నరసిం హారావు గారితో "దాసి" సినిమాలో అతిగా చూపించానా అని అడిగినప్పుడు ఆయనొక మాటన్నాడు. "నేను జీవితంలో చూసినదాంట్లో 15 శాతం మాత్రమే నువ్వు చూపించావు" అని.  

> ఇక తెలంగాణ వచ్చిన తర్వాత జరగబోయేదేమిటంటే - శంకర్ లాంటి దర్శకులు లీడ్ తీసుకుంటారు. నాలాంటివాళ్లు వెనక బెంచ్‌లో ఉంటారు.

> ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నా ఆలోచన ఏమిటంటే - ఇప్పుడున్న కమర్షియల్ ధోరణిలో కాకుండా గురుదత్, మహబూబ్‌ఖాన్, నితిన్ బోస్ లాంటి ఒక జనరేషన్ ఎలా వచ్చిందో, రాజ్ కపూర్, బిమల్ రాయ్ వంటివాళ్లు ఎలా రూపొందారో పరిశీలిస్తే.. వారిలో ఉండే కమిట్‌మెంట్ మంచి సినిమాకు ఎలా దారితీసిందో అర్థమవుతుంది.  

Wednesday, 9 July 2014

ఉద్యమనాయకుడే ముఖ్యమంత్రి అయితే!

"తెలంగాణ వచ్చుడో .. కె సి ఆర్ సచ్చుడో!"
"కామారెడ్డిలో చెల్లని రూపాయి .. ఎల్లారెడ్డిలో చెల్లుద్దా?"
"గాడిదలకు గడ్డేసి, ఆవులకు పాలు పిండితే వస్తయా?"
"పందిలెక్క పదేళ్లు బతకడంకన్నా, నందిలెక్క నాలుగురోజులు బతికితే చాలు!"
"లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే!"
"తంతే లేవనోడు గోకితే లేస్తాడా?"
"దొంగది కాదు..దొడ్లకు రాదు!"
"మాంసం తింటానం అని బొక్కలు మెడలేసుకుంటామా?"
"దున్నపోతుకు తెల్లరంగేస్తే ఆవు అవుతదా?"
"కత్తి ఒకనికిచ్చి యుధ్ధం ఒకన్ని చెయ్యమంటె అయితదా?"
"కొసదాక కొట్లాడెటోడె సిపాయి!"

ఇలాంటి లెక్కలేనన్ని అచ్చ తెలంగాణ సామెతల్ని సందర్భోచితంగా, అవలీలగా పేల్చడంలో కె సి ఆర్ తర్వాతే ఎవరయినా!

మొన్నటిదాకా కె సి ఆర్ స్పీచ్ అంటేనే ఒక ఫిరంగుల మోత. ఒక సునామీల సీరీస్. మరిప్పుడో?

ఇప్పుడలాంటివేం లేవు.

కంచె అవతలనుంచి ఎన్ని కవ్వింపు చర్యలు జరుగుతున్నా పెద్ద రియాక్షన్ లేదు. ఢిల్లీ స్నేహంతో పరోక్షంగా అవతలివాళ్లు ఆర్డినెన్సులు తెచ్చుకుంటున్నా, ఇంకేదేదో చేస్తున్నా ఇదివరకటిలా రెచ్చిపోవడంలేదు.

ఇప్పుడు కె సి ఆర్ రెచ్చిపోడు.

ఇప్పుడాయన ఉద్యమనాయకుడు కాదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఆ స్థాయిలో ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తున్నాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు.

కాకపోతే కె సి ఆర్ స్టైల్ కె సి ఆర్ దే.  

తెలంగాణ ఏర్పాటు, తదనంతర పరిణామాల రాజకీయ చదరంగంలో - ప్రత్యర్థి ఎత్తులు కూడా పది స్టెప్పులు ముందే వేసుకుని, చెక్ మీద చెక్ పెట్టి, అందర్నీ ఒక ఆట ఆడి అవతలపడేసిన కార్పోవ్, కాస్పరోవ్, ఆనంద్.. అన్నీ అతనే.

ఒక్క కె సి ఆర్.

అందుకే చుట్టూ తాటాకు చప్పుళ్లు వినిపిస్తున్నా, కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఉద్యమం నాటి ఆయన మాటల ప్లేస్‌లో బుల్డోజర్లు పనిచేస్తున్నాయి. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సింబాలిక్‌గా ఆయన లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుపుతున్నాయి.

ఒక ఉద్యమనాయకుడు ఒక రాష్ట్రాధినేత అయ్యాడు. ఒక రియల్ స్టేట్స్‌మన్ అయ్యాడు.

60 ఏళ్ల తెలంగాణ లక్ష్యాన్ని ఛేదించిన కె సి ఆర్ ముందు ఇప్పుడో బ్లూప్రింట్ ఉంది. అది బంగారు తెలంగాణ బ్లూప్రింట్. ఇప్పుడాయన ఏకాగ్రతంతా దానిపైనే. దాన్నెలా, ఎంత తొందరగా నిజం చేయాలన్నదానిపైనే.

అదే లేజర్ ఫోకస్.

ఆ లేజర్ ఫోకస్ ముందు ఏ కవ్వింపులూ ఎందుకూ పనికిరావు. ఇది అందరికీ తెలిసిన నిజమే. ముఖ్యంగా తెలియాల్సినవాళ్లకి!   

Monday, 7 July 2014

లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కోసం!

సాంకేతికంగా ఫిలిం మేకింగ్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మేకింగ్ విధానంలో ఊహించని మార్పులు వచ్చాయి.

ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం - మన టాలీవుడ్‌లో - అంతా కొత్తవారితో, లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, అతి తక్కువ బడ్జెట్లో తీస్తున్న ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలు బాగా బిజినెస్ చేస్తున్నాయి. కొన్ని థ్రిల్లర్స్ కూడా.

ఈ నేపథ్యంలో - సినిమా రంగంపట్ల ఆసక్తి ఉండి, ఈ ఫీల్డులో చిన్న స్థాయిలోనయినా పెట్టుబడి పెట్టగల లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాము.

కనీస పెట్టుబడి 10 లక్షలు. ఈ పెట్టుబడికి ప్రపోర్షనేట్‌గా మీకు షేర్ ఉంటుంది. ఆసక్తి, సామర్థ్యం, సౌలభ్యం ఉన్న ఇన్వెస్టర్లు పూర్తి పెట్టుబడితో "సోలో ప్రొడ్యూసర్స్‌" గా కూడా ముందుకు రావచ్చు.

ఈ అవకాశం కేవలం సినీఫీల్డుపట్ల ఆసక్తి ఉండి, ఈ రంగంలోకి రావాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లకు మాత్రమే!  

ఇదంతా లీగల్‌గా, లిఖితపూర్వకంగా ఉంటుంది. కో-ప్రొడ్యూసర్‌గా మీ పేరు టైటిల్ కార్డ్స్‌లో తెరమీద వస్తుంది. ప్రెస్ నోట్స్ అన్నిట్లోనూ మీ పేరు వస్తుంది. ప్రెస్ మీట్స్‌లో కూడా మీరు కూర్చోవచ్చు. అన్నిటినీ మించి, సినిమా ప్రొడక్షన్ బిజినెస్‌ను ప్రత్యక్షంగా, సంపూర్ణంగా తెలుసుకొనే అవకాశం మీకు లభిస్తుంది. మరెన్నో లాభాలుంటాయి.

ఏది ఎలా ఉన్నా - ప్రాజెక్టు మొత్తం కేవలం 5 నుంచి 6 నెలల్లో పూర్తయిపోతుంది.

నిజంగా సినీ ఫీల్డుపట్ల, ఈ బిజినెస్ పట్ల ఆసక్తి ఉండి - తక్కువస్థాయిలోనయినా వెంటనే పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న కొత్త, యువ ఇన్వెస్టర్స్ మాత్రమే - పూర్తి వివరాలకోసం వెంటనే మీ మొబైల్ నంబర్ తెలుపుతూ ఒక ఈమెయిల్ పంపించండి. మీకు మా ఆఫీస్ నుంచి వెంటనే కాల్ వస్తుంది. లేదా నేనే చేస్తాను.

ఇదీ మా ఈమెయిల్ అడ్రెస్: mchimmani10x@gmail.com

Friday, 4 July 2014

రూలర్ సాదిక్!

"పోలవరం కట్టేది లేదు.
మేము కదిలేది లేదు.
మా ప్రాంతాన్ని వదిలేది లేదు.
అడవితల్లి మీద ఆన!"

ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్టుల్ని రాయడం గానీ, షేర్ చేయడం గానీ అంత మామూలు విషయమేం కాదు.

కానీ, ఈ మధ్యకాలంలో ఇదే ఆయన దినచర్య అయి కూర్చుంది. చూస్తుండగానే.. ఈ విషయంలో ఆయనే మరో మేథాపాట్కర్ అయినా ఆశ్చర్యం లేదు.

పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాంతపు ఆదివాసీల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తూ ఇటీవలే దానిమీద తెచ్చిన ఆర్డినెన్స్ ఆయన్ని అలా మార్చివేశాయి.

ఇదొక్కటేనా...

ఇలాంటి ఎన్నో సామాజిక సమస్యలపట్ల నిద్రాహారాలు మానుకొని, నిరంతర మథనం చేస్తుంటాడాయన. అలాంటివాడు కాబట్టే - ఫేస్‌బుక్‌లో ఆయనకు పెట్టే జన్మదిన శుభాకాంక్షలు ఇలా కూడా ఉంటాయి:

"బడుగు జీవుల వ్యథను తీర్చాలనే మీ ఆరాటం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనీ, మీకు విజయం కలగాలనీ ఆశిస్తూ.. మీకివే జన్మదిన శుభాకాంక్షలు!"

మీడియాలోని దాదాపు అన్ని రూపాల్లో, విభాగాల్లో, ఇతర వ్యాపారాల్లో.. చివరికి, స్పిరిచువాలిటీలోనూ మునిగితేలిన ఈ మిత్రుడు నాకు యూనివర్సిటీలో ఒక సంవత్సరం సీనియర్.

దాదాపు పాతికేళ్లక్రితం - యూనివర్సిటీ నుంచి ఒరిస్సా వెళ్లినప్పటినుంచీ మా స్నేహం ఇంకా కొనసాగుతోందంటే ఆశ్చర్యం లేదు. మా స్నేహంలోని ఆ సౌరభం ఖచ్చితంగా నా మిత్రునిదే.

1987 లో తొలిసారిగా "ఉదయం" దినపత్రిక తిరుపతి ఎడిషన్లో నా మిత్రుడిదగ్గర ట్రైనీ సబ్-ఎడిటర్‌గా చేరిన కట్టా శేఖర్ రెడ్డి ఈ రోజు "నమస్తే తెలంగాణ" దినపత్రిక ఎడిటర్ కావడం ఆయన చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతాడు.

యూనివర్సిటీలో ఆయన పి డి ఎస్ యు నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన జెండాలు మోసిన సహచరులు.. ఇప్పుడు ప్రెస్‌లోనూ, రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ రకరకాల ఉన్నత స్థానాల్లో ఉండటం విశేషం.

కొన్ని నెలల్లో మరణిస్తుందని తెలిసిన కన్నతల్లికోసం - సుమారు ఆరు నెలలపాటు అన్నీ వదులుకొని, ఇంటికే పరిమితమై.. ఆ కన్నతల్లికి అన్ని సపర్యలూ చేసి, అన్నీ తానే అయి.. కడదాకా కంటికిరెప్పలా చూసుకున్న నా మిత్రుడి వ్యక్తిత్వం గురించి ఏం చెప్పను?

కట్ టూ కర్టెన్ రెయిజర్ -  

ఇటీవలే ఫేస్‌బుక్‌లోకి ఎంటరయిన నా మిత్రుడి గురించి ఈ 9 మినిట్ బ్లాగ్‌లో అంతా ఎలాగూ చెప్పలేను. కొంతయినా మీతో పంచుకుందామనే ఈ పోస్టు. నేనెంతో గర్వంగా ఫీలయ్యే ఈ మిత్రుడు అతి త్వరలో ఓ మేగజైన్ ప్రారంభిస్తున్నాడు.

నన్ను ఎప్పుడూ "సోదరా" అనో, "మనూ" అనో పిలిచే నా ఈ మిత్రుడు మరెవరో కాదు.

సాదిక్.

ఇంక నా మిత్రుడు ప్రారంభించబోతున్న మేగజైన్ పేరు, అది సాధించబోయే సంచలనం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను!  

Thursday, 3 July 2014

సెక్సీయెస్ట్ వుమన్ ఇన్ ది వరల్డ్!

FHM మెన్స్ మేగజైన్ ఇటీవల నిర్వహించిన "సెక్సీయెస్ట్ వుమెన్ ఇన్ ది వరల్డ్" పోల్‌లో దీపికా పడుకొనే కూడా ఎన్నికైంది.

ఈ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్‌లో .. దీపికతోపాటు మరో 99 మంది "ప్రపంచపు సెక్సీయెస్ట్ వుమెన్" గురించి ఫీచర్ ఉంటుంది.  

దీపిక అభిప్రాయం ప్రకారం: "నా అందానికీ, ఈ పోల్‌లో నేను ఎన్నిక కావడానికీ ఎలాంటి సంబంధం లేదని నేననుకుంటున్నాను. నేను నటించిన సినిమాలు, వాటిలో నాకు లభించిన అద్భుతమైన పాత్రలే నాకీ పట్టం కట్టాయన్నది నా ఉద్దేశ్యం."

వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా అదే.

అంతకుముందు దీపికా పడుకొనే అంటేనే నేనసలు పట్టించుకోలేదు. కానీ, దీపిక నటించిన "యే జవానీ హై దివానీ" సినిమా చూసినప్పట్నుంచీ దీపికని, ఆమె సినిమాల్నీ బాగా పట్టిచుకుంటున్నాను. ఆ చిత్రంలోని నైనా పాత్రలో దీపిక, ఆ పాత్రలో ఆమె నటన నన్ను అంతగా ఆకట్టుకొంది!

మొత్తంగా YJHD చిత్రం నన్నెంతగానో ఆకట్టుకొంది అన్నది వేరే విషయం. కానీ, తను ప్రేమించినంత మాత్రాన, ఎదుటివ్యక్తి తన సృజనాత్మక జీవనశైలిని కోల్పోనవసరంలేదని చెప్పే "హద్దులు పెట్టని ప్రేమ"కి నిజమైన నిర్వచనమిచ్చింది ఆ చిత్రంలోని నైనా పాత్ర.

ఆ పాత్రలో పూర్తిగా ఒదొగిపోయి, అద్భుతంగా ఒప్పించింది దీపిక!

అందం, అందాల ఆరబోత, హగ్గులు, కిస్సులు మాత్రమే సెక్స్ అప్పీల్ ఇవ్వవు. తన వ్యక్తిత్వంతో అందంగా ఆకట్టుకోవడం కూడా చాలా సందర్భాల్లో ఎంతో సెక్సీగా ఉంటుంది! 

Monday, 30 June 2014

ఫేస్‌బుక్ పనికిరానిదని ఎవరన్నారు?

అంతరించిపోతున్న తెలుగు కవిత్వాన్ని బ్రతికిస్తూ, ఇంకెందరో కొత్త కవులు పుట్టడానికి కారణం అవుతూ.. "కవి సంగమం" గ్రూప్‌తో ఫేస్‌బుక్‌ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చో నిరూపించిన 'కవి యాకూబ్' నా మిత్రుడు అని చెప్పుకోడానికి నేను గర్వపడతాను.

యూనివర్సిటీ రోజుల్లో మేం క్లాస్‌మేట్స్, హాస్టల్‌మేట్స్ కూడా.

యాకూబ్ మత నేపథ్యం ముస్లిం అయినా .. అద్భుతమయిన తెలుగు కవిత్వం వాడి చిరునామా. యాకూబ్ రాసిన కవితా సంకలనాలు కొన్ని ఇంగ్లిష్, ఇంకా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి!

కట్ టూ పాయింట్ - 

ఫేస్‌బుక్‌లో "మణిమాలిక" అని ఓ చిన్న క్లోజ్‌డ్ గ్రూప్ ఉంది. అదీ కవిత్వానికి సంబంధించిందే. కాకపోతే.. వాళ్లు పెట్టుకున్న కొన్ని రూల్స్ ప్రకారం కేవలం రెండు లైన్లలోనే చెప్పాల్సిన భావం చెప్పాల్సి ఉంటుంది. ఆ రెండు పాదాల కవిత్వం పోస్టులకు పెట్టే కామెంట్స్ నిజంగా ఒక హైలైట్! చాలాసార్లు ఆ కామెంట్స్ కూడా మళ్లీ మణిమాలిక కవిత్వం అవుతుంది!

ఇలా రాసిన కవితల్లోని ది బెస్ట్ మణిమాలికల్ని ఎన్నిక చేసి, ఆ గ్రూప్ కూడా ఈ మధ్యనే ఓ పుస్తకం పబ్లిష్ చేసింది! ప్రముఖ కవి శివారెడ్ది, తణికెళ్ల భరణి, సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథులుగా జరిగిన ఈ ఫేస్‌బుక్ గ్రూప్ బుక్ రిలీజింగ్ ఫంక్షన్ భారీ సక్సెస్‌కి ఆ గ్రూప్ సభ్యుడు (ఇప్పుడు అడ్మిన్ కూడా!), నా ఇంకో మిత్రుడు దయానంద్ రావ్ మూలకారణం. అంతకు ముందే నా మిత్రుడురావ్ మంచి భావుకుడు. యూనివర్సిటీ రోజుల్లోనే ఈ మిత్రుని భావుకత్వం నాకు బాగా తెలుసు. ఇప్పుడు కవిగా కూడా నిరూపించుకున్నాడు.

గ్రూప్ చీఫ్ అడ్మిన్  ప్రసాద్ అట్లూరి గారికి కుడిభుజమై, అంతా తానై, ఆ పుస్తకాన్ని సమయానికి అచ్చు వేయించి, యాకూబ్ ద్వారా సమావేశాన్ని అద్భుతంగా సక్సెస్ చేసాడు నా మిత్రుడు.

ఈ బుక్ ఫంక్షన్ విషయంలో యాకూబ్, యాకూబ్ జీవన సహచరి, కవయిత్రి శిలాలోలిత ల సహకారాన్ని, ప్రోత్సాహాన్ని మర్చిపోకూడదని .. యాకూబ్ ఇంట్లోనే ఓ చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాడు నా మిత్రుడు రావ్. ప్రతాప్ రెడ్డి, సైది రెడ్ది, రాందాస్, విజయ్ కుమార్ వంటి నా ఇతర యూనివర్సిటీ మిత్రులు వచ్చిన ఆ మీట్‌కి నేనూ వెళ్లాను.  

ఆ మీట్ కూడా మరో మంచి సక్సెస్. మళ్లీ .. క్రెడిట్ గోస్ టూ మిస్టర్ రావ్, నా మిత్రుడు.

ఆ మీట్‌లో జరిగిన ఎన్నో చర్చలు నన్ను మరోమారు నా జీవితగమనాన్ని పునరాలోచించుకునేలా చేశాయి. సంవత్సరాలుగా నేనేం కోల్పోతున్నానో, ఎందుకు కోల్పోతున్నానో నన్ను నేను విశ్లేషించుకునేలా చేసింది. పార్టీలో పాల్గొంటూనే అంత అంతర్మథనం నాలో!

కొత్త ఆలోచనలు. కొత్త యాక్షన్ ప్లాన్‌లు. కొత్త వేగం. అన్నిటి సారాంశం.. ఇంక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేను కోల్పోయిన ఫ్రీడమ్‌ని వెనక్కి తెచ్చుకోవడం!

ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. అదొక్కటే పనిలో ఉన్నాను.

ఆ మీట్‌కి, నా మిత్రులకు, మీట్‌కి కారణమైన ఆ "మణిమాలికలు" పుస్తకానికి, ఆ పుస్తకం ఆవిర్భావానికి కారణమైన ఫేస్‌బుక్‌కీ.. థాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను?  

Wednesday, 25 June 2014

తెలుగు ఫిలిం ఛాంబర్ Vs తెలంగాణ ఫిలిం ఛాంబర్!

చాలా మేథావులు ..

కేవలం ఒక్క పదం మార్పుతో మళ్లీ ఇక్కడివాళ్లందరినీ బకరాలు చేసి, మునుపటి ఆధిపత్యం, మునుపటి దోపిడీనే కొనసాగించొచ్చని వాళ్ల ఐడియా. స్ట్రాటజీ.

తెలంగాణ సినీ దర్శకులు, ప్రొడ్యూసర్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకొని, ఎవరికి తోచిన విధంగా వాళ్లు పది రోజులకు ఒక్కసారి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్తున్నారు. ఈ ఒక్క సంకేతం చాలు అవతలివాళ్లకి.. విడగొట్టి ముందటి పబ్బమే కొనసాగించడానికి!

అత్యధికశాతం మంది సీమాంధ్రులు ఉన్న ఎ పి ఫిలిం ఛాంబర్ పేరును ఇప్పుడు "తెలుగు" ఫిలిం ఛాంబర్ అని మార్చటం అవసరమా? ఎ పి ఫిలిం ఛాబర్ ను ఎవ్వరూ ఇక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పడం లేదే! ఎందుకంత భయం?

అక్కడ సెక్రెటేరియట్ రెండుగా ఎలా విడిపోయిందో.. అసెంబ్లీ ఎలా రెండుగా విడిపోయిందో.. అదే విధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ కూడా విడిఫోక తప్పదు. ఎవరి ఛాంబర్ వారిది. ఎవరికి తోచినవిధంగా వాళ్లు పని చేసుకుంటారు. అంత సింపుల్ విషయాన్ని మొన్న తమ్మారెడ్ది భరధ్వాజ, నిన్న మురళీమోహన్ చాలా విచిత్రంగా రకరకాల స్టయిల్స్‌లో చెప్తున్నారు!  

అంత అవసరం లేదు. ఒక్కసారి విడిపోయాక అన్నీ విడిపోక తప్పదు. ముఖ్యంగా ఈ ఫీల్డులో ఉన్నంత ఆధిపత్యం, అణచివేత మరెక్కడా లేదు. ఇంకా ఎందుకీ ముసుగులు?

రాష్ట్రాలే విడిపోయాయి. ఇంక ఈ ఫిలిం ఛాంబర్లు ఎంత? విడిపోక తప్పదు.

ఎవరి సినిమాలు వాళ్లు ఎవరితోపడితే వాళ్లతో తీసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరూ కాదనరు. ఆధిపత్యం దగ్గరే అసలు సమస్య. ఇదంతా అనుభవించినవారికి తెలుస్తుంది. బయటినుంచి ఎవరు ఎన్నయినా నీతులు చెప్పొచ్చు. అది చాలా ఈజీ.

ఇదొక్కటే కాదు. విడిపోవటమంటూ జరిగితే బయటికి వచ్చే ఛాంబర్ లెక్కలు, భూములు, ఫ్లాట్లు, ఇళ్ల కేటాయింపులూ.. చాలా ఉన్నాయి. దాన్నించి తప్పించుకోడానికే ఇదంతా. ఎన్నడూ లేని ఈ హడావిడి.
ఈ "తెలుగు" స్ట్రాటజీ.

కనీసం క్రియేటివిటీ దగ్గరయినా చెత్త పాలిటిక్స్, కల్మశం లేకుండా విడిపోయి స్వఛ్ఛంగా బ్రతుకుదాం. స్వేఛ్ఛగా బ్రతుకుదాం.